*మహాభారత యుద్ధంలో విధురుని పాత్ర*
🏹🏹🏹🏹
విదురుడు యుద్ధ విద్యలు నేర్చిన వాడే. పాండురాజు తన బిడ్డల బాధ్యత తన సోదరులిద్దరి మీద పెట్టి పోయాడు. పెద్ద వాడు పుత్ర మోహాంధుడై తన కర్తవ్యం విస్మరించాడు. చిన్న వాడు విదురుడు బాధ్యతతో మెలగాడు.
మాయాజూదంలో పాండవులను పద భ్రష్టులను చేసిన ఆనందం లో ఇపుడు మన పాలన ఎట్లా ఉంది? అని పట్టరాని ఆనందంలో అడిగాడు ధృతరాష్ట్రుడు విదురుణ్ణి.
నిజంగా నీ శ్రేయస్సు కోరే వాళ్లు పాండు పుత్రులు. వాళ్లను పిలిపించి , ఆదేశించినపుడు నీకు కీర్తి, గౌరవం అని మంచి చెప్పాడు విదురుడు.
"నీకు వాళ్లే కనిపిస్తారు. నా బిడ్డలు ఎంత గొప్ప వాళ్లైనా నీ కంటికి ఆనరు . నీ (పాడు) మొగం చూపించక దూరంగా వెళ్లి పో —నీ కిష్టమైన చోట ఉండు"— అని బహిష్కరించాడు .
ఆయన వెళ్లి పోయాడు. మళ్ళీ ఏమనుకొన్నాడో! తనకు అప్రతిష్ఠ ఔతుంది-' అని భయపడ్డాడో ఏమో! దొంగ ఏడుపులు ఏడుస్తూ "నా తమ్ముడు నన్ను వదలి పోయాడు. పిలుచుకురా" అని సంజయుణ్ణి పాండవుల దగ్గరకు పంపాడు.
తర్వాత విదురుడు అంతంత లోనే ఉండి తన విధులు నిర్వర్తిస్తూ వచ్చాడు. రాజ్య తంత్ర నిర్వహణ ఈయన, ఆవాపం (అంటే పరరాజ్య చింత— భీష్ముడు… నిర్వహించే శాఖలు.
తర్వాత పాండవుల పాలు వాళ్లకు ఇచ్చి వేయవలసిన రోజు వచ్చింది. [సంపద దక్కి యుండగ అశక్తులనం జను మమ్ము పిల్చి పూజింపగ అంత బేలె పతి? అంటాడు ధర్మ రాజు. అది ఆ నాటి పరిస్థితి. ] రాయబారం చేయమని పంపవలసినది విదురుణ్ణి. కానీ ఇలాంటి అయోగ్యపు పని చేయమని అడగడానికి ధృతరాష్ట్రుడికే మొగం చెల్లలేదు. తన ఆంతరంగిక మిత్రుడు సంజయుణ్ణి పంపించుకొన్నాడు.
రాయబారం వచ్చిన కృష్ణుడు స్పష్టంగా "మీ ఎల్లర అన్నంబులు అశుచులు. * విదురాన్నంబొక్కటి భోక్తవ్యంబని* నిశ్చయించితి అని చెప్పాడు. విదురుడి ఇంట ఆ 13 సంవత్సరాలు తల్లి కుంతి తలదాచుకొన్నది. విదురుడు ఇతరుల కంటే భిన్నంగా ఉంటూ ఉండిన పరిస్థితి అది. దుర్యోధనుడు విదురుణ్ణి లెక్క పెట్టడు.
ఆ పక్షంలో ఉన్నాడు గాబట్టి ఆ అధర్మం నిలపడానికే తానూ యుద్ధం లో పాల్గొనాలి. తనకు ఇష్టం లేదు. వాళ్లూ తనను నమ్ముకోలేదు. సహాయం కోరలేదు. కృష్ణుణ్ణి ఇంటికి పోయి కోరబట్టి పాల్గొన్నాడు. భీష్మ ద్రోణులనూ ప్రార్థించాడు దుర్యోధనుడు. తనకట్టి విపత్కర పరిస్థితి భగవంతుడు కలిగించలేదు. ఈ ఘోరకలి తప్పదు. నివారించవలసిన బాధ్యత గల రాజు ఉదాసీనత వహించాడు—అని
అక్కడ ఉండి ఆ విషాద వార్తలు వినలేక తీర్థయాత్రలు చేసి కాలం గడిపేశాడు విదురుడు.
తొడలు విరిగి చస్తూ * ఆ నాడే మా పినతండ్రి చెప్పాడు:— జూదపు ఆసపడం గాదు— అని. వినక పోతిని *—అని ఆ కులపాంసనుడు విదురుణ్ణి మహామతిని స్మరించుకొన్నాడు.
బలరాముడూ ఈ పనే చేశాడు. తనకు దుర్యోధనుడు అంటే ప్రీతి. పాండవులవైపు ధర్మం ఉంది. పోరాడితే కృష్ణుడికి ఎదురు నిలబడాలి… దిగితే తాడో పేడో తేల్చుకోవాలి— ఎటూ పాలుబోక ఆయనా తీర్థ యాత్ర చేశాడు. ఐనా ఉండబట్టలేక భీమ దుర్యోధనుల గదాయుద్ధం చూడడానికి హడావిడిగా పరుగులు దీస్తూ వచ్చాడు.
విదురుడికి బంధు నాశం జరుగుతున్నదే!! అనే విషాదమే. తన అశక్తత తలపోస్తూ , పరదేశాలలో కాలం వెళ్లదీయవలసిన కష్టకాలం. అదెట్లో భరించి,, గతి లేని తన సోదరుణ్ణి అనునయించే బాధ్యత మళ్ళీ స్వీకరించి అతడికి మనశ్శాంతి కలిగించాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి