మనసులో ఏ మాలిన్యం లేకుండా నిర్మలంగా ఉన్నప్పుడే మంచి ఆలోచనలు వస్తాయి.
ఆ ఆలోచనల ఫలితంగా సత్కర్మలు ఆచరించి మనిషి దైవత్వానికి చేరువవుతాడని, దైవానుగ్రహాన్ని పొందుతాడని వేద సారమైన భగవద్గీత బోధిస్తోంది.
కాలుష్యాలతో అల్లకల్లోలంగా ఉండే అంతరంగం ఎన్నో అనర్థాలకు మూలం అనడానికి మన పురాణాల్లో ఎన్నో ఉదాహరణలున్నాయి.
రామాయణంలో సీతామాతను చెరబట్టిన రావణాసురుడు,
భారతంలో స్వార్థంతో గర్వాంధుడై పాండవులకు సూదిమొన మోపినంత నేల కూడా ఈయనన్న దుర్యోధనుడు.. ..
ఆ కోవలోనివారే.
అందుకే మనసు ఎప్పుడూ సత్సంకల్పాలు చేయాలి. అప్పుడే హృదయం విశాలమవుతుంది. ఇరుకైన అంతరంగం అపరిశుభ్రంగా మారుతుంది.
ఇదే విషయాన్ని తన రెండు పంక్తుల పద్యంలో కబీరుదాసు హృద్యంగా చెప్పారు.
" *నహాయే ధోయే క్యా హువా,* *జో మన్ కా మైల్ నజాయ్*
*మీన్ సదా జల్ మేఁ రహై, ధోయే బాస్ న జాయ్"*
ఎప్పుడూ నీటిలో ఉండే చేపని ఎంత కడిగినా దాని వాసన పోనట్లుగా, మనిషి సుగంధాలు పులుముకొని రోజూ రెండు, మూడుసార్లు స్నానం చేసినా మనసులోని మాలిన్యాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయడని దీని భావం.
వ్యక్తికి శరీరసౌందర్యంపై ఉన్న పట్టింపు, శ్రద్ధాసక్తులు.. మనసును ఏ చెడు భావాలూ లేకుండా నిర్మలంగా, పవిత్రంగా ఉంచుకోవడంపై ఉండదని కబీరు పద్యంలోని అంతరార్థం.
మనసు పరిశుభ్రత అనేది భగవద్భక్తితో సమానమైన అంశం. భగద్భక్తికి శరీరం ఒక్కటే శుచిగా ఉంటే చాలదు.
మానసిక మాలిన్యం ఉంటే భగవద్భక్తి అంటదు. అందుకే నిర్మలమైన అలోచనలకే చోటివ్వు. వ్యర్థమైన కలుషిత విషయాల్ని మనసులోకి రానియ్యకు’ అంటూ ఆత్మపరిశుభ్రత గురించి ప్రబోధించాడు మహాత్మా గాంధీ.
ఓ సందర్భంలో శ్రీరామచంద్రుడు ‘మోక్షసాధనకు ఏమి చేయాలి’ అని వశిష్ఠుడిని అడిగాడు.
అందుకు వశిష్ఠ మహర్షి.. ‘మనసును నిర్మలంగా ఉంచుకోవడమే’ అని జవాబిచ్చారు.
మనస్సు ఎంతో నిర్మలంగా నిష్కల్మషంగా వుంచుకోవడం ఎంతైనా ముఖ్యం.
*జై శ్రీమన్నారాయణ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి