28, మే 2024, మంగళవారం

⚜ *శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయం*

 🕉  *మన గుడి : నెం 330*


⚜ *కర్నాటక  :-*


*అద్యపాడి- దక్షిణ కన్నడ ప్రాంతం*


⚜ *శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయం*



💠 భారతదేశంలో దుర్గ ఆరాధన అతిప్రాచీన కాలంనుండి కొనసాగుతోంది.

భక్తుల యొక్క  కోరికలను నెరవేర్చే

సింహవాహినికి వృక్షాలు, పువ్వులు,  జంతువులు‌, పక్షులు సర్వం ప్రీతిపాత్రమైనవే.


💠 పచ్చదనాల ప్రకృతి మాత ఒడిలో నిర్మితమైనదే అద్యపాడి

దుర్గా పరమేశ్వరీదేవి ఆలయం.


💠 శంకరీదేవి పంకరాజా  యొక్క సహోదరి. దుర్గాదేవికి  పరమ భక్తురాలు. 

కొండలూ , కోనలతోవున్న ఇరవై రెండుగ్రామాలకు అధికారిణి.

ఆ సమయంలో మంగళూర్ ను సోయిదేవన్ అనే రాజు పాలిస్తూ వుండేవాడు.

అతడు అసమర్ధుడు కావడంతో అతని రాజ్యంలో నుండి ఏడు గ్రామాలు  శంకరి వశంలోకి వచ్చేయి.


💠 శంకరీదేవి పరిపాలించే రాజ్యంలో

తిమ్మా,బొమ్మా అనే దొంగలు భీభత్సం సృష్టించి బాటసారులను, గ్రామస్తులను

దోచుకోసాగారు. 

రాజ్యంలో శాంతి కరువైంది.

శంకరి గొప్ప తపశ్శాలి , దేవీ కటాక్షంపొందిన  దమణ మహర్షిని ఆశ్రయించింది.


💠 తనని ఆశ్రయించిన శంకరి రాణికి ప్రజల సమస్య తీరుస్తానని దమణ మహర్షి

అడవిలోని దొంగలని  కలుసుకున్నాడు

దమణ మహర్షి .

మహర్షి యొక్క తీక్షణమైన , శక్తివంతమైన చూపులకే భయపడిన దొంగలు మహర్షిని శరణు కోరారు. తాము అపహరించిన సంపదనంతా తిరిగి యిచ్చి వేసి, మహర్షి బోధనలతో,సన్మార్గంలో జీవించసాగారు.


💠 దమణ మహర్షి ఆదేశంతో, శంకరీదేవి అద్యపాడి లో దుర్గాపరమేశ్వరికి ఒక

ఆలయం నిర్మించింది. ఎన్నో తరాలు మారి  దేవాలయం కాలగర్భంలో కలసిపోయింది. తరువాత కాలంలో ఆ స్ధలంలో ఒక గ్రామం వెలసింది. అక్కడ వున్న  ఒక పెద్ద వృక్షాన్న నాగులు సంచరించడం గమనించిన

ఒక పేద దంపతులు ఆ నాగులను భక్తి శ్రధ్దలతో  పూజించడం మొదలుపెట్టాక వారి జీవితం ఉన్నతస్థాయికి వచ్చి ఆ పేద దంపతులకు

సుఖశాంతులు లభించాయి.


💠 ఒకనాడు  దుర్గాదేవి వారి స్వప్నంలో కనిపించి తనకి ఆలయం నిర్మించమని ఆదేశించింది. ఆ దంపతులు  ఆలయ నిర్మాణానికి ప్రసన్న జోస్యం చూసి, పాత ఆలయం వున్న చోటనే తిరిగి ఆలయం  పునర్నిర్మించారు.


💠 దుర్గాదేవికి ప్రియమైనప్రకృతి పచ్చదనాల వడిలో  ఈ ఆలయం వున్నది. 

కొండమార్గంలో దూరం నుండే  కనిపించే గోపుర శిఖరాన్ని దర్శించి‌ ముందుకు సాగితే అక్కడ క్రింద కి పలు మెట్లవరస కనిపిస్తుంది. ఆ మెట్లు దిగివెళితే ఎదురుగా నాగ యక్షి  వృక్ష పైభాగాన్ని దర్శిస్తాము. ఆ వృక్షం క్రింద రక్తేశ్వరి, బ్రహ్మదేవుని, నాగదేవుని, నంది గోనా, గుళిక దైవా, వ్యాఘ్ర చాముండి మొదలైన దేవతల విగ్రహాలు దర్శనమిస్తాయి.


💠 సమీపాన వున్న కొన్ని మెట్లుమీదుగా పైకి ఎక్కి తే చదరంగా, తుళునాడు బాణీలో కట్టబడిన ప్రదక్షణ బాట ద్వారా ప్రధాన ఆలయంలోకి ప్రవేశిస్తాము.

అక్కడ ముందుగా వలంపురి వినాయకుని దర్శించి గర్భగుడిలోకి ప్రవేశిస్తాము.


💠 శంఖు చక్రములను , ధరించి, అభయ వరద రూపిణిగా, అలంకారభూషితయై,

ఆశీనురాలైన  దుర్గా పరమేశ్వరి  దేవి దర్శనం భక్తులకు కలుగుతుంది.


💠 దుర్గాదేవి ని దర్శించుకొని

కొన్ని మెట్లు దిగితే అక్కడ ఉప దేవతల సన్నిధులు , మరల మరి  కొన్ని మెట్లు దిగితే  ఆలయ క్రింది అంతస్తుకి చేరుకుంటాము.

అక్కడ నాగ యక్షి వృక్ష మధ్య భాగమున  చుట్టూ పెద్దపుట్ట  వుంటుంది. 

అందులోపల ఆదిలో ప్రతిష్టించబడిన

మూల దేవతా విగ్రహం అక్కడ

వున్నదని ఐహీకం.


💠 ఎడం ప్రక్కన వున్న నూతి

వద్ద మూలగా  ఒక గుహవుంది. 

ఆ గుహలో  శ్వేత నక్షత్ర తాబేలు  వుంది అని చెప్తారు.


💠 గుహ ప్రవేశ ద్వారము వద్ద  వృక్షం యొక్కవేరు భాగము తెలుస్తుంది.

ఈ గుహ లోపలి నుండి వెడితే, అద్యపాడి  ఆది నాదేశ్వరుని ఆలయానికి  చేరుకోవచ్చని చెప్తారు.


💠 గుహలోవున్న  నీటిలో దమణ మహర్షి జీవించి వున్నట్టు చెప్తారు. 

అయితే ఆ గుహ లోపలికి వెళ్ళి

తిరిగి వచ్చిన వారు లేరు.


💠 సంవత్సరం పొడవునా, దుర్గా పరమేశ్వరీ దేవికి అనేక ఉత్సవాలు జరగుతున్నా,  రధోత్సవం,  నవరాత్రి ఉత్సవాలు,  దీపోత్సవాలు మాత్రం  అత్యంత ఘనంగా  జరుపుతారు.


💠 ప్రకృతి అందాలతో నిండి

వున్న  యీ ఆలయం దర్శనం రమణీయంగా వుంటుంది. ఒక సాహసయాత్ర ను తలపింపజేస్తుంది .


💠 ఈ అద్యపాడి దుర్గా పరమేశ్వరీ దేవి ఆలయం దక్షిణ కర్ణాటక లో మంగుళూర్ కు సమీపంలోని బజ్పే విమానాశ్రయానికి ఒక 10 కిమీ దూరంలో వుంది.


💠 దుర్గాపరమేశ్వరి సదా తనను చూడవచ్చినవారిని తన కరుణా కటాక్షాలతో  అనుగ్రహించి కాపాడుతూనే వుంటుంది

కామెంట్‌లు లేవు: