24, సెప్టెంబర్ 2020, గురువారం

*శ్రీమన్నారాయణీయం**

 **దశిక రాము**





1-6-శ్లో.


తత్తే ప్రత్యగ్ర ధారాధర లలితకళాయావలీ కేళికారం

లావణ్యస్యైకసారం సుకృతిజనదృశాం పూర్ణపుణ్యావతారమ్।

లక్ష్మీనిశ్శంకలీలానిలయనమమృతస్యందోహమంతః

సించత్సంచింతకానాం వపురనుకలయే మారుతాగారనాథ||


భావము. గురవాయూరు పురాధీశా! నీలమేఘవర్ణమును పోలిన శరీరచ్ఛాయను కలిగి, నీలికలువ వంటి సుకుమారమయిన దేహకాంతితో, అధికమయిన లావణ్య సౌందర్యముతో ప్రకాశించు నీ రూపము పుణ్యాత్ములయిన వారి కన్నులకు పూర్ణపుణ్యావతారము. లక్ష్మీదేవి నిజరూపమునకు నిలయము. లక్ష్మీదేవి నిశ్శంకగా పూజించుకొను లీలానిలయము. అటువంటి నీరూపమును ఆశ్రయించువారి అంతఃకరణ, పరతత్వము అను అమృతప్రవాహముతో నిండి, ఆర్ధ్రతతో అహ్లాదభరితమగును. అట్టి నీ రూపమును నేను సదా ధ్యానించెదను.


వ్యాఖ్య - భగవద్విభూతులు అవతారాలుగా వచ్చినప్పటికీ కృష్ణావతారం వంటి అవతారం మాత్రం ఇంకొకటి రాలేదు. మిగిలిన అవతారాలు అన్నీ అంశావతారాలు అనీ, కృష్ణుడొక్కడే పూర్ణావతారం అనీ మన పురాణాలు చెబుతున్నాయి. 


శ్రీ మద్భాగవతం ఇలా అంటుంది.

శ్లో || ఏతే చాంశ కలాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం!

ఇంద్రారి వ్యాకులం లోకం మృదయంతి యుగేయుగే!!


ఈ అవతారములన్నీ భగవంతుని యొక్క అంశకళలు మాత్రమే. కానీ శ్రీ కృష్ణుడు సాక్షాత్తూ భగవంతుడే. ధర్మ విరోదులచేత లోకం వ్యాకులం చెందినపుడు రక్షించడానికి వీరు ప్రతి యుగంలోనూ వస్తుంటారు.


శ్రీకృష్ణుడు షోడశ సంస్కార నిరూపణ దురంధరుడు. ఒక మామూలు మానవుని గా జన్మించి పసువులను కాచి ఒక మానవుడు చేయించుకోవలసిన 16 సంస్కారాలు చేయించి ధర్మము నిలబెట్టినవాడు. 


శ్రీక్రృష్ణుడు షోడశ కళా ప్రపూర్ణుడు. ఆ పదహారు కళలు : 1. అమృత 2. మానద 3. పూష 4. తుష్టి 5. సృష్టి 6. రతి 7. ధృతి 8. శశిని 9. చంద్రిక 10. కాంతి 11. జ్యోత్స్న 12. శ్రీ 13. ప్రీతి 14. అంగద 15. పూర్ణ 16. పూర్ణామృత. 


పైన కళలలో కొన్ని అవతారాలలో పదిపాళ్ళు, కొన్నింటిలో పాతిక పాళ్ళు, ఇంకోన్నింటిలో ఏభై పాళ్ళు, ఇలా రకరకాలుగా భగవంతుని శక్తి ఆవిర్భావం జరిగింది. కాని శ్రీ కృష్ణుని అవతారంలో నూటికి నూరు శాతం భగవంతుని శక్తి భూలోకానికి దిగి వచ్చిందని శ్రీమద్భాగవతం అంటుంది. 


ఎందరో యోగులు, మహర్షులు ఎన్నో జన్మల తపః ఫలము వారితో కృష్ణావతారంలో గోపికలతో రాసలీల. రాముని గురించి రామాయణంలో వివరించేటప్పుడు ఆయనను “ పుంసాం మోహనరూపాయ” అని చెప్పారు. ఆయన అడవులలో వనవాసం చేసినప్పుడు ఎందరో మహర్షులు ఆయనను కాంక్షించి ఇటువంటి వానికి సఖిగా పరిచర్యలు చెయ్యాలని కోరుకున్నారు. వారిని ద్వాపరం లో కరుణించాడు పురుషోత్తముడు. 


ఇక ప్రతి లీలలో అంతరార్ధం వున్నది. ఒక కధగా అది జరిగినా వాటినుండి తీసుకోవలసిన మధువు ఎంతో వున్నది.


సహస్రం అంటే అనంతం. అది సంకేతార్ధం. షోడశ సహస్రాలు అన్న మాట ఇక్కడ అదే సంకేతార్ధం. భగవంతునికి వుండే పదహారు కళల సంకేతార్ధం. ఆయనకు జరిపే షోడశోపచారానికి మరొక సంకేతార్ధం. 


దేవుని మీద భక్తి వుండాలి. వుంటే వారిని ఉద్ధరిస్తానని “పత్రం పుష్పం, ఫలం తోయం.. మద్భక్త్యా..” అన్న భగవద్గీత శ్లోకం లో కృష్ణుడు చెప్పి వున్నాడు. అటువంటి భక్తితో షోడశోపచారాలతో షోడశకళానిదికి చేసే ఉపచారమే ఈ 16వేల సఖుల ఉదంతం.


అసలు మహాభారతం లోనే అతి పెద్ద సంకేతార్ధం వుంది. పంచభూతాత్మకమైన శరీరం తో పరమాత్మను చేరే జీవాత్మ ప్రయాణమే భారతం. పంచ పాండవులకు ఒకటే భార్య (ద్రౌపది మరో పేరు కృష్ణ) ద్వారా శ్రీకృష్ణుని సహాయం తో ఆయనను చేరుకోవడమే సంకేతార్ధం.


దేవుడు మానవునిగా దిగివచ్చిన అన్ని అవతారాలలోనూ బాధలు పడ్డాడు. విలపించాడు. మానవునిలాగే ఆవేశ కావేశాలకు లోనైనాడు. శరీరంలో ఉన్నంతవరకూ శరీర తాదాత్మ్యాన్ని అనుభవించాడు. శ్రీరాముడు కూడా " ఆత్మానం మానుషం మన్యే రామం దశరధాత్మజం" అంటూ తాను మానవుణ్ణి, దశరధుని కుమారుణ్ణి అని మాత్రమే తాను తలుస్తున్నట్లుగా అంటాడు. కాని శ్రీ కృష్ణావతారంలో మాత్రం, 


శరీరధర్మానుసారం . ఎన్ని బాధలు పడినప్పటికీ, ఎన్ని యుద్ధాలు చేసినప్పటికీ, ఎంత మంత్రాంగం నడిపినప్పటికీ, తాను భగవంతుణ్ణి అన్న స్పృహ మాత్రం ఆయనను ఎప్పుడూ వీడనట్లు కనిపిస్తుంది. కనుకనే " అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే (నేనే అంతటికీ ప్రభువును అంతా నన్ను అనుసరించే నడుస్తున్నది)" ,"అహమాత్మా గుడాకేశా సర్వభూతాశయ స్తితః , అహమాదిశ్చ మధ్యంచ భూతానాం అంతయేవచ (సర్వభూతములలో ఉన్న ఆత్మను నేనే. సర్వభూతముల ఆది, మధ్య, అంతం అన్నీ నేనే)" అని గీతలో చెప్పగలిగాడు. ఇటువంటి మాటలు గీతలో కోకొల్లలుగా కనిపిస్తాయి. ఇలా చెప్పగలగడం సామాన్య విషయం కాదు.అందుకే ఆయన మాయామానుష విగ్రహుడయ్యాడు. లీలానాటకసూత్రధారి అనిపించుకున్నాడు. ప్రపంచం ఒక లీల అన్న విషయం తెలిసినవాడు గనుక చిరునవ్వుతో అన్నింటినీ చక్కబెట్టాడు. శత్రువులకూ మోక్షాన్నిచ్చాడు.


కృష్ణుడు పిల్లలలో పిల్లవాడు, యువకులలో యువకుడు, జ్ఞానవృద్ధులలో వృద్ధుడు, రాజులకురాజు, వీరులలో వీరుడు, వేదాన్తులలో వేదాంతి, ఆదర్శవంతుడైన కుమారుడు, స్నేహితుడు, సోదరుడు, ప్రేమికుడు, భర్తా, రాజూ, సేవకుడూ, యోగీ, శిష్యుడూ, గురువూ అన్నీ తానే. ఒక్క వ్యక్తిలో

 ఇన్ని పరిపూర్ణతలు ఆవిర్భవించడం పరమాద్భుతం. ఒక్క భగవంతుడు మాత్రమే ఇన్నికోణాలలో పరిపూర్ణతను ప్రకటించగలడు.


కృష్ణునిలోని ఇన్ని కోణాలనూ చక్కగా అర్ధం చేసుకున్నప్పుడే కృష్ణావతారం పరిపూర్ణమైన అవతారం అని భట్టతిరి ఎందుకు అన్నారో మనకు కొద్దిగానైనా అర్ధం అవుతుంది.


 స్వస్తి.

🙏🙏🙏

సేకరణ

*ధర్మము-సంస్కృతి*

🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: