10, ఆగస్టు 2024, శనివారం

దేవాలయాలు - పూజలు 6*.

 *దేవాలయాలు - పూజలు 6*.


సభ్యులకు నమస్కారములు.


భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధాన కర్తగా ఉండుటనే దీక్షగా పొందిన వారు, భావించిన వారు మాత్రమే అర్చకులు. అర్చకుల సంస్కారము దైవ కార్యముల యందు శ్రద్ధ, నిమగ్నత, విశిష్టత వలన భగవంతుడు అర్చకులకు సన్నిహితుడవుతాడు. అర్చక వ్యవస్థలో గూడా రెండు విధానాలు.

 1) అనువంశిక అర్చకులు 

2) వేతన అర్చకులు.


దేవాలయాలు ప్రజలందరికీ చెందిన కేంద్రీకృతమైన వ్యవస్థ కాబట్టి దేవాలయాలలో దైవ సంబంధిత విషయాలే గాకుండా లౌకిక వ్యవహారాలు గూడా ఉండుట పరిపాటి. దైవ సంబంధమైన కార్యక్రమాలు అర్చకులు నిర్వర్తించాలి, లౌకిక సంబంధమైన వ్యవహారాలపై ధర్మ కర్తలు, పాలక మండలి అజమాయిషీ ఉంటుంది, ఇది సాధారణ కట్టుబాటు. 


గర్భాలయములోనికి, సాధారణ పరిస్థితులలో అర్చక స్వాములకు తప్ప ఇతరులు  అనగా...ధర్మకర్తలు, పాలక మండలి సభ్యులు, సామాజిక పెద్దలు  మరియు ప్రభుత్వ అధికారులు ప్రవేశించరాదు. అర్చక కుటుంబాలు తయారు చేసిన వంటకాలు తప్ప ఇతరుల వంటకాలను భగవంతునికి ఆరగింపుగా(నైవేద్యం )ఉంచరాదు. భక్తుల వంటకాలను  భగవత్ ఆరగింపుకు అనుమతించ రాదు. *ధర్మ స్మూక్షము ప్రకారము గడప దాటిన వంటకాలు భగవత్ నివేదనకు పనికి రావు*. 


*గర్భ గుడిలోనికి అన్యులు ప్రవేశించుట, అన్య వంటకాలు భగవంతునికి సమర్పించుట దోష భూయిష్టమే గాక దేవాలయ ప్రాభవము తగ్గుతుంది*.  వేయేల,  అర్చక స్వాములు తమ గుణ గణములు, పూజాదికాలలో చూపే శ్రద్ధ వలన మాత్రమే గర్భ గుడిలో ఉన్న  భగవన్ మూర్తి, శిల లేదా ప్రతిమ దైవత్వానికి శక్తి సమకూరుస్తాడు. *దేవాలయ మరియు పూజా నిర్వహణలు ఆషామాషి వ్యవహారము కాదు*.


*మాన్యులు విజ్ఞప్తి*

*దేవాలయాలు - పూజలు* అను విషయంపై ధారా వాహిక రచనా వ్యాసంగం బహు సున్నితమే గాక బహు విస్తృతము, క్రమానుసారమైన, ప్రామాణిక, సుస్థాపిత విశేష్య అంశము గనుక, ఈ గ్రూప్ లోని మాన్యులు...ఈ రచనలలో అన్యమైన, అసంగత, అసంబద్ధ, అప్రస్తుత, అనంగీకార ప్రస్తావనలు ఉంటే తెలుపగలరు, సరిదిద్దగలరు.


ధన్యవాదములు.

*(సశేషము)*!*

కామెంట్‌లు లేవు: