5, ఏప్రిల్ 2025, శనివారం

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

       *తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*శివ భక్తి యొక్క విచిత్రతను  శంకరులు  ఈ శ్లోకములో చెప్పారు.*


*శ్లోకము :63*


*మార్గావర్తిత పాదుకా  పశుపతే రంగస్య  కూర్చాయతే*

               

*గండూషాంబు నిషేచనం పురరిపో ర్దివ్యాభి ‍షేకాయతే*

               

*కించిద్భక్షిత  మాంస శేషకబళం  నవ్యోపహారాయతే*

               

*భక్తిః  కిం న కరోత్యహో  వనచరో భక్తావతంసాయతే !!*


*పదవిభాగం :-*


*మార్గావర్తిత పాదుకా _ పలుమార్లు దారినడచిన పాతచెప్పు*


*అంగస్య _ అవయవమునకు*


*కూర్చాయతే _ చీపురైనది*


*గండూషాంబు నిషేచనం _ పుక్కిలించి నీరు చల్లుట*


*పురరిపోః  _ త్రిపురాంతకునికి*


*దివ్యాభిషేకాయతే _ గంగాజలముతో అభిషేకమైనది*


*కించిద్భక్షితమాంస  శేషకబళం _ కొంచెం తినగా మిగిలిన మాంసపుతునక*


*నవ్యోపహారాయతే _ క్రొత్త నివేదన ద్రవ్యమగుచున్నది*


*భక్తిః _ భక్తి*


*కిం న కరోతి _ ఏమి చేయలేదు?*


*అహో _ ఎంత విచిత్రము!*


*వనచరః _ కిరాతుడు*


*భక్తావ తంసాయతే _ ఉత్తమ భక్తుడగుచున్నాడు.*


*తాత్పర్యము :~*


*ఆహాహా !  ఏమి శివభక్తి యొక్క మహిమా చమత్కారము. అడవి దారులందుతిరిగే  అపరి శుద్దమైన చెప్పు, శివలింగమును తుడిచే కుంచె అయ్యింది. నోటితో నీటిని పుక్కిలించి చల్లడం, శివునికి దివ్య అభిషేక మయ్యింది. కొంచము తినగా మిగిలిన మాంసపు ముక్క  క్రొత్త నైవేద్యమయ్యింది. ఏమాశ్చర్యము !  భక్తి ఏమైనా చేయగలదు. అటవికుడు భక్తులలో అగ్రగణ్యుడు అయ్యాడు.*


*వివరణ :~*


*ఈశ్వరా !  ఇది ఎంతో ఆశ్చర్యం. పాత చెప్పు  ఈశ్వరుని నిర్మాల్యం తుడిచే కుంచె అయ్యింది. పుక్కిలితో తెచ్చిన నీరు పరమశివుడి దివ్యాభిషేకానికి పనికి వచ్చింది. ఎంగిలి మాంసపు ముక్క క్రొత్త నైవేద్య పదార్థంగా ఉపయోగపడింది.  భక్తి యన్నది ఏమైనా చేయగలదు.*


*కొండలలో తిరిగే కోయవాడు భక్తులలో శిరోమణి అయ్యాడని శంకరులు శ్రీ కాళహస్తిలో జరిగిన తిన్నడి కథను దృష్టిలో ఉంచుకొని ఈ శ్లోకము చెప్పారు.*


*ఈశ్వరుడికి భక్తుల మనస్సులోని భక్తి మీదనే దృష్టి గానీ ఆచారం, నియమాలపై అంతగా ఆసక్తి యుండదు. ఇందుకు ఉదాహరణంగా శంకరులు శ్రీ కాళహస్తి మహాత్మ్యమును తెలిపే గాథలలోని తిన్నడి గాథను ఉదహరించారు.*  


*తిన్నడికి కన్నప్ప అనే పేరుంది. శ్రీకాళహస్తి క్షేత్రమునకు దగ్గరలో "ఉడుమూరు " అనే బోయపల్లె ఉండేది. ఆపల్లెలో శివభక్తులయిన బోయ దంపతులకు తిన్నడనే కుమారుడుండేవాడు. తిన్నడు శివభక్తుడు. తిన్నడు వేటకు వెళ్ళాడు. అతనికి ఒక వరాహము కంటబడింది. అది తిన్నడి బాణానికి అందకుండా పోయి ఒక పొదలో మాయ మయ్యింది.*


*ఆ పొదలో ఒక శివలింగం తిన్నడికి కనిపించింది. తిన్నడా శివలింగాన్ని నిత్యమూ పూజించేవాడు.*


*తిన్నడు విల్లు చంకలో పెట్టుకొని, అమ్ములపొది వీపున కట్టుకొని, మాంసం దొప్పలు రెండు చేతుల్లోనూ పెట్టుకొని సువర్ణముఖీ నదీ జలాన్ని పుక్కిలిలో ఉంచుకుని శివలింగం దగ్గరకు వచ్చేవాడు. శివలింగం మీద అంతకు ముందు పూజచేసిన పత్రిని తన చెప్పుకాలితో ప్రక్కకు నెట్టి, పుక్కిటి జలంతో శివుడికి అభిషేకం చేసి, తాను మొదట రుచి చూసి తెచ్చిన ఎంగిలి మాంసాన్ని శివుడికి నైవేద్యముగా పెట్టేవాడు.*


*ఇలా తిన్నడి కాలి చెప్పు శివలింగాన్ని శుభ్రం చేసే కుంచె అయ్యింది.  పుక్కిటి నీరు శివునికి దివ్యాభిషేక జలమయ్యింది.* *దొప్పల్లోని ఎంగిలి మాంసం నైవేద్యంగా శివుడికి తిన్నడర్పించాడు.  ఆ ఎంగిలి మాంసమే శివుడికి నైవేద్యమయ్యింది. తిన్నడి శివభక్తికి, ఈశ్వరుడు సంతోషించాడు.* 


*తిన్నడు నిత్యమూ లింగానికి పూజాదులు సాగిస్తున్నాడు. శివుడు తిన్నడ్ని భక్తిని పరీక్షింప దలచి తనకంటి నుండి నీటిని కార్చాడు. తిన్నడు దానికి మందూ మాకులూ తెచ్చి వైద్యం చేశాడు. అయినా నీరు కారడ మాగలేదు. సరికదా రక్తం కారడమారంభమైంది. చివరకు తిన్నడు శివుడి కంటికి బదులుగా తన కన్నును తీసి పెట్టాడు. శివుని కంట రక్తం కారడమాగింది.  కానీ రెండవ కంటినుండి రక్తం వచ్చింది. తిన్నడు తన రెండవ కంటిని కూడా తీసి శివుడికి కన్నుగా అమర్చ బోయాడు. శివుడి కన్ను ఎక్కడ వుందో గుర్తు కోసం శివలింగంపై తన చెప్పుకాలితో తిన్నడు గుర్తు పెట్టుకున్నాడు. తిన్నడు తన రెండవ కంటిని పెకలింప బోగా శివుడు ప్రత్యక్షమై తిన్నడిని వారించాడు. తనకు కన్నునిచ్చిన తిన్నడిని మెచ్చుకున్నాడు. " కన్నప్ప " అని పిలిచాడు. కాళహస్తీశ్వరుని  భక్తులలో మేటి అయ్యాడు.*


*నాటినుండి శ్రీ కాళహస్తీశ్వరునకు నైవేద్యం పెట్టే ముందు గానే, కన్నప్పకు అర్చకులు నైవేద్యం పెడుతున్నారు*


*పై కథనే దృష్టిలో యుంచుకుని శంకరులు ఈ శ్లోకము వ్రాశారు.  

ముక్కంటినే ముగ్ధుణ్ణి చేసిన తిన్నడి గాఢభక్తి ఎంతటిదో ఆలోచించండి. దీన్ని బట్టి చూస్తే భక్తి ప్రధానము గానీ మంత్ర తంత్రాలు ముఖ్యమైనవి కావనీ 

ఈశ్వరుడు  భక్త సులభుడని తెలుస్తోంది.*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

కామెంట్‌లు లేవు: