22, జులై 2020, బుధవారం

మన్వంతరముల వర్ణనము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

అష్టమ స్కంధము - ప్రథమాధ్యాయము

ఓం నమో భగవతే వాసుదేవాయ

రాజోవాచ

1.1 (ప్రథమ శ్లోకము)

స్వాయంభువస్యేహ గురో వంశోఽయం విస్తరాచ్ఛ్రుతః |

యత్ర విశ్వసృజాం సర్గో మనూనన్యాన్ వదస్వ నః॥6326॥

పరీక్షిన్మహారాజు అడిగెను- గురుదేవా! స్వాయంభువ మనువుయొక్క వంశ విస్తృతిని గూర్చి నేను వింటిని. అదే వంశమునందు అతని కుమార్తెల ద్వారా మరీచి మొదలగు ప్రజాపతులను తమవంశ పరంపరను కొనసాగించిరి. ఇప్పుడు ఇతర మనువులను గురుంచి వర్ణింపుడు.

1.2 (రెండవ శ్లోకము)

యత్ర యత్ర హరేర్జన్మ కర్మాణి చ మహీయసః|

గృణంతి కవయో బ్రహ్మంస్తాని నో వద శృణ్వతామ్॥6327॥

మహాత్మా! జ్ఞానులు ఏయే మన్వంతరములలో మహిమాన్వితుడైన భగవంతుని యొక్క అవతారములను, లీలలను వర్ణించిరో, వాటిని నాకు తప్పక వినిపింపుము. నేను శ్రద్ధగా వాటిని వినగోరుచున్నాను.

1.3 (మూడవ శ్లోకము)

యద్యస్మిన్నంతరే బ్రహ్మన్ భగవాన్ విశ్వభావనః|

కృతవాన్ కురుతే కర్తా హ్యతీతేఽనాగతేఽద్య వా॥6328॥

జగత్పతియైన శ్రీహరి గడచిన మన్వంతరములలో చేసిన, వర్తమానమునందు చేయుచున్న, భవిష్యన్మన్వంతరములలో చేయబోవు లీలలను వినిపింపుము.

ఋషిరువాచ

1.4 (నాలుగవ శ్లోకము)

మనవోఽస్మిన్ వ్యతీతాః షట్ కల్పే స్వాయంభువాదయః|

ఆద్యస్తే కథితో యత్ర దేవాదీనాం చ సంభవః॥6329॥

శ్రీశుకుడు వచించెను మహారాజా! ఈ కల్పమునందు స్వాయంభువుడు మున్నగు ఆరుగురు మనువుల యొక్క మన్వంతరములు గడచిపోయెను. వాటిలో మొదటి మన్వంతరమును గూర్చి నేను వర్ణించితిని. అందులో దేవతలు మొదలగు వారి యొక్క ఉత్పత్తి జరిగినది.

1.5 (ఐదవ శ్లోకము)

ఆకూత్యాం దేవహూత్యాం చ దుహిత్రోస్తస్య వై మనోః|

ధర్మజ్ఞానోపదేశార్థం భగవాన్ పుత్రతాం గతః॥6330॥

స్వాయంభువమనువు కుమార్తెయైన ఆకూతియందు యజ్ఞపురుషుని రూపములో భగవానుడు జన్మించి, ధర్మములను  ఉపదేశించెను. అట్లే దేవహూతియందు ఆ ప్రభువు కపిలభగవానునిగా అవతరించి, జ్ఞానోపదేశమును చేసెను.

15.6 (ఆరవ శ్లోకము)

కృతం పురా భగవతః కపిలస్యానువర్ణితమ్|

ఆఖ్యాస్యే భగవాన్ యజ్ఞో యచ్చకార కురూద్వహ॥6331॥

పరీక్షిన్మహారాజా! కఫిల భగవానునిగూర్చి మూడవ స్కంధములో వర్ణింపబడినది. ఇప్పుడు ఆకూతియందు యజ్ఞపురుషుడుగా అవతరించి చేసిన లీలలను వివరించెదను.

15.7 (ఏడవ శ్లోకము)

విరక్తః కామభోగేషు శతరూపాపతిః ప్రభుః|

విసృజ్య రాజ్యం తపసే సభార్యో వనమావిశత్॥6332॥

స్వాయంభువమనువు సకల విషయ భోగముల యెడ విరక్తుడై రాజ్యమును పరిత్యజించెను. పిమ్మట, తన భార్యయైన శతరూపతో గూడి తపమాచరించుటకై వనములకు వెళ్ళెను.

1.8 (ఎనిమిదవ శ్లోకము)

సునందాయాం వర్షశతం పదైకేన భువం స్పృశన్|

తప్యమానస్తపో ఘోరమిదమన్వాహ భారత॥6333॥

అతడు సునందానదీ తీరమున ఒంటి కాలిపై నిలబడి నూరు సంవత్సరములు తీవ్రమైన తపమొనర్చెను. ఆ సమయమున అతడు నిత్యము ఈ విధముగా భగవంతుని స్తుతించెను.

మనురువాచ

1.9 (తొమ్మిదవ శ్లోకము)

యేన చేతయతే విశ్వం విశ్వం చేతయతే న యమ్|

యో జాగర్తి శయానేఽస్మిన్నాయం తం వేద వేద సః॥6334॥

మనువు పలికెను పరమాత్మ చేతనను పొంది విశ్వము చైతన్యవంతమగును. కాని, విశ్వము మాత్రము ఆయనను చైతన్యవంతునిగా చేయజాలదు. ఆ ప్రభువు ప్రళయకాలమున నిద్రించు చున్నను మేల్కొనియే యుండును. ఆ విషయమును ఆయన ఎరుగును. కాని, విశ్వము మాత్రము  తెలియజాలదు. కనుకనే, అతడు పరమాత్ముడు.

1.10 (పదియవ శ్లోకము)

ఆత్మావాస్యమిదం విశ్వం యత్కించిజ్జగత్యాం జగత్|

తేన త్యక్తేన భుంజీథా మా గృధః కస్య స్విద్ధనమ్॥6335॥

ఈ సమస్త విశ్వమునందును, అందలి చరాచరప్రాణుల యందును ఆ పరమాత్మయే వ్యాపించియున్నాడు. కనుక, ఈ జగత్తునందలి యే పదార్థము నందును వ్యామోహమును పొందక ఆ ప్రభువు అనుగ్రహించిన వాటిచేతనే జీవితమును గడపవలెను. ఈ జగత్తునందలి సంపదలు ఏ యొక్కని సొంతము కాదు. కనుక, సర్వదా వాటిపై తృష్ణను విడిచి పెట్టవలెను. సమస్తకర్మలను భగవదర్పణ బుద్ధితో ఆచరింపవలెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని ప్రథమ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319

కామెంట్‌లు లేవు: