*ఓరిమితో-సాధనతో*
ఋషి తపస్సులో కూర్చోగానే వరం పొందలేడు. కొన్నేళ్లపాటు సంఘ జీవనానికి దూరంగా, అరణ్యంలో ప్రశాంతంగా, తదేక దీక్షతో కూర్చుని, ఇహలోకాన్ని పూర్తిగా మరిచిపోయి, శరీరం చుట్టూ పుట్టలు పట్టి, జీవన్మరణ సంధి రేఖకు చేరువైనప్పుడు దైవ ప్రసాదిత వరం లభ్యమవుతుంది.
చెట్టు కొమ్మన పువ్వు పూయగానే కాయగా, పండుగా రూపాంతరం చెందదు. దానికంటూ కొంత కాలవ్యవధి కావలసిందే! కొంగ తన ఆహారమైన చేపను ముక్కున పట్టుకోవడానికి చెరువులో ఒంటికాలి జపం ఎలా చేస్తుందో అందరికీ తెలిసిందే.
'సాధనమున పనులు సమకూరు' అన్నాడు వేమన.
సాధనకు ఓపిక వెన్నెముక. ఎన్ని సద్గుణాలు ఉన్నా మనిషికి సహనం లేకపోతే ఏదీ సాధించలేడు.
భగవంతుడు సైతం తన భక్తుడిలో శ్రద్ధ, సబూరి ఉండాలంటాడు. నవ విధ భక్తులకు అదే పునాది. ధూప దీప నైవేద్యాలతో రెండు మంత్రాలు చదివి, నాలుగు పూలు వేసి చేసే పూజకు, సహస్ర నామార్చన, కోటి కుంకుమార్చన, సహస్ర ఘటాభిషేకం వంటివి భక్తులకు ఓపికను అలవరచే పూజా ప్రక్రియలకు ఎంతో భేదం ఉంది. నియమ నిష్ఠలతో, దేవుడిలో మనసును లయం చేసి నిర్వహించే పూజా విధానంలో, ఒక్కసారన్నా భక్తుడి మనసు భగవంతుడిలో లీనం అవుతుంది. మనిషికి జన్మించిన మానవుణ్ని, జనన మరణాల్ని జయించేలా చేసి దేవుడిలో ఐక్యం చేసేది అంతటి భక్తిప్రపత్తులే.
భక్త శబరి శ్రీరాముణ్ని ఇష్టదైవంగా భావించింది. ఒక తల్లిగా ప్రేమించి, దూరమైన కొడుకు రాకకోసం తపించి, తల్లడిల్లిపోతూ ఎదురుచూసే తల్లిలా రామయ్య కోసం ఎంతోకాలం ఓపికగా నిరీక్షించింది. తన భక్తితో జీవిత పర్యంతం రామనామం జపించి, అంత్యకాలంలో శ్రీరాముడి దర్శనం పొంది, అనిర్వచనీయ ఆనందంతో, అత్యంత ప్రీతితో శ్రీరాముడికి ఫలాలు తినిపించి రామ హృదయ సాయుజ్యాన్ని పొందింది.
కొన్ని సాధించాలంటే కొంతకాలం నిరీక్షించక తప్పదు. అప్పటిదాకా తొందరకు తావీయకుండా ఓపిక వహించాలి. అప్పుడే అనుకున్నది ఫలవంతమవుతుంది. నేడు దివిజ గంగ నీరు తాగుతూ, అందులో మునకలు వేసి పవిత్రులం అవుతున్నామంటే భగీరథుడి తపస్సే కారణం.
కౌరవుల దురాగతాలను ఓపిగ్గా, మౌనంగా భరించిన పాండవులదే అంతిమ విజయం.
రాక్షసుల దమనకాండను కొంతకాలం ఓరిమితో భరించిన శ్రీ మహావిష్ణువు, తన అవతార బలంతో వాళ్లను తుదముట్టించాడు.
శిశుపాలుడి నూరు తప్పులు ఓపిగ్గా ఓర్చిన శ్రీకృష్ణుడు- అతడి వాచాలత్వాన్ని సుదర్శన చక్రంతో అడ్డగిస్తాడు. శిరస్సు ఖండిస్తాడు.
ఉత్తరాయణం గొప్పదనాన్ని లోకానికి తెలియజేయడానికి మహాభారత యుద్ధం తరవాత భీష్మాచార్యుడు 46 రోజులపాటు అంపశయ్య మీద ఓపికగా స్వచ్ఛంద మరణం కోసం వేచి చూశాడు.
ధర్మరాజుకే కాకుండా లోకానికంతటికీ ద్వాపరయుగం చివరిదశ, కలియుగం ప్రారంభం కాబోతున్న దశలో అవసరమైన ధర్మసూక్ష్మాలు, రాజధర్మాలు, విష్ణుసహస్రనామం తెలియజేసిన మహాజ్ఞాని భీష్ముడు.
జీవితానికి పరిపూర్ణత సిద్ధించడానికి చెప్పేవాళ్లు గురుస్థానంలో కూర్చుని తమ అనుభవసారాన్ని రంగరించి ఓపికగా ఎలా చెబుతారో, వినేవాళ్లూ అంతే ఓపికతో, శ్రద్ధతో వినాలి. ఆచరించాలి. ఇతర చరాచరాలకు భిన్నంగా మనిషి జీవితం విలువను సంతరించుకునేది అప్పుడే.✍️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి