కురు, పాండవుల జననం
కుంతీ దేవి భర్త పడుతున్న ఆవేదనకు చలించి పోయింది. ఆమెకు చిన్నప్పుడు దుర్వాస మహాముని ఉపదేశించిన మంత్రం గుర్తుకు వచ్చింది. తనకు కర్ణుడు పుట్టడం తప్ప మిగిలిన విషయం అంతా పాండురాజుకు చెప్పింది.
“పాండురాజా, ఆ మంత్రం సహాయంతో మనకు సంతానం కలుగుతుంది. నేను ఏ దేవతను ఆరాధించాలో చెప్పండి?” అని అడిగింది కుంతి.
“కుంతీ, ధర్మ దేవుడి మించిన దేవత లేదు. అతనిని స్మరింపుము” అన్నాడు.
అలా భర్తచేత నియోగింపబడిన కుంతి, శుచి అయి ధర్మదేవుడిని, మనసారా ధ్యానించింది. ధర్ముడు ఆమెకు ప్రత్యక్షం అయ్యాడు. అతని దయవలన కుంతీదేవి గర్భం ధరించింది. ఒక సంవత్సర కాలం పూర్తి కాగానే ఒక కుమారుడు జన్మించాడు. ఆకాశవాణి ఆ బిడ్డకు యుధిష్టిర అని నామకరణం చేసింది. అది చూసి అక్కడున్న మహాఋషులు అతను కురు వంశానికి రాజు అవుతాడని, ధర్మం తప్పకుండా రాజ్యం చేస్తాడని పలికారు.
ఇదిలా ఉండగా, హస్తినా పురంలో ధృతరాష్ట్రుడి వలన గాంధారి గభవతి అయింది. అదీ కూడా కుంతీదేవి కన్నా ముందే గర్భవతి అయింది. కాని ఎంతకు ఆమేకు ప్రసవం కాలేదు. ఇంతలో కుంతీదేవికి యుధిష్టిరుడు పుట్టాడని వార్త తెలిసింది. అది విని భరించలేక, గాంధారి తన కడుపు మీద కొట్టుకుంది. ఆమెకు గర్భస్రావం అయింది.
అది విని కృష్ణద్వైపాయనుడు హస్తినకు వచ్చాడు. వెంటనే ఆ మాంస ఖండాలను, 101 భాగాలుగా విభజించి, వాటిని నేతి కుండలలో పెట్టి కాపాడమని, ఆమెకు 100 మంది ప్పుత్రులు, ఒక పుత్రిక కలుగుతారని చెప్పాడు. గంధారి కృష్ణద్వైపాయనుడు చెప్పినట్టు చేసింది.
అక్కడ శతశృంగ పర్వతము మీద ఉన్న పాండురాజు మరొక కొడుకు కావాలనిపించి “కుంతీ, ఈ సారి నువ్వు వాయుదేవుడిని స్మరించి, అంతటి బలసంపన్నుడైన కొడుకును పొందుము” అని చెప్పాడు.
ఇక్కడ భీముడు పుట్టిన రోజే, హస్తినా పురంలో, కలి అంశతో దుర్యోధనుడు జన్మించాడు. తరువాత రోజుకు ఒక్కరు చొప్పున, నూర్గురు కుమారులు జన్మించారు.
తరువాత 101వ పిండము పగలగా, అందులో నుడి దుస్సల అనే కూతురు పుట్టింది. ధృతరాష్ట్రుడికి వైశ్య కులమునకు చెందిన మరొక భార్య వలన యుయుత్సుడు అనే కొడుకు పుట్టాడు.
దుర్యోధనుడు పుట్టీపుడు అనేక దుశ్శకునాలు గోచరించాయి. ఆ దుశ్శకునాలను చూసి భీష్మాదులు కలత చెందారు. భీష్ముడు, విదురుడు, బ్రాహ్మణులు ఇలా అన్నారు.
“ధృటరాష్ట్ర మహారాజా, దుర్యోధనుడు పుట్టినపుడు అనేక దుశ్శకునాలు గోచరించాయి. కులక్షయకారకుడైన దుర్యోధనుని వదిలివేసి, కులమును రక్షించరాదా. నీకు వందమంది పిల్లలు ఉన్నారు కదా” అని పలికారు. కాని పుత్రుడి మీద మమకారంతో, ధృతరాష్ట్రుడు వాళ్ల మాటలు వినలేదు.
శతశృంగ పర్వతము మీద ఒకరోజు కుంతీదేవి, వాయుదేవుని అంశతో పుట్టిన భీముని ఎత్తుకుని దేవాలయానికి వెళుతూ ఉంది. ఇంతలో ఒక పులి కుంతీదేవి మీదికి దుమికింది. పాండురాజు తన బాణములతో పులిని చంపాడు. కాని, పెద్ద పులి భయంతో కుంతీదేవి వణికిపోయింది. ఆమె చేతిలో ఉన్న భీముడు కింద పడ్డాడు. కేవలం పది రోజుల వయసు ఉన్న ఆ బాలుని శరీరం పడ్డ చోట రాళ్లు పొడి పొడి అయ్యాయి. ఇది చూసి పాండురాజు ఆశ్చర్యపోయాడు.
ఇంతలో గాంధారికి నూరు మంది కొడుకులు కలిగారని వార్త తెలిసింది. తనకూ ఇనకా కొడుకులు కావాలని కోరుకున్నాడు. పాండురాజు దేవేంద్రుని గూర్చి తపస్సు చేసాడు. దేవేంద్రుడు ప్రత్యక్షం అయి, “పాండురాజా, నీకు ముల్లోకాలను జయించే కొడుకు పుడతాడు” అని వరమిచ్చాడు.
కుంతీదేవికి ఇంద్రుని అంశతో పౌరుష వంతుడు, తెజోవంతుడు అయిన కుమారుడు ఉత్తర ఫల్గునీ నక్షత్రములో జన్మించాడు. అప్పుడు ఆకాశవాణి “ఇతను కార్త వీర్యార్జుని కన్నా వీరుడు అవడం వలన, అర్జునుడు అనే పేర్తో పిలువబడతాడు” అని పలికింది. పాండురాజు, కుంతీదేవి త్రిమూర్తులతో సమానమైన ముగ్గురు కొడుకులతో ఆనందంగా కాలం గడుపుతున్నారు.
అక్కడ గాంధారికి 101 మంది సంతానం కలిగారు. ఇక్కడ కుంతీదేవికి ముగ్గురు సంతానం కలిగారు కాని పాండురాజు రెండవ భార్య అయిన మాద్రికి సంతానం లేరు. దానికి ప్రతిరోజూ చింతిస్తూ ఉంది. ఒకరోజు తనకు కూడా సంతానం కావాలని భర్తను అడిగింది. పాండురాజు కుంతీదేవిని పిలిచి, మాద్రికి కూడా సంతానాన్ని కలుగచెయ్యమని అర్థించాడు.
కుంతీదేవి భర్త మాట ప్ర్కారం, సకలలోక కళ్యాణ కారకులైన అశ్వినీ దేవతలను ప్రార్థించింది. వారి వల్ల మాద్రికి ఇరువురు పుత్రులు జన్మించారు. వారికి ఆకాశవణి నకులుడు, సహదేవుడు అని నామకరణం చేసింది.
కుంతీదేవికి సంతానం కలిగార్న్న విసహ్యం కుంతీదేవి అన్నయ్య వసుదేవుడికి తెలిసింది. ఆయన తన చెల్లెలి పిల్లలకు ఎన్నో కానుకలను తన పురోహితుడైన కశ్యపునిచేత పంపించాడు.
ఇంతలో వసంత కాలం వచ్చింది. ఒకరోజు పాండురాజు, తన రెండవ భార్య మాద్రి మనోహర రూపం చూసాడు. తన్మయుడై, ముని శాపాన్ని మరిచాడు. బలవంతంగా ఆమెతో సంభోగ సుఖాన్ని అనుభవించాడు. ప్రాణాలు కోల్పోయాడు.
ఇందంతా చూసి మాద్రి భయంతో వణికిపోయింది. భర్త శవాన్ని చూసి పెద్దగా ఏడవసాగింది. కుంతీదేవి అక్కడికి వచ్చి భర్త శవాన్ని చూసింది, జరిగింది అర్థమైంది. వెంటనే సహగమనానికి సిధ్ధపడింది. కాని మాద్రి అందుకు ఒప్పుకోలేదు.
“అక్కా, నా వలననే మన భర్త మరణించాడు. ముని శాపం తెలిసికూడా అజాగ్రత్తగా ప్రవర్తించాను. ఇంత జాగ్రత్త లేని దాన్ని నేను మన కొడుకులను కాపాడలేను. నువ్వే వీరిని కాపాడాలి. అందువల్ల నేనే సహగమనం చేస్తాను” అని చెప్పింది. వెంటనే పాడురాజు చితి మీదికి ఎక్కి సహగమనం చేసింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి