లక్ష్మణ సమేతుడైన రాముని ధ్యానించిన వారిలో మనకు మొట్ట మొదటిగా కనబడేవాడు సుందరకాండలో హనుమంతుడు. అశోక వనంలోకి ప్రవేశించే ముందు ’నమోస్తు రామాయ స లక్ష్మణాయ’ అనే మాట ముందు అన్నాడు. తరువాత
’దేవ్యైచ తస్యై జనకాత్మజాయై
నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో
నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః’
అన్నాడు. నమోస్తు రామాయ స లక్ష్మణాయ. రామునకు ఒక నమస్కారం, లక్ష్మణునకు ఒక నమస్కారం అనలేదు. లక్ష్మణునితో ఉన్న రామునకు నమస్కారం అన్నారు. ఆ చెప్పడంలో విశేషం ఏమిటంటే లక్ష్మణునితో ఉన్న రాముడిని స్మరిస్తే కార్య సిద్ధి, రక్షణ లభిస్తుంది. రామాయణాన్ని పరిశీలిస్తే లక్ష్మణుడు లేని రాముడు ఎక్కడా కనబడడు. సీతమ్మ లేని రాముడు ఉంటాడు. పెళ్ళి కాక ముందు పెళ్ళైన తరువాత సీతాపహరణం తరవాత కూడా సీతమ్మ లేని రాముడు కనపడతాడు. ఇలా వివిధ సందర్భాలలో సీతమ్మ లేని రాముడు కనబడతాడు కాని లక్ష్మణుడు లేని రాముడు ఉండడు. విశ్వామిత్రుడు మొట్టమొదట యాగరక్షణకి పిలిచినప్పుడు రాముడినే అడిగాడు. లక్ష్మణుడిని పంపించు అని అనలేదు. కాని రాముడు బయలుదేరితే లక్ష్మణుడూ బయలుదేరిపోయాడు. నువ్వెందుకు నాతో అని రాముడు అనలేదు. నువ్వెందుకు మధ్యన అని దశరథుడూ అనలేదు. ఇతడిని ఎవరు రమ్మన్నారని విశ్వామిత్రుడూ అనలేదు. రాముడు అనగానే లక్ష్మణుడూ ఉంటాడు. లక్ష్మణుడు గురించి చెప్తూ ’బహిః ప్రాణ ఇవాపరః’ అని ఒక మాట బాలకాండలో ఉంది. రాముడికి బహిః ప్రాణంలా ఉన్నాడు లక్ష్మణ స్వామి. ఇది విశేషమైన అంశం. లక్ష్మణ సమేతుడైన రాముడు రక్షా స్వరూపం. ఇది ఒక మంత్ర శాస్త్ర రహస్యం. ఆ కారణం చేతనే రామ రక్షా స్తోత్రంలో మొత్తం ఆ స్వరూపమే కనబడుతుంది.
సన్నద్ధః కవచీ ఖడ్గీ చాప బాణధరో యువా
గచ్ఛన్ మమాగ్రతో నిత్యం రామః పాతు స లక్ష్మణః
అదే విధంగా
ఆత్తసజ్య ధనుషా ఇషు స్పృశౌ అక్షయాశుగ నిషంగ సంగినౌ
రక్షణాయ మమ రామలక్ష్మణౌ అగ్రతః పథి సదైవ గచ్ఛతాం
అగ్రతః పథి - నా ముందు మార్గంలో ఉండాలి. ఎవరు? ఆత్తసజ్య ధనుషౌ - ధనుస్సుని వింటి నారితో అనుసంధానించి బాణాన్ని ఎక్కు పెట్టి నిలబడ్డ రామ లక్ష్మణులు నా ముందు ఉండుగాక! నా ముందే కాదు, నా ముందు, వెనుక, ఇరు ప్రక్కల కూడా ఉండాలని భావించారు. అలాంటి రామ లక్ష్మణులను స్మరించి ఎక్కడికి బయలు దేరినా కార్య సిద్ధి, మార్గరక్ష లభిస్తోందని శాస్త్రం చెబుతోంది. ఆ కారణం చేతనే రామరక్షాస్తోత్రానికి మంత్రాధిదేవత రామలక్ష్మణులు. లక్ష్మణ సహితుడైన రాముడు. ధ్యాన శ్లోకంలోనే అది కనబడుతుంది. అలాంటి రక్షామూర్తి యొక్క అనుగ్రహాం మన భారతదేశానికి ఎల్లవేళలా కలగాలని లక్ష్మణసమేతుడైన రామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ....శివాయగురవే నమః
-పూజ్యగురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి