*🌺🌸☸️🌸🌺🌸🌺🌸🌺🌸🌺🌸
🙏జై శ్రీమన్నారాయణ🙏*
*అంతర్యామి*
*భజనం - భోజనం*
*మనిషి బతకడానికి భోజనం అవసరం. మంచివాడిగా బతకడానికి భజనం అత్యవసరం. భోజనం లేకుండా జీవించడమెలా దుర్లభమో, భగవద్భజనం లేకుండా జీవించడం అలాగే నిష్ఫలమన్నది పెద్దల మాట.*
ఆహారం శరీరారోగ్యానికి, శరీర పోషణకు ఎంతగానో ఉపకరిస్తుంది. భజనం ఆంతరిక, ఆధ్యాత్మిక పోషణకు మరింతగా వినియోగపడుతుంది. మానవజీవన వికాసానికి ఈ రెండూ ముఖ్యమైనవి, అవసరమైనవి. వీటిని సమతౌల్యంతో పాటించాలి.
*భోజనం సరైంది లభించనప్పుడు భజనం కూడా తృప్తిగా చేయలేం. అదే విధంగా భజన చెయ్యలేనప్పుడు భోజనం చేసే అర్హత తనకు లేదని భావించుకోవాలి*.
'ఏ రోజు దైవప్రార్ధన చెయ్యలేకపోతే, ఆ రోజు నా జీవితంలో పూర్తిగా వ్యర్ధమైన రోజు' అని బాపూజీ అనే వారు. ఇదే వ్రతాన్ని స్వీకరించగలిగితే, భగవంతుడితో మనకు అత్యంత గాఢమైన అనుబంధం ఏర్పడటంలో ఆలస్యమే ఉండదు. హితం కలిగించేది, సులభంగా జీర్ణమయ్యే సాత్వికాహారం స్వీకరించేవారే ఆరోగ్యవంతంగా ఉంటారని, వారి మనసే సర్వదా ప్రసన్నంగా ఉంటుందని గీత చెబుతోంది. మిత ఆహారం అమితమైన ఆధ్యాత్మిక చింతనను కలిగిస్తుందనడంలో సందేహం లేదు.
పంచభూత నిర్మితమైన మన దేహం, పంచభూతాల చేతనే వృద్ధి పొందుతుంది. సమాన స్వభావం గల పదార్ధంవల్ల సమాన ద్రవ్యం అభివృద్ధి చెందగలదన్నది ఆయుర్వేద సిద్ధాంతం. అటువంటి శరీరాన్ని, ఉన్న నాలుగు రోజులూ సంతులితాహారంలో పోషించుకుంటూ జీవనధర్మాచరణకు సంసిద్ధులం కావాలి.
బాల్య, యావన. కౌమార, వార్ధక్య దశల్లో ప్రతి దశను మంచి ఆహారంతో పరిపుష్టం చేసుకోవాలి. 'అపధ్యం' అని తెలిసే చాపల్యంతో అతిగా భుజించకూడదు. అజ్ఞానంతో అపధ్యాన్ని పధ్యంగా భ్రమపడకూడదు. ఆహారంవల్ల పుట్టిన శరీరం ఆహార వైషమ్యంవల్లే నశిస్తుంది.
*శరీరాన్ని దోచుకునేవి రెండు. అవి ఆహారం, నిద్ర. ఈ రెండూ ఎప్పుడూ మితంగానే ఉండాలి. అవి తగిన పాళ్లలో లేకపోతే శరీరం శీఘ్రంగా నాశనమైపోతుంది. బతుకు మెతుకు కోసం కాదు... బతకడం కోసమే మెతుకు అని గ్రహించాలి*.
కర్మయోగమనేది అధికంగా భుజించేవాడికి, అసలు తిననివాడికి సిద్ధించదు. ఆహార, నిద్రలు పరిమితంగా ఉండాలి. *సత్వరజస్తమోగుణాలను ఆహారం ప్రభావితం చేస్తుంది. సత్వ గుణాన్ని సాత్వికాహారమే వృద్ధి చేస్తుంది. అదే మనిషిని సంస్కారవంతుణ్ని చేస్తుంది. తమోగుణం మానవుణ్ని దానవుడిగా మార్చివేస్తుంది. రజోగుణం మానవుణ్ని లోభిని చేస్తుంది. నిషేధిత కర్మలు చేయాలని ప్రేరేపిస్తుంది.* సోమరితనం, అహంకారం, మూర్ఖత్వం మొదలైన అవగుణాలకు మనిషి బానిసైపోతాడు. లోకంలోని హింస, దౌర్జన్యం, అత్యాచారం, అవినీతి, అధర్మం, మారణకాండ మొదలైన అకృత్యాలన్నింటినీ నిర్మూలించాలంటే అందరూ సాత్వికాహారాన్నే భుజించాలి. అదే మనిషిలోని ఆధ్యాత్మికచింతనా దృక్పథం పెంచుతుంది. భగవంతుణ్ని దగ్గరిగా చేరుస్తుంది. మోక్షార్హతను ప్రసాదిస్తుంది.
మంచి భోజనం మంచి భజనమే చేయిస్తుంది. భజనం చేసే శక్తి కలిగే మేరకే భోజనం తీసుకుంటే చాలు. అటువంటి భోజనమే సార్ధకమవుతుంది. శరీరాన్ని కాపాడుకోవడానికి ఆహారం అవసరమైనట్లే, ఆత్మ ఆరోగ్యానికి ప్రార్థన అంత అవసరం. ఆత్మకు ఆహారాన్ని చేకూర్చటం మన ప్రాథమిక ధర్మం. ధ్యానానికి అంకితమైపోవడమే అసలైన ప్రార్ధన. ఆత్మను ఆరాధించడమే అసలైన అర్చన. *శరీరంలో శక్తి ఉన్నప్పుడే తీర్ధయాత్రలు, పురాణపఠనం, సత్సంగం - ఈ మూడింటికి ప్రాధాన్యమిచ్చి అనుసరించటమే అసలైన భజనం*. ధర్మార్ధ కామ మోక్షాలకు ప్రధాన సాధనం దేహమే కనుక, దైవదత్తమైన పంచభూతాలను సేవించడమే మానవుడి పరమావధి.🙏
🌺🌸🌺🌸🌺🌸🌺🌸🌺🌸🌺🌸
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి