24, సెప్టెంబర్ 2020, గురువారం

*శ్రీమాత్రేనమః*



*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*678వ నామ మంత్రము*


*ఓం భాషారూపాయై నమః*


సంస్కృత ప్రాకృతాది భాషలు స్వరూపముగా గలదిగాను, భక్తుల మనోభావములనే భాషలకు కూడా తానే స్వరూపిణియై, భాషలచే తానున్నానని నిరూపితమైన సాక్షాత్ వాగ్దేవీ స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *భాషారూపా* అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం భాషారూపాయై నమః* అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకుడు పరిపూర్ణమైన సరస్వతీ కటాక్షము లభించి చతుష్షష్టి విద్యలలో తన వృత్తికిని ప్రవృత్తికిని సంబంధించిన విద్యలో ప్రావీణ్యతనందుకొనును. సుఖసంతోషములతో జీవనమును కొనసాగించుచూ, ఆ పరమేశ్వరీ నామ స్మరణలోకూడా నిమగ్నుడై జన్మ ధన్యతనందును.


శ్రీమాత మువురమ్మల మూలపుటమ్మ. అనగా లక్ష్మీ, వాణీ, పార్వతిల త్రిశక్తి స్వరూపిణి. అందుచే తనలో చదువుల తల్లి అయిన సరస్వతీ రూపము గూడా తనలో గలదు గనుక, సంస్కృత, ప్రాకృతాది భాషల స్వరూపిణిగా, *భాషారూపా* అని స్తుతింపబడుచున్నది.


ఒక తమిళుడు, ఒక ఉత్తర హిందుస్థానము వ్యక్తి, ఆంధ్రుడు కలిసి అమ్మవారి ఆలయానికి వెళ్ళారు. ముగ్గురూ వారి వారి భాషల్లో అమ్మవారికి నమస్కరిస్తారు. కోరికలు కోరుకుంటారు. మూడు భాషలవారినీ అమ్మవారు వారి ప్రార్థనలు స్వీకరించింది. ముగ్గురినీ అనుగ్రహిస్తుంది. ఇంకో మూగవాడు వచ్చి అమ్మవారికి సైగలతోనే ప్రార్థిస్తాడు. అమ్మ వారు ఆసైగలలో భావంకూడా తెలుసుకొని అనుగ్రహిస్తుంది. అంటే అమ్మవారికి ఆ ముగ్గురి భాషలే కాదు,సంస్కృత ప్రాకృతాది భాషలే కాక ఎన్నో భాషలు, తన దర్శనానికి వచ్చి ప్రార్థనచేసి మనసులోనే మౌనంగా వేడుకుంటారు. ఈ మౌనంలోని భావంకూడా గ్రహించి అనుగ్రహిస్తుంది. అలాగే ఏమీ కోరుకొనకపోయినా, తన భక్తులకేమికావాలో అనుగ్రహిస్తుంది. అమ్మకు అన్ని భాషలూ వచ్చు. సైగలు కూడా అర్థం చేసుకుంటుంది గనుక భాషభాషకూ తనస్వరూపాన్ని భక్తుల మనోభావాలలో ప్రకటింపజేస్తుంది. అందుకే జగన్మాత *భాషారూపా* అని స్తుతిస్తున్నాము.


జగదీశ్వరి మాతృకార్ణరూపిణి. అకారాది క్షకారాంత అక్షరములన్నీ పరమేశ్వరి రూపమే. భాషవేరైనా అక్షరాలు ఒకటే. భాషలోని భావంకూడా ఒకటే. అందుచేత జగన్మాతకు భాషల భేదంలేదు. ఆ తల్లి సర్వ *భాషారూప* అటువంటి తల్లికి నమస్కరించునపుడు *ఓం భాషారూపాయై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: