24, సెప్టెంబర్ 2020, గురువారం

రామాయణమ్.94

 

...

భరతుడు తండ్రికి చేయవలసిన పితృకార్యాన్ని పూర్తిచేశాడు.అది పధ్నాల్గవరోజు దశరధుడి చితికి నిప్పంటించి. 

.

రాజ్యాభిషేకమహోత్సవము జరిపించే అధికారముగల మంత్రులంతా భరతుని సందర్శించారు.

.

ఆయన సముఖంలో నిలిచి నీ తండ్రి,మరియు నీ అన్నగారు ఇరువురూ రాజ్యము నీకు ఇచ్చివేశారు ఇక నీవు రాజ్యలక్ష్మిని చేపట్టవలసి ఉన్నది అందుకు ఏ మాత్రము ఆలస్యమైనా రాజ్యములో అరాచకము ప్రబలవచ్చును.ఇప్పటివరకూ ప్రజలు శాంతితో సహజీవనం చేస్తున్నారు.ఎవరూ ఎవరినీ పీడించడంలేదు.ఇప్పటివరకు ఏ ఉపద్రవమూలేదు.

.

నీ పట్టాభిషేకమునకు సర్వము సిద్ధం చేసినాము అని పలికి నిలిచారు వారంతా!

.

భరతుడు సగౌరవముగా వారందరికి నమస్కరించి వారు అప్పటికే తెచ్చి అక్కడ ఉంచిన అభిషేక సామాగ్రికి ప్రదక్షిణనమస్కారములు చేసి అమాత్యలతో ఇలా అన్నాడు.

.

మా వంశములో ఎల్లప్పుడూ పెద్దకుమారుడే రాజు ! అది ఉచితము అదే మా వంశాచారము.మీరీవిధముగా మాట్లాడవద్దు.

.

మా రాముడే రాజు ఆయన బదులుగా పదునాల్గు సంవత్సరాలు నేను అరణ్యవాసం చేస్తాను.

.

చతురంగబలాలు సిద్ధం చేయండి ,మహాసైన్యాన్ని సమకూర్చండి నేను నా జ్యేష్ఠసోదరుడైన రాముని అరణ్యం నుండి తీసుకు వచ్చెదను మనము ఆయననే రాజుగా అభిషేకించవలె!.

.

మనము రామునివద్దకు వెంటనే ప్రయాణము కావలె మార్గములు నిష్కంటకములు గావించండి,చక్కని రహదారులు గంగాతీరము వరకు ఏర్పాటుచేయించండి,దిగుడుబావులు తవ్వించండి .అని ఆజ్ఞాపించాడు భరతుడు.

.

అమాత్యలంతా క్షణంలో ఆ పనులన్నీ పూర్తిచేసి ఆయనకు తెలిపారు.

.

ఆయాప్రాంతములు,ప్రదేశముల స్వరూప,స్వభావములు తెలిసినవారు(topographers),సూత్రములుపట్టికొలతలు వేయువారు (surveyors),

నేలను తవ్వేవారు( earthmovers)

యంత్రాలుపయోగించేవారు,శిల్పులు (Architects)

వడ్రంగులు(Carpenters)

.కూలివారు,చెట్లునరికిమార్గముఏర్పరచేవారు,బాటవేయువారు,వేసినబాటమీద సున్నముపరచి పటిష్ఠము చేయువారు(Road builders) ,,వెదురుపనివారు,సమర్ధులైన పర్యవేక్షకులు (Supervisors) అందరూ ముందుగా బయలు దేరి వెళ్ళారు.

వారితోపాటు అపారజనసమూహము బయలుదేరింది బాటలన్నీ పౌర్ణమినాడు ఉప్పొంగిన సముద్రాలలా ఉన్నాయి.

.

భరతుడి ఉదాత్తమైన ఈ పలుకులకు జనులందరి కనులనుండి ఆనందబాష్పములు జలజలరాలినవి.

.

మనమంతా రాముని వెనక్కి తీసుకునే రావాలి!

 అదే మన ధ్యేయం,అదేమనకర్తవ్యం అన్నట్లుగా అందరూ దీక్షపూని సాగుతున్నారు

.

ఆ రాత్రిగడచి తెల్లవారుతుండగా మంగళవాయిద్యములతో కూడిన స్తోత్రము లతో భరతుని స్తుతించసాగారు వందిమాగధులు,బంగారుదండములతో కొట్టి యామదుందుభి మ్రోగించసాగారు. భరతుడు నిదురలేచి ఆ స్తోత్రపాఠాలు,ఆదుందుభిస్వనాలు ఆయన హృదయంలో తీవ్రమైన వేదనరగిలించగా వెంటనే అందరినీ వాటిని ఆపమన్నాడు ,"నేను రాజును కాను" అని వారికి చెప్పి అన్నింటినీ ఆపివేసినాడు.

.

ప్రక్కనే వున్న శత్రుఘ్ననితో చూడు కైకవలన ఎంత అపకారం జరిగిందో ఆ మహారాజు దుఃఖాలన్నీ నాకు వదిలి వెళ్ళిపోయాడు .

.

మన అందరికీ రక్షకుడైన రాముడిని ధర్మహీనురాలైన నా తల్లి స్వయముగా అడవికి పంపినది.రాజ్యము చుక్కానిలేని నావ అయినది.

.

NB.

ప్రాచీన భారతావనిలో ఎన్ని వృత్తులు పరిఢవిల్లినవో గమనించగలరు .మహర్షి ఎన్ని వృత్తులవారి గురించి చెప్పారో చూడండి.అదీ భారతదేశం అంటే!



రామాయణమ్ 95

..

 తన తదుపరి కర్తవ్యము

 శ్రీ రాముని మరల అయోధ్యకు రప్పించి పట్టాభిషిక్తుడిని చేయటమే ! అని మనసులో దృఢపరచుకొన్న భరతునికి వశిష్ఠుల వారు రాజసభలో ఉన్నారు మిమ్ములను రమ్మనమని అన్నారు అనే కబురు వచ్చింది.

.

రాజసభాప్రాంగణంలో సకలసంభారాలతో సిద్ధంగా ఉన్నారు మహర్షి ! భరతుని చూడగనే "నాయనా ! నీతండ్రీ ,అన్నగారు ఇచ్చిన ఈ రాజ్యాన్ని స్వీకరించి ధర్మబద్ధంగా పరిపాలన సాగించు "అని పలికి భరతుడి ఆమోదం కోసం ఎదురు చూశాడు.

.

కనుల నీరునింపుకొని దోసిలి ఒగ్గి మహాత్మా రాముని రాజ్యమిది ! ఇక్ష్వాకుల లో ధర్మము తప్పి నడిచినవారు ఎవరైనా ఉన్నారా! ధర్మాత్ముడైన దశరధుడికి పుట్టినవాడు చేయవలసిన పనేనా ఇది ! దశరధుడి కొడుకు ఇంకొకరి సొత్తును అపహరిస్తాడా?

.

నేను ,ఈ రాజ్యము రాముడిసొత్తు! 

మా లో పెద్దవాడు ,దిలీప,నహుషులతో సమానుడూ అయిన రామునకే ఈ రాజ్యముపై అధికారము ,.వేరెవ్వరికీలేదు!.

.

నా తల్లి చేసిన పాపకార్యము నేనెన్నటికీ అంగీకరించను.

రాముడి ని అనుసరించటమే నాకు తెలిసినది.

.

ఏ కారణము చేతనైనా అన్నగారిని తీసుకొని రానట్లయితే నేనుకూడా లక్ష్మణునిలా అడవిలో ఉండిపోతాను.

.

మార్గములు ఏర్పరచేవారు,రక్షించేవారు,తదితరులంతా నాచేత ముందుగనే పంపబడినారు.

.

అని పలికి సుమంత్రునివైపు తిరిగి , వెంటనే రామునివద్దకు బయలుదేరడానికి కావలసిన ఏర్పాట్లు చేయమని, సైన్యంతో సహా సిద్ధం కావాలని ఆదేశించాడు.

.

భరతుడి ఆజ్ఞవిని సుమంత్రుడు ఉత్తమాశ్వాలు పూన్చిన రధం సిద్ధం చేసి ఉంచాడు.

.

పిమ్మట ప్రాతఃకాలమునందే లేచి శ్రేష్టమైన రధమెక్కి బయలుదేరాడు భరతుడు.ఆయన వెంట అయోధ్యలోని అధికారగణమంతా బయలుదేరింది.చతురంగబలాలు కదిలాయి. అయోధ్య అంతాకదిలింది.

.

అందరి మనసులో ఒకటే లక్ష్యం రాముడిని త్వరగా చూడాలని.

మనసుతో సమానంగా పరిగెత్తాలని కోరిక!.

.

అలా ప్రయాణం చేస్తూ గంగ ఒడ్డుకు చేరుకున్నారంతా!.

కామెంట్‌లు లేవు: