24, సెప్టెంబర్ 2020, గురువారం

రామాయణమ్. 73

 

..

రామా ! ఇంక నీవు ముందుకు వెళ్ళవలదు అన్నట్లుగా 

తమసా నది అడ్డము వచ్చినది .

అప్పటికే లోకములను తమస్సులు(చీకట్లు) కప్పివేసినవి!.

.

అది వనమందు వారికి మొదటిరాత్రి ,ఆ అరణ్యమంతా కూడా నిశ్శబ్దరోదనము చేస్తున్నట్లుగా ఉన్నది.

.

లక్ష్మణా ఇది మనకు వనవాసపు తొలి రాత్రి ! 

నా మనస్సు చాలా ప్రశాంతముగా ఉన్నది. 

సకలసద్గుణ సంపన్నుడైన భరతుడి రక్షణలో మన తల్లితండ్రుల కు ఏవిధమైన కొరతకూడా రాదు.

అతడు వారిని తన అమృతహృదయంతో దుఃఖమునుండి ఓదార్చగలడు.

.

లక్ష్మణా నన్ను అనుసరించి నీవు నాకు ఎంతో సహాయము చేశావు .సీతను రక్షించుకోవాలికదా! (ఇది మొదటిరోజే ఆయన నోట వెలువడిన మాట).

.

లక్ష్మణా నేడు మన దీక్షా ప్రారంభము కావున రాత్రికి నేను మంచినీరు మాత్రమే త్రాగి ఉండగలను .ఈ వనములో ఫలములు సమృద్ధిగానే ఉన్నవి అయినా నాకు ఇట్లా ఉండటమే ఇష్టము.

.

నీవు గుర్రముల సంగతి చూసుకొనుము అని సుమంత్రుని ఆదేశించగా అతడు వాటికి పచ్చగడ్డి వేసి నీరు త్రావించి అవి సుఖముగా విశ్రాంతి తీసుకొనే విధముగా ఏర్పాటు చేశాడు.

.

తదుపరి సుమంత్రుడు సంధ్యోపాసనము పూర్తిచేసి సీతా ,రామ,లక్ష్మణులకు పక్కలు చెట్ల ఆకులతో ఏర్పాటు చేయగా సీతారాములిరువురూ శయనించారు.రాజాంతఃపురము బయట పట్టుపరుపులు లేకుండా నిదురించిన తొలిరాత్రి సీతమ్మకు.

.

లక్ష్మణునకు నిదురపట్టలేదు !తెల్లవార్లూ సుమంత్రుడితో రాముడిగురించే కబుర్లు చెపుతూ కాలక్షేపం చేశాడు.

.

వారి వెంట వచ్చిన పురజనులంతా చెట్టుకొకరు,పుట్టకొకరుగా ఎవరికి అనుకూలంగా ఉండే స్థలంలో వారు నిద్రించారు.

.

అది తెల్లవారుఝాము మూడుగంటల ప్రాంతము , 

రాముడు నిదురలేచి వారందరినీ ప్రేమగా చూసి లక్ష్మణునికి చూపుతూ ,లక్ష్మణా! వీరంతా ప్రాణాలు విడుస్తారు కానీ మనలను విడువరు ,వీరెవరూ లేవక ముందే మనము ఈ ప్రదేశాన్ని విడిచి వెళ్ళటం మంచిది.

.

ఆలోచన వచ్చినదే తడవుగా సుమంత్రుని రధం సిద్దం చేయమని చెప్పి కొంతదూరం అయోధ్య వైపు వెళ్ళినట్లుగా వెళ్ళి మరల ఇంకొక దారిలో పయనించి ఆ చీకట్లలోనే తమసా నదిని దాటి ఆవలవైపుకు చేరి ప్రయాణంచేయసాగారు.

తెల్లవారేసరికి తమదేశపు సరిహద్దులు తాకారు.

.

తెల్లవారగనే జనులంతా మేల్కొని రధము అయోధ్యవైపు వెళ్లినట్లుగా గుర్తులను బట్టితెలుసుకొని వెనుకకు మరలినారు.

అయోధ్య చేరిన తరువాతగానీ వారికి అర్ధం కాలేదు రాముడే ఉద్దేశ్యపూర్వకముగా తమను మరల్చినాడని. రాముని తిరిగి తీసుకురాలేని దద్దమ్మలని ఊరూవాడా వారిని ఆడిపోసుకొంది.

.


జానకిరామారావు వూటుకూరు గారి 

సౌజన్యం తో ....


*ధర్మధ్వజం*

హిందు చైతన్య వేదిక


.

కామెంట్‌లు లేవు: