5, ఏప్రిల్ 2025, శనివారం

శ్రీమద్ భాగవతం*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(96వ రోజు)*

   *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

            *కృష్ణావతారం* 

             *శ్రీకృష్ణ లీల*

     *గోపికావస్త్రాపహరణం*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*కృష్ణుణ్ణి జారుడు, చోరుడు, గోపికాలోలుడు అంటారంతా. కృష్ణుని శృంగారచేష్టల గురించి కొల్లలుగా కథలు చెబుతారు.*


*ఆ కథల్లో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా, కృష్ణుడు జగన్మోహనాకారుడు అన్నది నిజం. ఆ అందాన్నే గోపికలంతా ఆరాధించారు. అందంతో పాటు కృష్ణుని వేణుగానం హృదయాల్ని పరవశింపజేస్తుంటే గోపికలు తట్టుకోగలరా? అందుకే వారంతా అతని వెంటపడ్డారు. కృష్ణుణ్ణి కావాలనుకున్నారు. కావాలనుకున్న ప్రతి గోపికనూ చేరదీశాడతను.*


*వారితో యుమునాతీరంలో వెన్నెల్లో ఇసుకతిన్నెల్లో విరహించాడు. జలక్రీడలాడాడు. రాసక్రీడలాడాడు. క్షణకాలం కృష్ణుడు దూరమయితే కన్నీరు పెట్టుకునేవారు గోపికలు. ఆ వియోగాన్ని భరించలేకపోయేవారు.*


*కృష్ణుడు లేడు, కృష్ణుడు తనకడకు రాడు అన్న భావన ఆత్మహత్యలకు పురిగొలిపేది గోపికల్ని. బృందావనంలో కృష్ణుడూ గోపికలూ జరిపిన రాసక్రీడల్ని వ్యాసమహర్షి మనోజ్ఞంగా వర్ణించాడు. గోపికాగీతలు, భ్రమరగీతలు పేరిట వారి శృంగారక్రీడల్ని అత్యద్భుతంగా చిత్రించాడాయన. ఈ చిత్రణలను అపార్థం చేసుకుని కృష్ణుణ్ణి ‘జారుడు’ అనడం పొరబాటు. అపచారం కూడా.*


*శ్రీకృష్ణలీలలు వర్ణించడంలో వ్యాసమహర్షి ఉద్దేశం వేరు. స్త్రీలలో భగవద్భక్తిని పాదుకొలిపేందుకే కృష్ణుడు అలా ప్రవర్తించాడని అంటాడాయన. భక్తునికీ భగవంతునికీ తేడా లేదు. ఇద్దరూ ఒకటే! వారికి స్త్రీ పురుష భేదం లేదు.*


*భక్తుడు, భగవంతునిలో తాదాత్మ్యం చెందడమే ముక్తి. సర్వం భగవదర్పణ చేయడమే భక్తుని కోరిక అంటాడు వ్యాసమహర్షి. దీనిని చాలా మంది భక్తులు నిజం చేశారు. జయదేవుడు, లీలాశుకుడు కృష్ణునిలీలలు గొంతెత్తి పాడారు. మీరాబాయిలాంటి వారు కూడా ఇదే విధంగా భగవంతుని సేవించి తరించారు.* 


*నిప్పునకు చెదలు అంటవంటారు. అలాంటి నిప్పు, సర్వాంతర్యామి పరమాత్మకు పాపపుణ్యాది కర్మవాసనలు అంటవన్నది నిజం. భక్తుడు, భగవంతునితో తాదాత్మ్యం చెందినప్పుడు ఆత్మానందమేకాని, శారీరకవాంఛల ప్రసక్తే ఉండదక్కడ. కృష్ణుడు భగవంతుడు. గోపికలు భక్తురాళ్ళు. కృష్ణుని శృంగారక్రీడలన్నిటినీ ఈ దృష్టినే అర్థం చేసుకోవాలి. మరోరకంగా అర్థం చేసుకుంటే అపార్థాలే కాదు, అంతుచిక్కని వేదన కూడా కలుగుతుంది. ఆ వేదనలు పక్కన పెడితే కృష్ణుని శృంగారక్రీడకు గోపికావస్త్రాపహరణం పరాకాష్ఠగా చెబుతారు పెద్దలు.*


*గోపికలంతా కృష్ణుణ్ణి తమ పతిగా పొందాలని ఆశించారు. అతన్ని పతిగా పొంది తరించాలనుకున్నారు. తమ కోరిక నెరవేరేందుకు వారంతా వ్రతం చేపట్టారు. దాని పేరు కాత్యాయనీవ్రతం*. 


*మార్గశిరమాసం నెలరోజులూ ఆ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించాలి. వ్రతాన్ని ఆరంభించారు గోపికలు. వేకువనే లేచారు. కాళిందిమడుగులో స్నానాలు చేశారు. ఇసుకతో కాత్యాయనీదేవి ప్రతిమను రూపొందించి ఒడ్డున ప్రతిష్టించారు. ఆ ప్రతిమను గంధపుష్పాక్షతలతో పూజించి, రకరకాల పళ్ళూ, పువ్వులూ నివేదించారు. అలా కొద్దిరోజుల గడిచింది.*


*ఒకనాడు ఎప్పటిలాగానే గోపికలంతా వేకువనే లేచి, స్నానానికి కాళిందిమడుగునకు చేరుకున్నారు. చీరెలు విప్పి ఒడ్డున పెట్టుకున్నారు. మడుగులో దిగి జలకాలాడసాగారు. అప్పుడు వచ్చాడక్కడకి కృష్ణుడు. ఒంటరిగా రాలేదు, చెలికాళ్ళతో వచ్చాడు. గుంపుగా వచ్చాడు. ఒడ్డున ఉన్న గోపికల చీరలు చూశాడు. జలకాలాడుతున్న గోపికల్ని చూశాడు. కొంటెబుద్ధిపుట్టింది. చీరెలందుకున్నాడు. పరుగందుకున్నాడు. పరిగెత్తి, దగ్గరగా ఉన్న వేపచెట్టెక్కి కూర్చున్నాడు.*


*‘‘ఇదేమిటి కృష్ణా! చీరెలెత్తుకొచ్చి చెట్టెక్కి కూర్చున్నావు. ఇది ఎవరయినా చూస్తే ఇంకేమయినా ఉందా? దెబ్బలు పడతాయి. కిందకి దిగు, వాళ్ళ చీరెలు వాళ్ళకి ఇచ్చేయ్‌.’’ అన్నారు స్నేహితులు.‘‘నేను ఇవ్వను.’’ అన్నాడు కృష్ణుడు. కృష్ణుడు మాటంటే మాటే! చీరెలివ్వడు. గోకులంలో పెద్దలు చూస్తే దెబ్బలు తప్పవు. ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారు స్నేహితులు. మెల్లగా తప్పుకున్నారు అక్కణ్ణుంచి.*


*ఇంతలో స్నానాలు పూర్తయ్యాయోమో! చీరెలు కోసం ఒడ్డుకేసి చూశారు గోపికలు. లేవక్కడ. ఆందోళన చెంది, అటూ ఇటూ చూశారు. చెట్టుమీద చీరెలు పట్టుకుని కూర్చున్న చిన్నికృష్ణుడు కనిపించాడు. నవ్వుకున్నారు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

కామెంట్‌లు లేవు: