10, ఆగస్టు 2024, శనివారం

ఉద్దండ కవితా విన్యాసము -2

 



ఉద్దండ కవితా విన్యాసము -2


                    కొందరు పుట్టుకవులుంటారు. మరికొందరు పెట్టుకవులుంటారు. పుట్టుకవులలో  ప్రఖ్యాతిగన్న మహాకవి  వేముల వాడ భీమ కవి! దక్షారామ భీమేశ నందనుడైన  యీకవి  'ఉద్దండ కవితా వేశము కలవాడు. గద్దరించి బెదరించి శాపదిగ్ధమైన  కవితలతో  నాటిప్రభువుల భరతమును బట్టి  తనజీవనమును  మహోజ్వలముగా  గడపిన మహనీయుడు. 


                           భీమ కవి సంచార శీలుడు. అతడొక మారు కళింగ చొక్కరాజు  యాస్థానమునకేగినాడు. ఆప్రభువు  వేశ్యాలంపటుడు. భీమకవి యొచ్చువేళకతడు  రాజోద్యాన వనమున  వేశ్యా సమేతుడై  విహరింుసాగెను. ద్వారపాలకుడు  భీమకవి యరుదెంచిన విషయమును విన్నవింపగా  పొగరుబోతుతనమున  ఇక్కడికేరమ్మని కబురంపెను. భీమకవి యరుదెంచి వాని వాలకమునుగాంచి  తలవంచి నమస్కరించెను. 


                                        " భీమకవీ ! నీగురించి చాలవిన్నాము. నీ టక్కుటమారములు మా*కడ సాగవు. నీవెదియన్న నది జరుగునా?  ఓహో! అటులైన  యీపందిరి గుంజను  మహావృక్షముగావింపుమని "--పల్కెను. ఆసమయమున చొక్కరాజుకాలు మల్లెపందిరి గుంజకానుకుని

యుండెను. భీమకవి  గంభీరముగా  గళమెత్తి--


                      "శా:  "  ఆనీతాభ్యుపదాన శృంఖల  పదాభ్యాలంబిత  స్తంభమా!


                                  నేనే వేములవాడ  భీమకవినేనిం  జిత్రకూటంబులో


                                 భూనవ్యాపృత  పల్లవోప లతికా  పుష్పోప గుఛ్ఛంబులన్


                                 నానా పక్వ ఫల  ప్రదాయి వగుమా !  నాకల్ప వృక్షాకృతిన్."---- అనిపద్యం చెప్పాడు.  అంతే  ఆపందిరి గుంజ కాస్తా మహా వృక్షమైపోయింది.  రాజుగారికాలు  ఆచెట్టులో యిరుక్కుపోయింది. దెబ్బతో భీమకవి  మహిమెంతో ఆరాజుకు  తెలిసింది.

"మహాకవీ నాతప్పు మన్నించు. మళ్ళీ వృక్షాన్నిపందిరికి గుంజగాజేసి  నన్నుకాపాడమని " ప్రార్ధించాడు. కవి కరుణాళుడై. చొక్కరాజా!

కవుల నెన్నడు నవమానింపకుము. బుధ్ధిగలిగిప్రవర్తింపు మనుచు----


  

                ఉ: "  శంభువరప్రసాద  కవిసంఘ వరేణ్యుడ నైన  నావచో


                          గుంభన  మాలకించి  యనుకూలత నొంది  యనూన భావనన్


                          కుంభిని  జొక్కనామ  నృపకుంజరు  పందిటి  మల్లెసాలకున్


                           స్తంభమురీతి  నీతనువు  దాలిచి   యెప్పటియట్ల  నుండుమా! "--- అనేపద్యం  చెప్పాడు. వృక్షం పందిరి గుంజయిపోయింది.రాజుగారి  పాదానికి  విముక్తి లభించింది.


                                               భీమకవి  మహిమకు అక్కడివారందరూ  ఆశ్చర్యంలో  మునిగిపోయారు.


                                                                  ఇదండీ  భీమకవిగారి  ఉద్దండ కవిత్వం !🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: