5, ఏప్రిల్ 2025, శనివారం

కపిలతీర్థం

 *తిరుమల సర్వస్వం 198-*

  *కపిల తీర్థం -3*


 *చరిత్రపుటల్లో కపిలతీర్థం* 


 తిరుమల సమీపంలోని 'కొత్తూరు' అనే గ్రామానికి చెందిన 'రాయన్న రాజేంద్రచోళుడు' అనే ప్రాంతీయ పాలకుడు, పదకొండవ శతాబ్దపు ప్రథమార్థంలో కపిలేశ్వరస్వామి ఆలయం యొక్క గర్భాలయాన్ని నిర్మించాడు. తరువాతి కాలంలో శ్రీకృష్ణదేవరాయలు తర్వాత అధికారంలోకి వచ్చిన అతని తమ్ముడు అచ్యుతదేవరాయలు, మునుపెన్నడో కపిలతీర్థానికి గల 'సుదర్శన చక్ర తీర్థం' లేదా 'చక్రత్తాళ్వార్ తీర్థం' అనే నామాంతరాన్ని స్ఫురణకు తెస్తూ, కపిలతీర్థం పుష్కరిణికి నాలుగు మూలలలో నాలుగు 'సుదర్శనచక్ర శిలాయంత్రాల' ను ప్రతిష్ఠించి తన విష్ణుభక్తిని చాటుకున్నాడు. వాటిలో మూడింటిని ఈనాడు కూడా దర్శించుకోవచ్చు. నాలుగవ యంత్రం తర్వాతి కాలంలో చేపట్టిన నూతన నిర్మాణాలలో కలిసిపోయింది. అచ్యుతరాయల కాలంలోనే, కోనేటికి ఇరుప్రక్కలా చెక్కడపు శిలాస్తంభాలతో కూడిన పొడవాటి సంధ్యావందన మంటపాలు ఏర్పాటు చేయబడ్డాయి. అచ్యుతరాయలు తదనంతరం సదాశివరాయలు కాలంలో కూడా కపిలతీర్థం ఆలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబడ్డాయి.


 విజయనగర చక్రవర్తుల అనంతరం కొంతకాలం కరకంబాడి పాలెగార్ల అధీనంలో ఉన్న తరువాత, ఈ ఆలయం 1843వ సంవత్సరంలో మహంతుల పాలనలోకి వచ్చింది. 1865వ సంవత్సరంలో అప్పటి విచారణకర్త అయిన 'మహంతు ధర్మదాస్' కోనేటి మెట్లను, సంధ్యావందన మంటపాలను పునరుద్ధరించి; ఆలయంలో కొన్ని సేవలను కూడా ప్రవేశపెట్టినట్లు తెలిపే శాసనాలు లభించాయి. ఆ తరువాత తి.తి.దే. హయాంలో ఆలయం మరింత అభివృద్ధి చెందింది.


 *ఆలయ వైశిష్ట్యం* 


 కొండకోనల్లో నుండి మహోధృతంగా దుముకుతూ భూమిపై జాలువారే కపిలతీర్థం సోయగాలను దర్శించుకుంటూ పుష్కరిణికి ఆగ్నేయ మూలలోని మెట్లెక్కి కపిలేశ్వరస్వామి ఆలయంలోకి ప్రవేశిస్తాం. ఈ మార్గం తిన్నగా కళ్యాణమండపం లోకి దారి తీస్తుంది. కపిలేశ్వరునికి కామాక్షమ్మవారికి జరిగే నిత్య, వార, మాస, సంవత్సరోత్సవాలలో చాలా వరకు ఈ మంటపం లోనే జరుగుతాయి. ఈ మంటపంలోని సిద్ధివినాయకుణ్ణి దర్శించుకున్న తరువాత, ధ్వజస్తంభమంటపం లోనికి ప్రవేశిస్తాం. శిల్పసౌందర్యం ఉట్టిపడే ధ్వజస్తంభ పీఠంపై, వెండితో తాపడం చేయబడిన ఇరవై అడుగుల పొడవు గల ధ్వజస్తంభం ప్రతిష్ఠించబడింది. ధ్వజస్తంభానికి అన్ని దిక్కుల్లోనూ శివపరివార దేవతామూర్తులు మనోహరంగా మలచబడ్డాయి.


 *కపిలేశ్వరస్వామి సన్నిధి* 


 ధ్వజస్తంభ మంటపానికి అభిముఖంగా, ప్రవేశద్వారానికి ఇరుప్రక్కలా, వైష్ణవాలయాలలోని జయవిజయులను తలపుకు తెస్తూ; *'దిండి'-'ముండి'* అనే శివకింకరులు నిలుచుని ఉంటారు. చతుర్భుజధారులైన వారిరువురూ ఢమరుకం, త్రిశూలం, గదాయుధాలతో అప్రమత్తంగా ఉండి; భక్తులకు స్వాగతం పలుకుతుంటారు. ఈ ప్రవేశద్వారాన్ని దాటి ముఖమండపం లోనికి ప్రవేశిస్తాం. శతాబ్దకాలం క్రితం వరకు కపిలేశ్వరస్వామి వారి ప్రీత్యర్థం, ఈ మంటపంలో దేవదాసీలు నృత్యం చేస్తుండడంతో దీన్ని 'నాట్యమంటప' మని కూడా పిలుస్తారు. దేవునికి సమర్పించే షోడశోపచారాలలో - నృత్యోపచారం, అనగా నాట్యప్రదర్శనం - కూడా ఒకటి.


 ఈ మధ్యకాలం వరకూ ఈ మండపంలోని శిలాస్తంభాలపై అద్భుతమైన కళాకృతులు చెక్కబడి ఉండేవి. తరువాత చేపట్టబడిన పునరుద్ధరణ కార్యకలాపాల వల్ల అవన్నీ కనుమరుగై పోయాయి. కపిలేశ్వరస్వామికి అభిముఖంగా నందీశ్వరుడు ఆసీనుడై ఉంటాడు.


 *గర్భాలయం* 


 గర్భాలయ ప్రవేశద్వారానికి ఇరువైపులా శివపుత్రులైన 'గణపతి', 'కుమారస్వామి' భక్తితో నిలుచుని ఉంటారు. ప్రవేశద్వారం పైభాగంలో చతుర్భుజుడైన శ్రీమహావిష్ణువును కూడా దర్శించుకోవచ్చు. స్వయంభువుగా వెలసిన, ఆలయ ప్రధాన దైవమైన కపిలేశ్వరస్వామి గర్భాలయంలో పశ్చిమాభిముఖుడై, లింగాకారంలో దర్శనమిస్తారు. పానవట్టంతో సహా మూడడుగుల ఎత్తుండే, నాలుగు ముఖాలు కలిగిన ఈ లింగం దాదాపుగా దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. ఈ శివలింగం క్రింది భాగంలో రజతవర్ణం తోనూ, మధ్యభాగంలో స్వర్ణకాంతులీనే బంగారువర్ణం తోనూ, అగ్రభాగాన తామ్రవర్ణం తోనూ, ఇలా మూడు రంగులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ లింగాకారంలో త్రినేత్రాలను కూడా స్పష్టంగా దర్శించుకోవచ్చు. లింగోపరితలభాగంపై కామధేనువు యొక్క కాలిగిట్టల గుర్తులను కూడా చూడవచ్చు. అయితే, కపిలేశ్వరుడు ఎల్లవేళలా నిండుగా పుష్పాలంకృతుడై ఉండటంవల్ల భక్తులు సాధారణంగా లింగాకారాన్ని మాత్రమే చూడగలరు.

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

కామెంట్‌లు లేవు: