*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*భీష్మ పర్వము తృతీయాశ్వాసము*
*269 వ రోజు*
*పదవరోజు యుద్ధం*
తొమ్మిదవనాటి భీష్ముని విజృంభణ చూసిన ధర్మనందనుని మన్సు కలత చెందింది. కౌరవ శిబిరంలో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. భీష్ముని వేనోళ్ళ పొగిడారు. నీ కుమారుల ఆనందానికి హద్దు లేదు. భీష్ముని ఉదాత్త హృదయంతో ప్రస్థుతి చేసారు. ఆరోజు రాత్రి ధర్మనందనునికి నిద్ర పట్ట లేదు. తన తమ్ములను తీసుకుని కృష్ణుని శిబిరానికి వెళ్ళాడు. " కృష్ణా ! చూసావు కదా కార్చిచ్చు అడవిలోని మృగములను నాశనం చేసినట్లు భీష్ముడు పాండవ సేనలను ధ్వంసం చేసాడు. ఆ మహా వీరుని ముందు మనవాళ్ళెవరూ నిలువ లేక పోయారు. కార్యాచరణ విచక్షణ లోపించి నేను వినాశకరమైన యుద్ధానికి అంగీకరించాను. బంధు మిత్రులను చంపుకుని నేను ఈ రాజ్యాన్ని ఎలా పాలించగలను. కనుక నేను అడవులకు పోయి నిశ్చింతగా ఆకు అలములు తింటూ తపస్సు చేసుకుంటాను. నా తమ్ములతో కూడి ముని వృత్తి స్వీకరిస్తాను వాళ్ళంతా నా కారణంగా ఆడవులలో కష్టాలు అనుభవించారు. వారిని నేను భీష్మునికి బలి ఇవ్వలేను. నా తమ్ముల క్షేమమే నాకు ముఖ్యం కృష్ణా ! మా మీద దయ ఉంచి ధర్మ మార్గాన్ని ఉపదేశించు " అని వేడుకున్నాడు. ఆ మాటలు విన్న కృష్ణుడు " ధర్మనందనా ! నీవు సత్యవాక్పరిపాలకుడవు. నీ తమ్ములు నాలుగు దిక్కులు జయించిన వారు. మీకు ఎలాంటి దుర్గతి కలుగదు. నా సహాయసంపత్తితో మీకు అమాత్యుడనై మీకు రాజ్యసిద్ధి కలుగ చేస్తాను. అర్జునుడు నాకు భక్తుడు, సఖుడు, బంధువు, శిష్యుడు అతని కోసం నేను నా శరీరాన్ని అయినా కోసి ఇస్తాను. ఉపప్లావ్యంలో అర్జునుడు పలికిన పలుకులు నిజం చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. నేను మీకు సాధకంగా శపథం చేసాను. అవన్నీ నిజం చేయవలసిన బాధ్యత నాకు ఉంది. ఒక వేళ అర్జునుడు తెగువ చేసి భీష్ముని వధించకున్న నేను ఆపని చేసి అయినా మీకు విజయం చేకూరుస్తాను " అన్నాడు. అది విన్న ధర్మనందనుడు " కృష్ణా ! నీవు యుద్ధం చేయనని కేవలం సహాయ సహకారాలు అందిస్తానని చెప్పావు. నీ చేత యుద్ధం చేయించి నీ మాట అసత్యం చేయటం భావ్యం కాదు. అకటా దైవం నాకు ఎన్ని ఇక్కట్లు కలుగ చేస్తున్నాడు.
*ధర్మరాజు భీష్ముని పడగొట్టడానికి నిశ్చయించు కొనుట*
భీష్ముడు కౌరవుల పక్షాన యుద్ధం చేసినా నాకు మేలు చేస్తానని మాట ఇచ్చాడు. మా తండ్రి పోయిన నాటి నుండి మమ్మలను ఆదరించి అల్లారు ముద్దుగా పెంచిన భీష్మునికి కీడు చెయ్యడానికి మనసు రావడం లేదు. అయినా తప్పేలా లేదు అయినా రాజ ధర్మం ఎంతటి క్రూరమైందో కదా " అని ఖేదంతో పలికాడు. కృష్ణునికి ధర్మనందనుని ఆంతర్యం అర్ధం అయింది. భీష్ముని వధోపాయం తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. ఆరోజు భీష్ముడు మరలా కలవమని చెప్పడంలో అంతర్యం ఇదే కాబోలు అనుకుని ధర్మనందనా ! నీ ఆలోచన బాగుంది. భీష్ముడు కోపంతో చూస్తే అతడి ముందు ఎవరు నిలువలేరని నీవే చెప్పావు కదా ! నీవు వెళ్ళి అడిగితే చాలు భీష్ముడు తనను వధించే ఉపాయం నీకు తప్పక వివరించగలడు. కనుక మనమందరం భీష్ముని సందర్శించి ఆయనను భక్తితో ప్రార్ధించి అతని వలన ఉపదేశం పొందవలెను " అని పలికాడు. అప్పుడు ధర్మరాజు సౌమ్య వేషధారణతో తన తమ్ములను తీసుకుని భీష్ముని చూడడానికి వెళ్ళాడు. భీష్మునికి సాష్టాంగ నమస్కారం చేసాడు. భీష్ముడు వారిని సాదరంగా ఆదరించి పేరు పేరునా వారి క్షేమం అడిగి " ధర్మనందనా ! ఈ సమయంలో మీరు నన్ను చూడవచ్చిన కార్యమేమి ? సందేహించక అడుగు ఎంతటి దుష్కర కార్యమైనా నెరవేర్చగలను " అని పలికాడు. దీనవదనుడై ధర్మరాజు " పితామహా ! మాకు రాజ్యప్రాప్తి ఎలా కలుగుతుంది. మా సైన్యం క్షీణించకుండా కాపాడే మార్గం సెలవివ్వండి " అని అడిగాడు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి