*ఆదర్శవ్యక్తి, ధర్మాచరణ*
ప్రతి మనిషి తన జీవితంలో ఒక ఆదర్శవ్యక్తిని అనుసరించవలెను. ఆ ఆదర్శ వ్యక్తి శ్రీరామచంద్రుడు. ఆయనను అనుసరించిన న్యాయ, ధర్మ మార్గములను మనము కూడా జీవితములందు అలవరచుకోవాలి అన్న తీర్మానమును తీసుకొన వలయును. శ్రీమద్రామాయణమునందు శ్రీరామచంద్రుడిని "గుణవాన్ ధర్మజ్ఞఃచారిత్రేణ యుక్తః, సర్వభూతేషుహితః, విద్వాన్, సమర్థః, ఆత్మవాన్, జితక్రోధః, అనసూయకః" మొదలైన గుణములున్న వానిగా వర్ణించారు. అనగా శ్రీరామచంద్రుడు సద్గుణ సంపన్నుడు, ధర్మమును తెలిసినవాడు, సత్ప్రవర్తన కలిగినవాడు కోపమును జయించినవాడు, అసూయ లేనటువంటి వాడు అని అర్ధం. ఈ గుణములు శ్రీరామచంద్రుని యందు సంపూర్ణముగానున్నట్లు శ్రీమద్రామాయణము తెలుపుచున్నది. మనము కూడా శ్రీరామచంద్రునివలె జీవితమును గడపవలయున్నచో ఈ గుణములను మన నిత్య జీవితమునందు అలవరచుకొన వలయును.
రామావతారము యొక్క ప్రధానోద్దేశ్యము మానవజన్మయందు సర్వాత్మనా ధర్మాచరణము సాధ్యము అని నిరూపించుటయే. ధర్మమును గురుంచి చెప్పుట సులభము కాని ఆచరించుట కష్టము అని చాలా మంది భావన. శ్రీరామచంద్రుని చరిత్రను చదివినచో ఇటువంటి భావనకు అవకాశమే లేదు. ఏదో ఒక విధముగా మన జీవితము అభివృద్దికి రావలయును అన్న భావన సరికాదు. ధర్మమార్గమును అనుసరించి అభివృద్ధికి వచ్చుటయే సరియైన విధానం. రావణాసురుడు మొదలైనవారు అధర్మమార్గమును అనుసరించి అభివృద్దికి వచ్చిననూ చివరకు పతనము చెందిరి. ధర్మమార్గమును అనుసరించిన శ్రీరామచంద్రుడు ఎన్ని కష్టములు అనుభవించిననూ చివరకు జయమునే పొందెను. ఈ న్యాయము, అన్యాయము అనునవి ప్రాచీన కాలమునకు మాత్రమే సంబంధించినవి కావు ఇవి సర్వకాలముల యందు ఉండును. వీటిని మనము అలవరచు కొన్నచో మనకే కాదు, మనము నివసించుచున్న సమాజమునకు కూడా మంచిది.
ధర్మాచరణమును విడుచుటవలనే ప్రస్తుత కాలములో అనర్ధములు, ప్రకృతి వైపరీత్యాలు మొదలైనవి ఎక్కువగా వచ్చుచున్నవి. అధర్మం తక్కువైనచో ప్రకృతి వికోపములు తగ్గును. దానికి మనము భగవదనుగ్రహమును పొందవలయును. శాస్త్రప్రకారము ఒకే పరమాత్మ మనలను అనుగ్రహించుటకు అనేక రూపములను ధరించినాడు. మనకు ఇష్టమైనటువంటి రూపమును ఉపాసించి భగవదనుగ్రహమును పొందవచ్చును. ప్రతియొక్కరూ ఈ సత్యమును గ్రహించి భగవదనుగ్రహపాత్రులై ధర్మమూర్తి అయిన శ్రీరామచంద్రుడిని ఆదర్శముగా నుంచుకొని జీవనముయందు ధర్మమార్గమును అనుసరిస్తూ శ్రేయోవంతులగుదురుగాక.
|| हर नमः पार्वती पतये हरहर महादेव ||
--- *జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి