24, సెప్టెంబర్ 2020, గురువారం

*కొండంత దేవుడు*



మనిషి దృష్టిలో దేవుడు కొండంతటివాడు. అన్నమయ్య ‘కొండంత వరములు గుప్పెటి వాడు’ అని కీర్తించాడు. అయితే, మనిషికి కొండంత వరాలను పొందే అర్హత కూడా ఉండాలి. ఆంజనేయుడిలా సంజీవని పర్వతాన్ని అందరూ మోయలేరు. కొండంత వరాలను అందరూ సద్వినియోగం చేసుకోలేరు.


అమోఘమైన వరాలను పొందిన రాక్షసులందరూ తమ సహజమైన తమో గుణంతో, నష్టమే పొందారు తప్ప- ఎలాంటి లోక కల్యాణాన్ని చెయ్యలేకపోయారు.


జన్మతః ప్రతి మనిషికీ కొన్ని శక్తి సామర్థ్యాలు ఉంటాయి. దానికి లోబడి లోకకార్యాలు చేస్తుంటాడు. జీవితమంటే కష్టసుఖాల కూడలి కనుక రెండూ రుచిచూడాలి. సాధారణ కష్టాలను ఎదుర్కొని మనిషి బయటపడుతుంటాడు. కానీ, శక్తికి మించిన ఆపదలు వచ్చినప్పుడు ఆకాశంవైపు చూసి చేతులు జోడిస్తాడు. ఆపద తొలగేవరకు ఆందోళన చెందుతాడు. సమస్య తొలగిపోతే దేవుడు కరుణించాడని కృతజ్ఞతలు చెప్పుకొంటాడు. లేని పక్షంలో దేవుడి ఉనికినే సందేహిస్తాడు. నిందిస్తాడు కూడా.


శ్రీకృష్ణ తులాభార సన్నివేశంలో భగవంతుడి దివ్యతత్వం గురించి నారదమహర్షి సత్యభామకు వివరిస్తాడు.


రాసులకొద్దీ ధనకనక వస్తువులు ఎన్ని వేసినా, తులాభారం తూగదు. చివరకు రుక్మిణి సమర్పించిన తులసి దళంతో తూగుతుంది.


అప్పుడు నారదుడు భక్తికితప్ప మరిదేనికీ శ్రీహరి వశుడు కాడన్న పరమ రహస్యాన్ని ప్రకటిస్తాడు. ఇది ఆస్తిక ప్రపంచానికి ఒక అద్భుత సందేశం.


లోకాలన్నీ సృష్టించి, పోషిస్తున్న పరమాత్మను ప్రాపంచిక వస్తువులతో ఆకట్టుకోగలమా? ఈ ప్రశ్న ఎవరూ వేసుకోరు. అందువల్లనే కొబ్బరి కాయల కొలమానం మొదలెడతారు. ఎన్ని పూజలు, పునస్కారాలు, రాసులకొద్దీ నివేదనలు సమర్పించినా- భక్తి లేకపోతే, అవి పరమాత్మను మెప్పించలేవు.


పత్రం, పుష్పం, ఫలం, తోయం- ఇవన్నీ చాలా సాధారణ వస్తువులు. సామాన్యులందరికీ అందుబాటులో ఉంటాయి. వీటిని భక్తితో తనకు సమర్పిస్తే, ఇష్టంగా స్వీకరిస్తానంటాడు కృష్ణుడు. అనడమే కాదు- విదురుడు పెట్టిన అరటిపండు తొక్కను ఆప్యాయంగా స్వీకరించి ఆరగించాడు. విదురుడు పరమభక్తుడు. కృష్ణుడు విదురుడి భక్తినే చూశాడు. పారవశ్యంతో అతడిచ్చినది పండు కాదని తెలిసినా, స్వీకరించాడు.


శబరి ఎంగిలి పండును శ్రీరాముడికి సమర్పించిన సన్నివేశం కూడా ఇలాంటిదే. దశరథుడు శ్రీరాముని పుత్రుడిగా పొందడానికి, ‘రారా...కన్నా...’ అంటూ ఆలింగనం చేసుకునేందుకు తపమేమి చేసెనో- అని త్యాగరాజు కీర్తించాడు.


నిజమైన భక్తులు పూజా సమయంలో మాత్రమే భగవంతుని ఆరాధించరు. వారు అనుక్షణం తమలోని అంతర్యామితో అనుబంధం కలిగి ఉంటారు. ఆనందంలో ఓలలాడుతుంటారు. కీర్తనలు పాడతారు. పరవశంతో నాట్యాలు చేస్తారు. చైతన్య మహాప్రభు, శ్రీరామకృష్ణులు ఇలాంటి స్థితిలోనే ఉండేవారు. అంతర్యామి దర్శన భాగ్యం లభించాక పాదాలు నిలవవు. మనసు ఆనందంతో గెంతులేస్తుంది.


‘పిబరే రామరసం’ అంటూ ఆ మాధుర్యాన్ని అనుభవిస్తూ పాడిన పాటను సామాన్య భక్తులు ఎలా ఆలపించగలరు?


ప్రపంచంలో మనకు కొండ గొప్పదిగా కనిపిస్తుంది. అందుకే కొండంత దేవుడు అంటారు. కానీ, ఆయన మేరుపర్వతం కన్నా గొప్పవాడు. అంతటి దేవుడికి కొండంత పత్రిలాగా ఆడంబర నివేదనలు అవసరంలేదు.


భక్తితో చింతాకంత నివేదనకు- ద్రౌపది అక్షయపాత్రలోని అడుగునగల మెతుకు తిని తృప్తి చెందినట్లు ఉంటుంది ఆయన అనుగ్రహం. ఆ అనుగ్రహం పొందగలిగితే జీవితం ధన్యం.

కామెంట్‌లు లేవు: