5, ఏప్రిల్ 2025, శనివారం

మహరాజండీ

 ఎంత కష్టం.. ఎంత కష్టం..


'ఏవమ్మా అన్నపూర్ణమ్మా.. నీ సుపుత్రుడు నిద్ర లేచాడా?' అని వ్యంగ్యంగా అడిగాడు హరి. 'ఆ.. చాల్లేండి.. మీ వెటకారాలు.. వాడిని తిట్టందే మీకు తెల్లారదనుకుంటా..


కొడుకు నచ్చినప్పుడు నిద్రలేస్తాడు' అంది అన్నపూర్ణమ్మ విసుగ్గా..!

'ఇదిగో ఇలానే.. నా కొడుకు.. నా కొడుకు అని వాడ్ని బాగా గారాబం చేసి ఎందుకూ పనికిరానివాడిలా చేస్తున్నావ్‌' అన్నాడు భర్త హరి.

'నా కొడుకు మహరాజండీ.. చూస్తుండండీ.. ఏదో ఒక రోజు వాడు గొప్పవాడవుతాడు' అంది అన్నపూర్ణమ్మ.

'అవునవును.. తల్లీ కొడుకులిద్దరూ ఇలానే పగటి కలలుకనండి..' అంటూ.. బల్లపై పెట్టిన క్యారేజీ తీసుకొని ఆఫీసుకి బయలుదేరాడు హరి.

'నాన్నా.. సిద్ధూ.. లేవరా.. ఇదిగో కాఫీ తాగు.. లేరా బాబూ' అంటూ నిద్రలేపింది అన్నపూర్ణమ్మ.

'ఆగమ్మా.. ఇంకాసేపు పడుకొని లేస్తాలే.'.

'ఇప్పటికే ఉదయం 9 గంటలయ్యింది.. ఎక్కడో ఇంటర్వ్యూ ఉంది.. వెళ్లాలమ్మా అన్నావ్‌.. మర్చిపోయావా? లే.. నాన్నా..' అని తలనిమురుతూ కొడుకును ఆప్యాయంగా నిద్రలేపింది అన్నపూర్ణమ్మ.

'ఓV్‌ా.. ఇంటర్వ్యూకి వెళ్లాలి కదూ..' అని బరువుగా నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని, టిఫిన్‌ తిని, ఫైల్‌ పట్టుకొనిపట్టుకొని ఇంటర్వ్యూకి బయలుదేరాడు సిద్ధూ.

.. దారిలో తండ్రి హరి నుండి ఫోన్‌..

'ఏరా.. సిద్ధూ.. ఇంటర్వ్యూకి వెళుతున్నావా?'

'ఆ.. వెళుతున్నా నాన్న..'

'చేతిలో ఖర్చులకు చిల్లరేమైనా ఉందా?'

'ఆ.. బయలుదేరేప్పుడు అమ్మ ఇచ్చింది నాన్నా..'

'సరే.. జాగ్రత్తగా వెళ్లి రా.. ఆల్‌ ది బెస్ట్‌..' అన్నాడు హరి.


'రేరు.. సిద్ధూ..' (వెనక నుండి పిలుపు)

'అరేరు.. చైతూ.. నువ్వేంట్రా ఇక్కడీ'

'ఇక్కడ కొత్తగా పెట్టిన కంపెనీలో వేకెన్సీ ఉందంటే ఇంటర్వ్యూకి వచ్చారా?'

'ఓV్‌ా.. నేను కూడా అక్కడికేరా?

పదా.. ఇద్దరం కలిసి వెళదాం..' (అంటూ.. సిద్ధూ, చైతూ కలిసి మాట్లాడుకుంటూ వెళ్లారు.)

.. ఇంటర్వ్యూ అయ్యింది..


'ఏరా.. చైతూ.. ఏమన్నార్రా..?'

'తర్వాత కాల్‌ చేస్తాం అన్నార్రా..'

'మరి నువ్వు?'


సేమ్‌ రిప్లరు రా..'

'ఏంట్రా సిద్ధూ.. ఇంత చిన్న ఉద్యోగానికి అంతమంది వచ్చారేంట్రా..!'

'మరి.. మన దేశంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారంటే.. ఎగ్జాంపుల్‌గా ఈ ఒక్క ఇంటర్వ్యూ చూపిస్తే చాలు..!' అని అన్నాడు సిద్ధూ నిస్పృహతో..!

'అవును రా.. ఇద్దరం డిగ్రీలు చేసి ఇలా ఫైళ్లు చేత్తో పట్టుకొని ఇంటర్వ్యూలకు వెళ్లడమే సరిపోతుంది.. సంత మార్కెట్లో రద్దీ ఉన్నట్లు ఎక్కడ ఇంటర్వ్యూలున్నా కాంపిటీషన్‌ ఓ రేంజ్‌లో ఉంటుంది. మనకు తగ్గ ఉద్యోగాలు దొరుతాయంటావారా..' అని ఆవేదనతో అన్నాడు చైతూ..!

'సరేరా.. ఇప్పటికే మధ్యాహ్నం 3 గంటలయ్యింది.. కడుపులో ఆకలి దంచికొడుతుంది.. మళ్లీ కలుద్దాం.. నువ్వు జాగ్రత్తగా వెళ్లు..' అని సిద్ధూ ఇంటి బాటపట్టాడు.

.. సిద్ధూ ఇంటికి రాగానే.. అన్నపూర్ణమ్మ భోజనం వడ్డించింది..

'నాయనా సిద్ధూ.. ఇంటర్వ్యూ ఏమయ్యింది?'

'తర్వాత కాల్‌ చేస్తాం అని చెప్పారమ్మా..!'


అవునా.. సరేలే..!'

'ఏంటమ్మా.. ఈ వంట 4 రోజులుగా పప్పూ, దోసకాయ, బెండకాయ అంటూ.. ఇవే వండుతున్నావ్‌.. నోరు చచ్చిపోతుంది..!' అంటూ విసుగ్గా భోంచేశాడు సిద్ధూ.

'ఏం చేయను నాన్న.. మీ నాన్న ఒక్కడి సంపాదనతో ఇల్లంతా గడవాలి కదా..!' అని బాధగా బదులిచ్చింది అన్నపూర్ణమ్మ.

.. భర్త హరికి అన్నపూర్ణమ్మ ఫోన్‌..

'ఏవండీ.. వచ్చేటప్పుడు ఓ బిర్యానీ ప్యాకెట్‌ తెండి..'

'ఎందుకు.. పూర్ణ..?'

'ఏంలేదండీ.. సిద్ధూ మంచి ఆకలి మీద వచ్చాడు.. ఇంట్లో పప్పు ఉండేసరికి వాడు సరిగ్గా భోంచేయలేదు.. బిడ్డ అర్థాకలితో లేచాడు.. కాస్త మీరు బిర్యానీ తెస్తే వాడు తింటాడని'.

'సరే.. తెస్తాలే.'

.. ఇంటికి వచ్చిన హరి గుమ్మంలోనే భార్యను పిలిచాడు..

'ఏవోరు.. అన్నపూర్ణమ్మ.. ఇదిగో నీ సుపుత్రుడికి బిర్యానీ.. వచ్చి తినమని చెప్పు..' అన్నాడు హరి వ్యంగ్యంగా..


సర్లేండి వాడినెప్పుడూ తిట్టడమే మీ పని..!' అంది విసురుగా అన్నపూర్ణమ్మ.

'నాన్నా.. సిద్ధూ.. లే నాన్న.. ఇదిగో మీ నాన్న నీ కోసం బిర్యానీ తెచ్చాడు.. తిందువుగాని లే..' అంది అన్నపూర్ణమ్మ.

బిర్యానీ మాట వినగానే దిగ్గున లేచాడు సిద్ధూ.. వెంటనే ప్యాకెట్‌ ఓపెన్‌ చేసి తినడం ప్రారంభించాడు.

..

సిద్ధూతోపాటు భోజనానికి హరి కూడా కూర్చున్నాడు.

అరే సిద్ధూ.. ఇప్పటికి 2 చోట్ల 'ఉద్యోగాల్లో చేరి కష్టంగా ఉందని, టైం ఎక్కువ అని, పని ఎక్కువ చెబుతున్నారని.. మానేశావ్‌. ఇంటర్వ్యూలకి వెళుతూనే ఉన్నావ్‌.. ఇప్పటికే నీకు 30 ఏళ్ళొచ్చొరు.. మాకున్న ఒక్కగానొక్క కొడుకువి కాబట్టి నిన్ను గారాబంగా చూసుకుంటున్నాం. నీ భవిష్యత్తు గురించి దిగులుగా ఉంది. ఈసారి వచ్చే ఉద్యోగం ఎంత కష్టమైనా నిలదొక్కుకొని పనిచేరు నాన్న.. మనది మధ్యతరగతి కుటుంబం.. నాకూ వయసవుతుంది.. ఆలోచించు.'. అని అంటుండగానే.. అన్నపూర్ణమ్మ వచ్చింది..


' ఆ..ఆ.. మొదలుపెట్టారా? తింటున్నప్పుడే వాయించేస్తారు మీరు.. పిల్లాడ్ని ప్రశాంతంగా బిర్యానీ తిననివ్వండి' అంది.

'ఏంటి పూర్ణ.. నీ కర్థమవుతుందా? ఒకరి దగ్గర నేను పనిచేయడమేంటీ? అని వాడు, సొంత వ్యాపారం పెడతానంటూ.. మనచేత రెండుసార్లు పెట్టుబడి పెట్టించి దివాలా తీశాడు.. అనుభవం లేని వ్యాపారం వద్దు అంటే వినలేదు..' అని విసుక్కున్నాడు హరి.

'అవునండీ.. గుర్తుంది.. ఆ పెట్టుబడి డబ్బులు నా నగలు తాకట్టు పెట్టినవే కదా.. తెలుసులే' అంది అన్నపూర్ణమ్మ.

'మరి ఆ రెండో వ్యాపారం మాటేమిటి?' అని అన్నాడు హరి.

'అది లోను కదా.. నెలనెలా కడుతున్నాంగా..' అంది పూర్ణమ్మ.

'చూడు పూర్ణ.. నేను చిన్న ఉద్యోగిని.. నాకొచ్చే జీతంతో ఎలా ఇంటిని నెట్టుకొస్తున్నామో నీకు తెలుసు.. అయినా నీ అతి గారాబంతో వీడికి కష్టం విలువ తెలీకుండా చేస్తున్నావు..' అన్నాడు అసహనంతో హరి.

'ఇక చాలు నాన్న.. నా కోసం మీ ఇద్దరూ గొడవపడకండి.. అమ్మనేం అనొద్దు.. నాకు నచ్చిన ఉద్యోగం దొరకాలిగా.. డిగ్రీ చదివి తక్కువ జీతానికి పని చేయమంటావా ఏంటి? ' అని విసుక్కున్నాడు సిద్ధూ.

' అరే.. సిద్ధూ.. ముందు దొరికిన ఉద్యోగంలో చేరి ఎక్స్‌పీరియన్స్‌ సంపాదించు.. నిదానంగా నీకు తగ్గ ఉద్యోగం వెతుక్కొని స్థిరపడు.. అంతేకానీ అసలు ఉద్యోగమూ, సద్యోగమూ, లేకుండా ఇలా టైంపాస్‌ చేస్తే రేపు నీకు వయసైపోతుంది.. అప్పుడేం చేస్తావురా?' అని గట్టిగా అరిచాడు హరి.

'ఛీ.. బిర్యానీ తేవడం ఎందుకు.. ఇలా క్లాసులు పీకడం ఎందుకు? ఛిఛీ..' అంటూ.. సిద్ధూ చిరాగ్గా వెళ్లిపోయాడు.

'ఏంటండీ మీరు.. ఉన్నది ఒక్కగానొక్క కొడుకు.. వాడ్ని ఎందుకు అలా బాధపెడతారు? నిదానంగా ఉద్యోగంలో చేరతాడులెండి..' అంది అన్నపూర్ణమ్మ.

చేసేదేం లేక.. తలపట్టుకొని లోనికి వెళ్లాడు హరి.

.. ఇలా రోజులు గడుస్తుండగా..


ఓ రోజు ఆఫీసులో హరికి గుండెపోటు వచ్చింది. ఆఫీసు సిబ్బంది వెంటనే హరిని దగ్గర్లో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి క్లిషంగా ఉందని డాక్టర్లు ఎమర్జెన్సీ వార్డులో ఉంచారు. విషయం తెలియగానే.. అన్నపూర్ణమ్మ, సిద్ధూలు ఆసుపత్రికి చేరుకున్నారు.

'చూడు బాబూ.. మీ నాన్నగారికి అర్జెంటుగా హార్ట్‌ ఆపరేషన్‌ చేయాలి.. బ్లడ్‌ పంపింగ్‌ ప్రాబ్లం ఉంది.. దాదాపు రూ.2 లక్షలు అవుతుంది. బిల్లు గురించి మా నర్సు చెబుతారు..' అని డాక్టర్‌ చెప్పడంతో.. సిద్ధూ గుండె బరువెక్కిపోయింది..

తల్లికి విషయం తెలిపాడు సిద్ధూ.

'చూడు నాన్న సిద్ధూ.. మా అన్నయ్య వెంకటేశ్వర్లు దగ్గరకు వెళ్లు.. వెంటనే బయలుదేరు.. ఊరెళ్లి మా అన్నతో మాట్లాడి డబ్బు పట్టుకొని రా.. వెళ్లు నాన్నా..' అని అన్నపూర్ణమ్మ కొడుకును తన అన్న వద్దకు పంపింది.

వెంటనే బయలుదేరిన సిద్ధూ.. తన మామయ్య వెంకటేశ్వర్లు వద్దకు వెళ్లి జరిగిన సంగతంతా చెప్పాడు.

'అరే.. సిద్ధూ.. నీకు తెలీదేమో..! ఆ మధ్య నువ్వేదో


వ్యాపారం పెడుతున్నావంటూ.. మీ అమ్మ నా చేత నగలు తాకట్టు పెట్టించింది. మళ్లీ ఏదో అవసరం ఉందంటూ.. మీ నాన్న కూడా నా దగ్గర కొంత మొత్తం తీసుకున్నాడు.. ఇప్పుడైతే నా దగ్గర చిల్లిగవ్వ లేదురా.. అసలు మా పరిస్థితే ఏం బాగోలేదు.. ఏమీ అనుకోకు నాన్న.. ఓ సారి వచ్చి నాన్నకు చూసి వెళతానని చెప్పు.. సరేనా.. మళ్లీ నీకు లేటవుతుందేమో.. తొందరగా వెళ్లు.. ' అని సిద్ధూను పంపేశాడు.

సిద్ధూ.. నిర్ఘాంతపోతూ.. బరువెక్కిన అడుగులతో ఆ ఇంటి గుమ్మం దాటి బయలుదేరాడు.

మా మావయ్య ఎంత మారిపోయాడు. మా పరిస్థితి బాగున్నంతసేపు మాకోసం అగ్గగ్గలాడిపోయాడు. ఇప్పుడు మా స్థితి మారిపోయేసరికి కనీసం మిట్టమధ్యాహ్నం వచ్చిన నాకు గుక్కెడు మంచినీళ్లయినా ఇవ్వకుండా లేని ప్రేమను నటిస్తూ సాగనంపాడు. మా అత్తయ్య కనీసం వచ్చి పలకరించను కూడా లేదు.. మనుషులు ఇంతలా మారిపోతారా? అనుకుంటూ సిద్ధూ ఆసుపత్రికి చేరుకున్నాడు.


'ఏం నాన్న.. మామయ్య ఏం అన్నాడు.. నీతోపాటు వచ్చాడా? డబ్బు సాయం చేస్తానన్నాడా?' అంటూ ఆత్రంగా అడిగింది అన్నపూర్ణమ్మ.

'అమ్మా.. మామయ్య పరిస్థితి బాగోలేదంట.. ఓసారి వచ్చి చూసెళతానన్నాడు..' అంటూ.. కనురెప్పలచాటున ఉవ్వెత్తున వస్తున్న కన్నీళ్లను దింగమింగుతూ అమ్మ అమాయకత్వాన్ని చూస్తూ చెప్పాడు. అంతే.. ఆ మాటతో అన్నపూర్ణమ్మ ఆలోచనలో పడిపోయింది.!

'.. అమ్మా.. నువ్వేం కంగారుపడకమ్మా.. నా స్నేహితుడు ఒకడున్నాడు.. వాడ్ని అడిగితే తప్పకుండా మనకు అప్పు ఇస్తాడు.. నువ్వు ధైర్యంగా ఉండమ్మా.. నేనిప్పుడే వస్తాను..' అంటూ.. సిద్ధూ వెంటనే చైతూ ఇంటికి బయలుదేరుతూ ఫోన్‌ చేశాడు.

'అరే సిద్ధూ.. నేను మా కాలనీలో ఉన్న వాచ్‌ కంపెనీలో వర్క్‌ చేస్తున్నారా.. నువ్వు అక్కడికి వచ్చేరు..' అన్నాడు చైతు.

చైతూను కలిసిన సిద్ధూ విషయమంతా చెప్పాడు.

'అరే సిద్ధూ.. ఇప్పటికిప్పుడు అంత మొత్తం కావాలంటే కష్టం.. కానీ.. ఇక్కడే ఉండు..' అని చైతు తన ఓనర్‌తో మాట్లాడటానికి వెళ్లాడు.

కాసేపటికి తిరిగొచ్చి.. 'అరే సిద్ధూ.. మా ఓనర్‌తో మాట్లాడాను.. ఆయన మంచి మనసుతో డబ్బు ఇస్తానన్నారు. నిదానంగా నెలనెలా కొంతకొంత మొత్తంలో ఆ అప్పు కట్టొచ్చు.. నువ్వు ధైర్యంగా ఉండరా..' అన్నాడు చైతూ.

అంతే.. గుండెల్లో నుండి తన్నుకొచ్చిన కన్నీళ్లతో చైతూను గట్టిగా హత్తుకున్నాడు సిద్ధూ.ఇంతలో.. చైతూ ఓనర్‌ వచ్చి డబ్బివ్వడంతో సిద్ధూ అక్కడి నుండి వెంటనే ఆసుపత్రికి వెళ్లి బిల్లు కట్టేసి తల్లితో జరిగిందంతా చెప్పాడు.ఆపరేషన్‌ సక్సెస్‌ అయ్యింది. నాలుగు రోజుల తరువాత హరిని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్‌ చేశారు. మూడు నెలల వరకు హరి బెడ్‌ రెస్ట్‌ తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. ఇప్పుడు ఇల్లు గడవడం ప్రశ్నార్థకమయ్యింది. ఇంతవరకు అమ్మానాన్నల గారాబం, ప్రేమతో కాలం గడిచిన సిద్ధూకి.. ఇప్పుడు ఆ కాలమే పరీక్ష పెట్టినట్టయింది..!

ఇప్పటికిప్పుడు ఉద్యోగం ఎవరిస్తారు? రేపటి నుండి ఇల్లు గడిచేదెలా? ఏం చేయాలి? సిద్ధూ బుర్రలో ఆలోచనలు తొలిచేస్తున్నాయి.. నిద్ర పట్టడమే లేదు.. ఇంతలో అన్నపూర్ణమ్మ వచ్చింది.

'నాన్న సిద్ధూ.. ఏం ఆలోచిస్తున్నావ్రా..'

'ఏం లేదమ్మా..' అన్నాడు సిద్ధూ..

'నాన్న సిద్ధూ.. నేను ఏదైనా పనికి వెళతానురా.. నాన్న చూస్తే అలా ఉన్నాడు.. మన ఇల్లు గడవాలి కదా? నీకా ఇప్పటికిప్పుడు ఉద్యోగం ఎవరిస్తారు? నువ్వు కూడా నీ ప్రయత్నం చెయ్యి.. ఏం నాన్న' అని కన్నీళ్లతో అంది అన్నపూర్ణమ్మ.

'అమ్మా.. నీ ఆరోగ్యమే అంతంతమాత్రం.. నువ్వు పనికెళితే నాన్నను ఎవరు చూసుకుంటారు? అయినా నేనున్నాగా అమ్మా.. నేను ఏదో విధంగా రేపు ఉద్యోగం సంపాదిస్తాను.. నువ్వు ధైర్యంగా ఉండమ్మా.. వెళ్లమ్మా.. నువ్వు ఏ ఆలోచన లేకుండా పడుకో..!' అన్నాడు సిద్ధూ. తనకు తెలిసిన ఫ్రెండ్స్‌ అందరికీ ఫోన్లు చేశాడు..' ఏమైనా వేకెన్సీలున్నాయా?'

' లేవురా? ఉంటే చెబుతాం..!' అందరి దగ్గర నుండి అదే సమాధానం..!

.. నిద్రపట్టక వరండాలో ఉన్న బైక్‌ పై కూర్చొని సిద్ధూ ఆలోచించసాగాడు..


ఉద్యోగం విషయంలో నిర్లక్ష్యంగా వెతికినప్పుడు చాలా అవకాశాలొచ్చాయి.. అప్పుడు వాటిని కాలదన్నుకున్నాను. ఇప్పుడు ఏ ఉద్యోగం చేద్దామన్నా.. కనీసం కూడా దొరకడం లేదు. కాసేపు సిద్ధూ కుంగిపోయాడు.. వెంటనే తనకు తానే ధైర్యం తెచ్చుకొని కాసేపు మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని తీక్షణంగా ఆలోచించాడు. వెంటనే సిద్ధూకి ఓ ఆలోచన తట్టింది..! బైక్‌ సర్వీస్‌ చేస్తే.. ఆలోచన వచ్చిందే తడవు.. బైక్‌ సర్వీస్‌లో రిజిస్ట్రేషన్‌ చేశాడు. తెల్లవారగానే రెడీ అయ్యి బైక్‌ సర్వీస్‌కి బయలుదేరాడు.

ఆకలిని సైతం పక్కన పెట్టి పనిలో కూరుకుపోయాడు సిద్ధూ..తెల్లారనగా వెళ్లిన కొడుకు.. రాత్రి 10 గంటలైనా రాలేదు. తిన్నాడో, లేదో.. ఎటు వెళ్లాడో, అనుకుంటూ గుమ్మం దగ్గరే కొడుకు కోసం అన్నపూర్ణమ్మ ఎదురుచూస్తూ ఉంది. ఇంతలో.. సిద్ధూ ఇంటికొచ్చాడు.

అన్నపూర్ణమ్మ కళ్లు వెలిగాయి..' నాన్న సిద్ధూ, ఎక్కడికెళ్లావురా..! ఇదిగో వస్తానమ్మా.. అంటూనే 10 గంటలకొచ్చావు? ఏం నాన్న ఏమైందిరా?' అని తల్లడిల్లిపోతూ అడిగింది అన్నపూర్ణమ్మ.


'ఏం లేదమ్మా.. నేను ఉద్యోగానికెళతానన్నాగా.. ఇదిగో అమ్మా నా తొలి సంపాదన' అని తల్లి చేతిలో కొంత మొత్తం డబ్బును పెట్టాడు సిద్ధూ.

కొడుకు కష్టపడి తొలి సంపాదన అంటూ తల్లి చేతిలో పెట్టగానే అన్నపూర్ణమ్మకు సిద్ధూ ఎంతో ఎత్తుకు ఎదిగిపోయినట్లు కనిపించాడు.

'బాబూ.. అన్నం తిందువుగాని రా.. నాయనా..' అంటూ సిద్ధూ చేతులను పట్టుకోగానే అన్నపూర్ణమ్మ కన్నీళ్లు గుండెలను తన్నుకొని కళ్లలో నుండి సిద్ధూ చేతులపై జాలువారాయి.

'ఏం నాన్న.. ఏం ఉద్యోగం రా అది.. ఇలా నీ రెండు చేతులూ బొబ్బలెక్కిపోయాయేంటి? వద్దు నాన్న ఆ ఉద్యోగం నీకొద్దు..' అంటూ.. అన్నపూర్ణమ్మ కన్నీళ్లతో తల్లడిల్లిపోయింది.

'అమ్మా.. నేను బైక్‌ సర్వీస్‌కు వెళుతున్నాను.. ఇది మొదటి రోజు.. పని అలవాటు లేక ఇలా చేతులు బొబ్బలెక్కాయంతే..! నువ్వు బాధపడకమ్మా.. పదమ్మా.. ఆకలేస్తుంది.. అన్నం పెడుదువుగాని' అని సిద్ధూ తల్లిని పట్టుకొని లోనికి వెళ్లాడు.


ఇదంతా చూస్తున్న హరి మనస్సు నీరుగారిపోయింది..ఇలా.. కొన్ని రోజులు గడిచాయి..

ఓ పెద్ద కంపెనీలో పనిచేసే ఆఫీసర్‌కు కారు రిపేరు వచ్చి.. అర్జంటుగా బైక్‌ సర్వీసుకి కాల్‌ చేశాడు.. అది తెల్లవారి 4 గంటల సమయం. ఎవ్వరూ సర్వీసుకి రావడం లేదు.. 'సారీ సార్‌..' అంటూ ఫోన్‌ పెట్టేస్తున్నారు.. ఫోన్లు చేసే క్రమంలో ఆ ఆఫీసర్‌కు సిద్ధూ నెంబర్‌ కలిసింది.

' హలో.. అర్జంటుగా నన్ను డ్రాప్‌ చేయాలి.. నువ్వు ఎంతడిగినా ఇస్తాను.. ' అని అన్నాడు ఆఫీసర్‌.

'ఓకే సార్‌.. మీ లొకేషన్‌ పెట్టండి.. వెంటనే వస్తాను' అని చెప్పాడు సిద్ధూ.

ఆ సమయంలో వచ్చి తనను జాగ్రత్తగా డ్రాప్‌ చేసినందుకు మెచ్చుకుంటూ ఆ ఆఫీసర్‌ సిద్ధూకి అనుకున్నదానికంటే ఎక్కువగానే ఇచ్చాడు.

'ఇదిగో బాబూ నీ పేరేంటీ?' అడిగాడు ఆఫీసర్‌.


'నా పేరు సిద్ధూ సార్‌..'


'ఓకే.. సిద్ధూ.. నా కార్‌ రిపేరులో ఉంది.. ఈ నాలుగు రోజులు నన్ను నువ్వు పికప్‌ చేసుకోగలవా?' అని అడిగాడు ఆఫీసర్‌.

'తప్పకుండా సార్‌..' అన్నాడు సిద్ధూ.

మూడు రోజులు గడిచాయి.తక్కువ సమయంలో సిద్ధూ ఆ ఆఫీసర్‌కు దగ్గరయ్యాడు.ఓ రోజు ఆఫీసర్‌ సిద్ధూతో..

' సిద్ధూ నువ్వు ఎంతవరకు చదువుకున్నావు.. ఈ బైక్‌ సర్వీసేనా? ఇంకేమైనా చేస్తున్నావా?' అని అడిగారు.

'లేదు సార్‌.. ఈ బైక్‌ సర్వీస్‌ మాత్రమే చేస్తున్నాను. డిగ్రీ పూర్తి చేశాను. ఉద్యోగం కోసం వెతుకుతున్నాను సార్‌' అన్నాడు.

'ఓకే సిద్ధూ.. మా కంపెనీలో వేకేన్సీ రెడీగా ఉంది.. నీలాంటి కష్టపడే కుర్రాడే మాకు కావాలి.. నీకు ఇష్టమైతే రేపు నీ రెస్యూమ్‌ తీసుకొని మా ఆఫీసుకి వచ్చి నన్ను కలువు ఓకేనా..' అన్నారు ఆఫీసర్‌.

'చాలా.. చాలా థాంక్యూ సార్‌..' అన్నాడు సిద్ధూ.మరుసటి రోజు రెస్యూమ్‌తో సిద్ధూ ఆఫీసర్‌ పనిచేసే కంపెనీకి వెళ్లాడు.ఇంటర్వ్యూ సక్సెస్‌.. నెలకు రూ.30 వేల జీతం. ఇంటికి ఆనందంగా వచ్చిన సిద్ధూ తన తల్లితో జరిగిందంతా చెప్పాడు.తండ్రి హరి కూడా ఆ మాటలు విని ఆనందించాడు. సిద్ధూని దగ్గరకు పిలిచి తలపై ముద్దుపెట్టుకున్నాడు.

'నాన్న నువ్వు చెప్పినప్పుడు నాకు కష్టం విలువ తెలియలేదు.. నువ్వున్నావన్న ధైర్యంతో నేను నిర్లక్ష్యంగా ప్రవర్తించాను.. కానీ నేనెప్పుడైతే కష్టానికి సిద్ధపడ్డానో.. ఆ కష్టం నన్ను పిలిచి గౌరవించి ఈ ఉద్యోగమిచ్చింది నాన్న.. నేను ఇంకా కష్టపడి ఎదుగుతాను నాన్న.. మీ మాటలు పెడచెవినపెట్టి మిమ్మల్ని బాధపెట్టాను. క్షమించండి నాన్న ' అని సిద్ధూ తన తండ్రితో మాట్లాడుతుంటే హరి కళ్లు చెమ్మగిల్లాయి. తండ్రి రెండు చేతులను సిద్ధూ ముద్దాడాడు.

ఇంతలో.. అన్నపూర్ణమ్మ వచ్చి 'నాన్నా.. సిద్ధూ.. రా నాన్న.. భోజనం చేద్దువుగాని..' అని పిలిచింది.

'మరి బాబూ.. ఈరోజు పప్పు మాత్రమే చేశాను.. ఉండు నాన్న అన్నం చల్లారింది కాస్త వేడి చేసుకొస్తాను' అంది అన్నపూర్ణమ్మ.

'వద్దమ్మా..' అన్నాడు సిద్ధూ..

'ఏం నాన్న..?' అని అడిగింది అన్నపూర్ణమ్మ.


అమ్మా.. నువ్వు వండే పప్పు చాలా కమ్మగా ఉంటుంది.. అన్నం వేడి చేయనక్కరలేదు.. అలాగే పెట్టమ్మ.. రా అమ్మా ముగ్గురం కలిసి భోంచేద్దాం' అన్నాడు సిద్ధూ. కొడుకు అలా అనడంతో తల్లిదండ్రులిద్దరూ ఆనందంతో నిండిపోయారు. ముగ్గురూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తుంటే.. అప్పుడర్థమయ్యింది సిద్ధూకి.. ఇన్నాళ్లూ తాను ఎంత సంతోషాన్ని కోల్పోయానో అని..!

మొట్టమొదటిసారి తల్లితండ్రితో కలిసి సిద్ధూ భోజనం చేస్తూ ఆ ఆనందాన్ని ఆస్వాదించాడు. ఆ అన్నంలోని ప్రతీ మెతుకులో కష్టం కనబడుతుంది.. తన కోసం ఇంతవరకు తల్లితండ్రులు పడిన కష్టం విలువ తెలిసింది. తల్లితండ్రులతో కలిసి ప్రేమగా తృప్తిగా భోజనాన్ని ముగించాడు సిద్ధూ.

కామెంట్‌లు లేవు: