14, జులై 2020, మంగళవారం

స్వర్గం నరకం

ఒక పెద్ద మనిషి తన గుఱ్ఱము మరియు కుక్కతో చాలా దూరం నడుస్తుండగా దప్పిక వేసింది.  తాగడానికి మంచినీళ్ళు  ఎక్కడైన దొరకుతుందా అని వెదకసాగాడు.

దూరంలో ఒక బోర్డు కనిపించింది. దానిలో ' స్వర్గం' అని వ్రాసివుంది. 

అమ్మయ్య మంచి చోటుకే వచ్చి చేరాను అని అనుకొని వెంటనే అక్కడిదాకా వచ్చాడు.

అక్కడ ఒక కొట్టు లాంటిది వుంది. ఒక మనిషి కాపలా కాస్తున్నాడు. 

'బాబు, చాలా దాహంగా వుంది. తాగడానికి మంచినీళ్ళు యివ్వగలరా' అని అడిగాడు. 

ఆ కాపలాదారుడు 'వుంది. లోపలకు వెళ్ళి తాగండి. కాని మీ గుఱ్ఱము మరియు కుక్క లోపల పోవడానికి వీలులేదు. అవి బయటనే వుండాలి. వాటికి నీళ్ళు యివ్వబడదు' అని అన్నాడు. 

'అవి గూడా నాలాగా నాతోనే అలసిపోయి వచ్చాయి. వాటికి కూడా దాహమేస్తుంది కదా. అవి అడగవు కాని యివ్వడం మన ధర్మం కదా' అని ఆ పెద్ద మనిషి అన్నాడు. 

ఆ కాపలదారు ససేమిరా వీలుకాదన్నాడు. 

ఆ పెద్ద మనిషి యిక చేసేది లేక 'వాటికి యివ్వకపోతే నాక్కూడా అక్కర్లేదు' అని వెళ్ళిపోయాడు.

దాహం ఎక్కువవుతూనే వుంది. యేంజెయ్యాలి మరి. యింకొంత అలా నడుస్తూంటే మరొక కొట్టు కనిపించింది. దానికి కూడా స్వర్గం అన్న బోర్డు వ్రేలాడుతుంది. 

పెద్దమనిషికి అనుమానమొచ్చింది యిక్కడ కూడా నీళ్ళు దొరకదేమోనని. 

ఆ కొట్టువాణ్ణి అడిగితే లోపల వుంది తీసుకోమన్నాడు. 

మరి వీటిని యేంజెయ్యాలి అని తనతో బాటువున్న గుఱ్ఱాన్ని కుక్కను చూపించి అడిగాడు. 

ఆ కొట్టువాడన్నాడు 'యిదేంటయ్యా యిలాంటి ప్రశ్న అడుగుతున్నావు. వాటికి దాహమెయ్యదా. వాటిని కూడా లోపలికి తీసుకెళ్ళి నీళ్ళు తాగించు' అని అన్నాడు. 

ఆ పెద్ద మనిషికి ఆనందం అవధులు దాటింది. ఆ కొట్టు వాడితో అన్నాడు

'అదేంటండీ అక్కడ కూడా స్వర్గం అని వ్రాసారు, కాని మృగాలకు మంచినీళ్ళు యివ్వమని చెప్పారు. మీరు కూడా స్వర్గం అని వ్రాసారు కదా , మీరు యిస్తున్నారు. మీ యిద్దరికి యెందుకింత విభేధాలు'.

ఆ కొట్టువాడు అన్నాడు ' అది నిజంగా స్వర్గం కాదు. నరకం. తన తోటి వాళ్ళకు యెటువంటి సహాయం అందివ్వకుండా కేవలం స్వప్రయోజనాల గురించే మనుగడ సాగించేవాళ్ళకు అనువైన చోటు. మీరు ఒకవేళ పొరపాటున వాళ్ళ నిబంధనలకు తలొంచి లోపలకు వెళ్ళివుండినట్లయితే మీకు నరకం చూపించేవారు. యీ ప్రాంతమే నిజమైన స్వర్గం. పరుల కోసమే పాటుపడేవాళ్ళ గురించి స్థాపింపబడ్డది. అందువల్ల యితరుల బాగోగుల గురించి ఆలోచించేవాళ్ళకు స్వర్గం తనంతట తాను ప్రాప్తిస్తుంది. అందులో ఎటువంటి సందేహాలు అపోహాలు అక్కర్లేదు'

ఇది ఒక కథే కావొచ్చు. యిందులో యెంతో నిజం దాగుంది. పరుల కోసమే పాటుపడండి. ఔన్నత్యాన్ని పొందండి.

కామెంట్‌లు లేవు: