5, ఏప్రిల్ 2025, శనివారం

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

       *తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*శంకరులు ఈశ్వరుని తన మనస్సు అనే మణిపాదుకలు ధరించి విహరింపుమని  ఈ శ్లోకంలో వేడుకున్నారు.*


*శ్లోకము : 64*


*వక్షస్తాడనమన్తకస్య కఠినాపస్మార సంమర్దనం*


*భూభృత్ పర్యటనం నమత్సురశిరః కోటీర సంఘర్షణమ్ ।*


*కర్మేదం మృదులస్య తావకపద ద్వన్ద్వస్య గౌరీపతే*


*మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు ।।*


*తాత్పర్యము :-*


*పార్వతీ పతీ !  ఈశ్వరా మార్కండేయుణ్ణి   రక్షించేటప్పుడు యముడి రొమ్మును తన్నడం, కఠినుడైన అపస్మార రాక్షసుణ్ణి కాలితో మర్దించడం, కైలాస పర్వత సంచారమూ, నమస్కరించే దేవతల శిరస్సునందలి కిరీటాలతో ఒరిపిడి , మొదలైనవన్నీ  నీ మెత్తని పాదాల జంట చేసే పనులు.  అందువల్ల నీ పాదాలకు బాధ కలుగుతుంది.  ప్రభూ ! శివా ¡ నా చిత్తము అనే రత్నమయ పాదుకలతో విహరించడానికి సర్వదా  అంగీకరించు.*


*వివరణ : -*    


*శంకరులు ఈశ్వరుడికి ఇలా విన్నవించారు.*


*ಓ గౌరీ నాథా !  ఈశ్వరా !  ఆ యముడు ఉక్కు పిండంలాంటి వాడు.  అతడి రొమ్మును నీవు తన్నావు.  యముడి కంటే కఠినుడు అపస్మారుడనే రాక్షసుడు. వాడిని నీవు కాళ్ళతో త్రొక్కి చంపవలసి వచ్చింది.  ఇదీ గాక , నీవు సంచరించే ప్రదేశాలు సైతం పర్వతాలు.  అవి రాళ్ళగుట్టలతో నిండి ఉంటాయి. నీవు కైలాస పర్వతం పై తిరగాలి. దేవతలూ, దేవతానాయకులూ తమ కిరీటాలతో కూడిన తలలను, నీ పాదాలవద్ద వంచి నీకు నమస్కరిస్తూ ఉంటారు.   ఆ కర్కశ వజ్ర కిరీటాల తాకిడి, నీ పాదాలకు అధికంగా ఉంటుంది.*  


*కాబట్టి ఒకమాట చెపుతాను విను.  నీకు ఇటువంటి సమయాల్లో మంచి పాదరక్షలు  కావాలి.  నా హృదయం చాలా గట్టిది. నా హృదయాన్ని నీకు మణిపాదుకలుగా చేసి సమర్పిస్తాను.  నీవు సర్వ కాలాలయందూ నా చిత్తమనే మణిపాదుకలు ధరించినడు. అప్పుడు నీ పాదాలకు నొప్పి తగలదు ప్రభూ.*


*శివ పాదపద్మాలు, మృత్యుభీతినీ, అపస్మారస్థితినీ (మతిస్థిమితం లేకుండా ఉండడాన్ని)  రాజాశ్రయమునూ, మణులవంటి వాటియందు నిస్పృహత్వాన్ని కలిగిస్తాయనీ, అటువంటి పాదాల, ఎల్లప్పుడూ తన హృదయంలోనే  ఉండాలనీ శంకరులు ఈ శ్లోకంలో  కోరుకున్నారు*.  


*తన హృదయంలో ఈశ్వరుణ్ణి తన పాదాలను ఉంచమని,  శంకరులు

ఈవిధంగా కోరుకున్నారు.*


*శ్రీ సూక్తంలో కూడా ఇదే విధంగా*


*"విశ్వ ప్రియే  విష్ణు మనోనుకూలే త్వత్ పాద పద్మం మయి సన్నిధత్స్వ" అని ప్రార్థన చేశారు.*


*అర్థం ఏమంటే  "లోకానికి ప్రియమైనదానా !  విష్ణువు మనస్సునకు అనుకూలురాలైనదానా!  లక్ష్మీ మాతా !  నీ పాదపద్మాలను నాపై మోపి నన్ను అనుగ్రహించు"*


*భగవంతుని పాద స్పర్శ, మనకు సకల శుభములనూ ప్రసాదిస్తుంది. అందుకే శంకరులు తన మనస్సు అనే మణి పాదుకలతో విహరించమని ఈశ్వరుణ్ణి కోరారు.*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

కామెంట్‌లు లేవు: