14-08-గీతా మకరందము
గుణత్రయవిభాగయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
తమ స్త్వజ్ఞానజం విద్ధి
మోహనం సర్వదేహినామ్ |
ప్రమాదాలస్యనిద్రాభిః
తన్నిబధ్నాతి భారత ||
తాత్పర్యము:- ఓ అర్జునా ! తమోగుణము అజ్ఞానమువలన కలుగునదియు, సమస్తప్రాణులకును మోహమును (అవివేకమును) గలుగజేయునదియునని యెఱుగుము, అయ్యది మఱపు (పరాకు), సోమరితనము, నిద్ర మొదలగువానిచే జీవుని లెస్సగ బంధించివేయుచున్నది.
వ్యాఖ్య:- తమోగుణము అజ్ఞానజనితమైనది. అది జీవుని మోహపెట్టి ఆతనికి అవివేకమును గలుగజేసి సంసారమునబడవైచి బంధించుచున్నది, దట్టమగు మేఘము సూర్యుని గప్పిన చందమునను, నల్లటి గాజుచిమ్నీ దీపమునకు పెట్టిన చందమునను తమోగుణావృతుడగు జీవుని పరిస్థితి ఉండును. ‘సర్వదేహినామ్’ అని చెప్పుటవలన వివేకవంతులను, ఆత్మజ్ఞానయుతులనుదప్ప తక్కినవారినందఱిని అది ఆవరించుచునే యుండునని గ్రహించవలెను. ముముక్షువులకు వారి వారి ప్రయత్నతీవ్రతనుబట్టి అది క్రమముగ తొలగిపోవుచుండును. అయితే ఒకనికి తమోగుణము ఉన్నదా, లేదాయని తెలిసికొనుట ఎట్లు ? మత్తు, సోమరితనము, అతినిద్ర, అజాగ్రత, బద్ధకము మున్నగునవి ఎవనికుండునో, ఆతనికి తమోగుణము పూర్తిగా కలదనియే గ్రహించవలెను. అట్టి లక్షణములను ముందుగనే తెలిసికొని, వానిని నివారించుటద్వారా అంధకారసదృశమగు ఆ తమోగుణమును హృదయమునుండి దూరముగ పారద్రోలవలెను. ఏలయనిన, ఈ తమోగుణ, రజోగుణములు జీవుని గట్టిగ బంధించివైచి సంసారగర్తమున పడవైచి దైవమున కాతనిని దూరునిగ జేయుచున్నవి (నిబధ్నాతి). కాబట్టి ముముక్షువులు వాని విషయమున కడు జాగరూకులై మెలగవలెను.
‘భారత’ - (భరతవంశమందు జన్మించిన ఓ అర్జునా!) అను ఈ సంబోధనపదము ఈ అధ్యాయమున పెక్కుతూర్లు వాడబడుట గమనింపదగినది. ఎట్లనిన -
(1) సంభవః సర్వభూతానాం తతో భవతి భారత (14-3)
(2) ప్రమాదాలస్యనిద్రాభిస్తన్నిబధ్నాతి భారత (14-8)
(3) సత్త్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత (14-9)
(4) రజస్తమశ్చాభిభూయ సత్త్వం భవతి భారత (14-10)
(5) రజస్యేతాని జాయన్తే వివృద్ధే భరతర్షభ (14-12)
ఈ ప్రకారముగ ఒకే అధ్యాయములో ఒకే సందర్భమున 'భారత' అను పదమును ఇన్నిసార్లు ప్రయోగించుటలో ఏదైన విశేషముండియే యుండవలెను. అదియేది యనిన 'భా' అనగా ప్రకాశము (జ్ఞానము); అద్దానియందు ‘రతః’ - ఆసక్తుడవు కమ్ము - అను అర్థము ఈ పదముద్వారా అర్జునునకు సూచింపబడుచున్నది. ‘ఓ అర్జునా! ప్రకాశస్వరూపమై, త్రిగుణమాలిన్యవర్జితమై, అతి నిర్మలమైనట్టి నీస్వస్వరూపమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నీవు అంధకారరూపములగు ఈ త్రిగుణములతో జేరినవాడవు కావు. అవి మాయా (ప్రకృతి) జన్యములు. నీవో తద్విలక్షణుడవు. జ్ఞానప్రకాశసచ్చిదానంద స్వరూపుడవు. కావున అట్టి ప్రకాశరూపనిజాత్మతత్త్వమున స్థితుడవై త్రిగుణాతీతుడవై పఱుగుము' అని హెచ్చరించుటకై కాబోలు ఇన్నిసార్లు 'భారత’ అను పదమును భగవానుడు ప్రయోగించిరి.
ప్రశ్న:- తమోగుణము దేనినుండి పుట్టినది?
ఉత్తరము:- అజ్ఞానమునుండి.
ప్రశ్న:- దాని స్వభావమేమి?
ఉత్తరము:- అది సమస్త జీవులకును మోహమును (అవివేకమును) గలుగజేయును.
ప్రశ్న:- ఏ రూపమున అయ్యది జీవులను బంధించును?
ఉత్తరము:- మఱపు, పరాకు, సోమరితనము, బద్దకము, అతినిద్ర మున్నగువానిచే బంధించును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి