2, మార్చి 2025, ఆదివారం

తిరుమల సర్వస్వం -165*

 *తిరుమల సర్వస్వం -165*

*తిరుమల క్షేత్రంలో తీర్థాలు-4*



 *జాబాలితీర్థం* 


 తిరుమలక్షేత్రంలోనున్న సుప్రసిద్ధ తీర్థాలలో ఇది కూడా ఒకటి. దేశవిదేశాలకు చెందిన ఎందరో ప్రసిద్ధి చెందిన వ్యక్తులు ఈనాటికీ, అంజనాపుత్రుణ్ణి పూజించి తమ తమ వృత్తి, వ్యాపారాలలో రాణించే నిమిత్తం తరచూ జాబాలితీర్థం సందర్శిస్తూ ఉంటారు. తిరుమల ప్రధానాలయం నుండి పాపవినాశనం వెళ్లే మార్గమునందు, వేణుగోపాలస్వామి ఆలయానికి సమీపంలో రహదారి నుంచి దాదాపు మైలు దూరం మెట్ల మార్గంలో ప్రయాణించి ఈ తీర్థాన్ని చేరుకోవచ్చు. రమణీయమైన ప్రకృతిదృశ్యాలతో, వర్షఋతువు నందు చిన్నా-పెద్దా జలపాతాలతో ఈ మార్గమంతా కనువిందు చేస్తుంది. తిరుమలక్షేత్రంలో అత్యంత అరుదుగా కానవచ్చే పట్టుకుచ్చుల్లాంటి తోకలు, ముదురుగోధుమ వర్ణంలోనున్న పొడవాటి శరీరం గల 'బెట్లుడుత' లు ఈ మార్గానికి ఇరుప్రక్కలా ఉన్న వృక్షాలపై సయ్యాట లాడుతూ సందడి చేస్తుంటాయి.


 ఇక్ష్వాకువంశపు రాజపురోహితులలో ఒకరైన జాబాలిమహర్షి తన శిష్యులతో సహా కొంతకాలం ఈ తీర్థంలో నివసించినట్లు వరాహపురాణంలో చెప్పబడింది. తర్వాతి కాలంలో, అదే ప్రదేశంలో అగస్త్యముని తన శిష్యులతో పాటుగా సుదీర్ఘకాలం నివసించి శ్రీవేంకటేశ్వరునికి అట్టహాసంగా పూజాదికాలు నిర్వహించాడు. ఈ క్షేత్రంలో జాబాలిమహర్షి కోరిక మేరకు ఆంజనేయుడు స్వయంభువుగా వెలిశాడని పురాణాల్లో చెప్పబడింది. స్కాందపురాణంలో మరియు తరిగొండ వెంగమాంబ విరచిత శ్రీవేంకటాచల మహత్యంలో కూడా ఈ తీర్థం యొక్క ప్రస్తావన తరచుగా కనిపిస్తుంది.


 శ్రీరామచంద్రుడు సీతా-లక్ష్మణ సమేతంగా వనవాసంలో ఉన్నప్పుడు; రాముణ్ణి అయోధ్యకు తిరిగి వచ్చేందుకు ఒప్పించడానికై జాబాలిమహర్షి నాస్తికవాక్కులు పలుకుతాడు. తత్ఫలితంగా వచ్చిన వాక్ దోషాన్ని తొలగించుకోవడం కోసం జాబాలిమహర్షి ఈ క్షేత్రంలో సుదీర్ఘకాలం తపమాచరించాడు. రావణవధ అనంతరం అయోధ్యకు తిరిగి వెళుతూ శ్రీరామచంద్రుడు సీతా సమేతంగా ఈ ప్రాంతంలో కొంతకాలం విశ్రమించాడు. ఆ సమయంలో శ్రీరాముడు స్నానమాచరించిన నీటిమడుగు *'రామకుండం'* గానూ; సీతాదేవి స్నానం చేసిన నీటిమడుగు *'సీతాకుండం'* గాను ప్రసిద్ధికెక్కాయి. స్వచ్ఛమైన జలాలతో ఒప్పారుతున్న ఈ రెండు కుండాలను ఈనాడు కూడా వేలాది భక్తులు చూసి తరిస్తారు. ఈ క్షేత్రంలో కొలువై ఉన్న సింధూర వర్ణపు ఆంజనేయుడు శిరస్సుపై సీతారామచంద్రులను మోస్తూ దర్శనమిస్తాడు. ఈ తీర్థానికి ఎగువన ధ్రువుడు తపస్సు చేసినట్లుగా చెప్పబడే *'ధ్రువతీర్థం'* కూడా ఉంది.


 హనుమజ్జయంతి నాడు ఈ ఆలయంలో పెద్ద ఎత్తున పూజాపునస్కారాలు జరుగుతాయి.

*చక్రతీర్థం* 


 ఆలయానికి ఉత్తర-పశ్చిమ దిశగా, రెండు మైళ్ల దూరంలో, వేదపాఠశాలకు వెళ్లే దారిలో; శిలాతోరణం ఉద్యానవన ప్రాంగణంలో దాదాపు నూరు మెట్లు దిగి ఈ తీర్థాన్ని దర్శించుకోవచ్చు. ఈ తీర్థంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి, శ్రీవేంకటేశ్వరుని ఆయుధమైన సుదర్శన చక్రత్తాళ్వార్ ల విగ్రహాలు మలచబడి ఉన్నాయి. కార్తీకమాసంలో వచ్చే బహుళద్వాదశి నాడు శ్రీవారి ముఖ్యాలయం నుండి తీసుకొని వచ్చిన పాయసాన్ని ఈ మూర్తులకు నివేదన కావించి, తదనంతరం భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. స్కాందపురాణం ప్రకారం, శ్రీవత్స గోత్రీకుడైన 'పద్మనాభుడు' అనే విప్రుడు పన్నెండు సంవత్సరాల పాటు కఠోర తపమాచరించగా; శ్రీవేంకటేశ్వరుడు ప్రత్యక్షమై, అప్పట్లో ఆ ప్రదేశాన్ని ఆవరించియున్న రక్కసి మూకలను తన చక్రాయుధంతో దునుమాడాడు. శ్రీవారి సుదర్శనచక్రం ద్వారా రాక్షససంహారం జరిగిన కారణంగా ఆ ప్రదేశం చక్రతీర్థంగా ప్రసిద్ధి కెక్కింది. పాప పరిహారార్ధం తపస్సు చేయదలచుకున్న వారికి ఈ ప్రదేశం అత్యుత్తమమైనదిగా పురాణాలలో చెప్పబడింది.


 స్కాందపురాణం లోని మరొక ఇతివృత్తాన్ని అనుసరించి, శ్రీరంగానికి చెందిన 'సుందరుడు' అనే బ్రాహ్మణుడు శాపవశాత్తూ రాక్షసరూపం ధరించాడు. ఆ బ్రాహ్మణుడు వశిష్ఠమహర్షి ఆదేశం మేరకు ఈ తీర్థంలో పవిత్ర స్నానమాచరించి తన నిజరూపాన్ని సంతరించుకుని మోక్షసిద్ధి పొందాడు. 


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

కామెంట్‌లు లేవు: