12-17-గీతా మకరందము
భక్తియోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
యో న హృష్యతి న ద్వేష్టి
న శోచతి న కాంక్షతి
శుభాశుభ పరిత్యాగీ
భక్తిమాన్ యస్స మే ప్రియః
వ్యాఖ్య:- "న హృష్యతి' - ఇచట సంతోషింపడనగా ఉప్పొంగిపోడని భావము. హర్షము (సంతోషము) మంచిదే అయినను అది హర్షశోకములను ద్వంద్వములలో చేరినదిగనుకను, మనోధర్మము గనుకను, పూర్ణమనోలయమునకు, నిరంతరాత్మస్థితికి అదియు ఒకానొక అడ్డే గనుకను ఆ ప్రకారముగ చెప్పబడినది.
'శుభాశుభపరిత్యాగీ' - ఇచట పాఠకులకొక సందేహము ఉదయించవచ్చును - లోకములో అశుభమును వదలుటగదా ధర్మము. కాని ఇచట అశుభముతో బాటు శుభమునుగూడ పరిత్యజించువాడు - అని ఏల చెప్పబడెను? గీతావాక్యములను బహుజాగ్రతగ అర్థముచేసికొనవలసియుండును. పూర్వాపరములను సమన్వయించుకొనుచు, ఏ సందర్భమున ఏ భావముతో చెప్పబడెనో గమనించుచు 'అర్థమును గ్రహించవలసియుండును. ఇచట భక్తియెుక్క పరాకాష్టస్థితి చెప్పబడుచున్నది. భక్తియొక్క చరమస్థితి, జ్ఞానస్థితి రెండును ఒకటే. పరిపూర్ణభక్తిగల మనుజుడున్ను జ్ఞానియు ఇరువురును ఒకేదైవస్థితియందు, ఆత్మస్థితియందు నిలుకడగలిగియుందురు. అది మనస్సును, మనోవికారములను దాటిన జీవన్ముక్తస్థితి. అట్టిస్థితిలో శీతోష్ణ, సుఖదు:ఖ, హర్షశోక, శుభాశుభాది ద్వంద్వభావములు ఏవియు ఉండనేరవు. కేవలము దైవభావము, ఆత్మభావము ఒకటియే యుండును. కనుకనే పరిపూర్ణభక్తుడు శుభాశుభపరిత్యాగియని చెప్పబడెను. సాధకులు మొట్టమొదట శుభమును (శుభకార్యములను, శుభసంకల్పములను) గ్రహించి తద్ద్వారా అశుభమును {అశుభకార్యములను, అశుభసంకల్పములను) త్యజించివేయవలెను. తదుపరి నిస్సంకల్పాత్మస్థితియందు, కేవలదైవస్థితియందు ఆ శుభసంకల్పాదులున్ను వానియంతటనవియే తొలగిపోయి ఒకే దైవవస్తువు మాత్రము మిగులును . శుభాశుభపరిత్యాగమను పదముయొక్క భావమిదియే. అంతియేకాని శుభకార్యములను, పుణ్యకార్యములను త్యజించివేయవలెనని కాదు. సాధకులీ విషయమును బహుజాగ్రతగ గమనించవలెను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి