*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*ద్రోణ పర్వము ద్వితీయాశ్వాసము*
*304 వ రోజు*
సృంజయిని కుమారుడు జీవించుట*
ఆ మాటలు విని మిన్నకున్న సృంజయుని చూసి నారదుడు " ఇప్పటి వరకూ చెప్పినది నీ బుద్ధిలోకి ప్రవేశించిందా లేక నిష్ఫలమేనా !" అన్నాడు. సృంజయుడు " నారదా ! నీ మాటలు నాకు ఊరట కలిగించాయి నేను ప్రశాంత చిత్తుడను అయ్యాను " అన్నాడు. నారదుడు " సృంజయా ! నీకు ఏమి కావాలో కోరుకో " అని అడుగగా సృంజయుడు " దేవా ! నీవు నాకు ప్రసన్నుడవు అయ్యావు నాకు ఇంత కంటే కావలసినదేమిటి " అన్నాడు. నారదుడు " సృంజయా ! చోరుల మూర్ఖత్వముకు బలి అయిన నీ కుమారుని నీకు తెచ్చి ఇస్తాను " అన్నాడు. ఇచ్చిన మాట ప్రకారం నారదుడు సువర్ణష్ఠీవిని సృంజయునకు తెచ్చి ఇచ్చాడు. సృంజయుడు తన కుమారునికి అస్త్రశస్త్ర విద్యలు నేర్పి వివాహం చేసాడు. అతడు సంతాన వంతుడు అయ్యాడు. కాలం తీరగానే అతడూ మరణించాడు. ధర్మరాజా ! మృత్యువును జయించుట ఎవరితరం కాదు. నీ కుమారుడు అభిమన్యుడు వీరస్వర్గము అలంకరించి సురలోక భోగములు అనుభవించుచున్నాడు. అతడి మృతికి నీవు చింతించుట అనవసరం. కనుక నామాటలు ఆలకించావు కనుక స్వస్థ చిత్తుడవై ధైర్యము వహించి ధీరుడవై కర్తవ్య నిర్వహణ కావింపుము " అని చెప్పి వ్యాసుడు అక్కడి నుండి వెళ్ళాడు.
*అర్జునుడు మనసు కలత చెందుట*
వ్యాసుడి రాక ధర్మరాజుకు ఉరట కలిగించినా అర్జునుడు వచ్చి తనకుమారుని గురించి అడిగినా ఎలాబదులు చెప్పాలి. అతడిని ఎలా ఓదార్చగలను అని మధనపడసాగాడు. సంజయుడిలా చెప్పగానే ధృతరాష్ట్రుడు " సంజయా ! సంశక్తులతో యుద్ధానికి వెళ్ళిన అర్జునుడు ఏ విధంగా యుద్ధము చేసాడు. అభిమన్యుని మరణవార్త అతడికి ఎలా తెలిసింది " అని అడిగాడు. సంజయుడు " మహారాజా ! సంశక్తులను అర్జునుడు సమూలంగా నాశనం చేసి తిరిగి వస్తుండగా అనేక దుశ్శకునాలు గోచరించాయి. అర్జునుడు శ్రీకృష్ణుని చూసి " ఎన్నడూ లేనిది నాకు దుర్నిమిత్తములు గోచరిస్తున్నాయి. నా మనస్సు అలజడి చెందుతుంది, శరీరం గగుర్పాటు చెందుతుంది ద్రోణాచార్యుడు సామాన్యుడు కాదు. మా అన్నయ్య ధర్మజునికి ఎలాంటి అపాయము జరగలేదు కదా !" అన్నాడు. ఆ మాటలు విన్న కృష్ణుడు " అర్ఝునా ! ధర్మజునుకి అతడి తమ్ములకు ఎలాంటి ఆపదా కలుగదు. మిగిలిన వారికి కలిగిన మనకు త్వరలో తెలుస్తుంది " అన్నాడు. కృష్ణార్జునులు పాండవ శిబిరంలో ప్రవేశించగానే అక్కడ అలముకున్న నిస్తేజమైన వాతావరణం చూసి కలత చెందిన అర్జునుడు " కృష్ణా ! సైనికులు అందరూ నన్ను చూసి తల దించుకుంటున్నారు. వారి ముఖాలలో విషాదచ్ఛాయలు గోచరిస్తున్నాయి. మన శిబిరంలో సందడి లేదు. నేను రాగానే నాకెదురు వచ్చు అభిమన్యుడు నేడు రాలేదు. ఎలాంటి దుర్వార్త వినవలసి వచ్చునో అని మనసు వ్యాకులపడుతుంది. ఎలాంటి దుర్వార్త వినవలెనో అని భయంగా ఉంది " అన్నాడు. కృష్ణుడు బదులు చెప్పలేదు. అర్జునుడు వెంటనే ధర్మరాజు శిబిరానికి వెళ్ళాడు. అక్కడ ధర్మరాజు మొదలైన వారు కూర్చుని ఉన్నారు. వారిలో అభిమన్యుడు లేడు. అది చూసిన అర్జునుడికి కాళ్ళు తొట్రుపడ్డాయి
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి