15-03,04-గీతా మకరందము
పురుషోత్తమప్రాప్తియోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అవతారిక - అట్టి సంసారవృక్షమును అసంగమను శస్త్రముచే ఛేదించివైచి పరమాత్మ పదము నన్వేషింపవలయునని బోధించుచున్నారు-
న రూపమస్యేహ తథోపలభ్యతే
నాన్తో న చాదిర్న చ సమ్ప్రతిష్ఠా |
అశ్వత్థమేనం సువిరూఢమూలం
అసఙ్గశస్త్రేణ దృఢేన ఛిత్వా ||
తతః పదం తత్పరిమార్గితవ్యం
యస్మిన్ గతా న నివర్తన్తి భూయః |
తమేవ చాద్యం పురుషం ప్రపద్యే
యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ ||
తాత్పర్యము:- ఆ సంసారవృక్షముయొక్క స్వరూపము ఆలాగున (ఇపుడు వర్ణింపబడినరీతిగా) ఈ ప్రపంచమున (సంసారాసక్తిగలవారిచేత) తెలియబడకున్నది. దాని ఆదిగాని అంతముగాని, మధ్యము (స్థితి) గాని కనబడకున్నది. గట్టిగ వేళ్ళునాటుకొనిన ఈ సంసారమను అశ్వత్థవృక్షమును అసంగమను బలమైన ఆయుధముచే నఱికివైచి ఆ పిమ్మట ఏ స్థానమందు ప్రవేశించినవారు మఱలవెనుకకు (సంసారమునకు) రారో, ఎవరినుండి అనాదియైన ఈ సంసారవృక్షముయొక్క ప్రవృత్తివ్యాపించెనో, (అట్టి) ఆది పురుషుడగు పరమాత్మనే శరణుబొందుచున్నాను - అనునిట్టి (భక్తి) భావముతో ఆ పరమాత్మపదమును వెదకవలయును.
వ్యాఖ్య:- క్రిందటి శ్లోకములందు వర్ణింపబడినలాగున (ఊర్ధ్వమూలముగ, అథఃశాఖగ. - ఇత్యాదిరూపముగ) ఈ సంసారవృక్ష మేల కనుపించుటలేదు? సంసారాసక్తిగల అజ్ఞానుల కట్టిరూపము తెలియబడదు. దాని ఆద్యంతమధ్యములుకూడ తెలియబడవు. ఏలయనగా వారు దానిలో మునిగియుండి సత్యమును తెలిసికొనజాలకున్నారు (చీకటిలోనున్నవారికి వస్తువులు గోచరింపనట్లు). ప్రకాశమునందు వస్తువులు తెలియునట్లు, వైరాగ్యము, ముముక్షుత్వము, ఆత్మజ్ఞానము కలవారికి దానిస్వరూపము గోచరించగలదు.
ఈసంసారవృక్షము అనాదికాలమునుండి వర్తించుచు అతివిశాలముగ, శాఖోపశాఖలుగ వ్యాపించి, బాగుగ వేళ్ళుతన్నుకొని యున్నది. కనుకనే దానివేళ్ళను గూర్చి వర్ణించునపుడు భగవానుడు "రూఢమూలమ్” అనిగాని, "విరూఢమూలమ్” అనిగాని చెప్పక "సువిరూఢమూలమ్” అని చెప్పుటకు కారణము. దానివేళ్ళు చాలగట్టిగ పాతుకొనిపోయినవని భావము. అయితే అంతమాత్రముచేత దిగులునొందవలసిన పనిలేదు. చెట్టు ఎంతగొప్పదైనను బలమైన ఆయుధముచే నేలమట్టము కాగలదు. అట్లే ఈ సంసారవృక్షమును ఛేదించుటకు భగవానుడు చక్కని ఆయుధమును సూచించిరి. అదియే అసంగము. ప్రాపంచిక పదార్థములందు అభిమానము, ఆసక్తి గలిగియుండుటయే సంగము, అది లేకుండుటయే అసంగము. వైరాగ్యమని భావము. అయితే మందమంద వైరాగ్యభావములచేత ఈ గొప్పసంసారవృక్షచ్ఛేదనము సాధ్యపడదు. తీవ్రతర విరక్తి, పరిపూర్ణ అసంగము ఆవశ్యకమైయున్నది. కనుకనే "ధృడేన” అను పదమును భగవానుడు ప్రయోగించిరి. ఒక పెద్ద "ఫ్యాక్టరీ” లో మూలచక్రమునకుగల "బెల్టు” తెగినచో అన్నియంత్రములున్ను ఎట్లాగిపోవునో, అట్లే ఈసంసారరూప బృహద్యంత్రాంగమంతయు సంగరాహిత్యము (అసంగము)చే స్తబ్ధమైపోవును. మహనీయు లీప్రపంచమున నున్నప్పటికిని ఇట్టి అసంగభావమే గలిగియుండి సంసారబాధలెవ్వియు లేకయుందురు. అయితే ఈ అసంగము బాహ్యముననేగాక, అభ్యంతర సంకల్పములందును గలిగియుండవలెను. అపుడే ఆ అసంగము పరిపూర్ణము కాగలదు.
ఇంతటితో పని పూర్తి అయినదా? కాదు. సంసారవృక్షచ్ఛేదనము అయిన పిదప అనగా దృశ్యత్యాగము అయినపిదప దృక్ - స్వరూపమును ఆశ్రయించుట అను ముఖ్యమైనపని మఱియొకటి కలదు. అప్పు తొలగవలెను, సొంతముగ కొంత ద్రవ్యమును గలిగియుండవలెను. అపుడే మనుజుడు సుఖముగ నుండగలడు. దృశ్యభావత్యాగము అప్పుతొలగుటవంటిది. అది చాలదు. ఏలయనిన అప్పు తొలగినను, తన పోషణనిమిత్తము కొంత ద్రవ్యము లేనిచో మనుజునకు తృప్తియుండదు. అట్లే దృశ్యవిరక్తి, ఆత్మపదప్రాప్తి రెండును యున్నచో జీవునకు పరిపూర్ణసుఖమేర్పడగలదు. కనుకనే భగవానుడు సంసారవృక్షచ్ఛేదనమును గూర్చి తెలిపి, “తతః” - అటు పిమ్మట 'పరిమార్గితవ్యమ్’- "పరమాత్మపదాన్వేషణము గావింపవలెను" అని బోధించుటకు కారణమైనది.
ప్రపంచములో అనేక పదవులున్నప్పటికిని అన్నిటికంటె గొప్పది పరమాత్మ పదవియే కావున దానినే అనుసరించవలెనని, అన్వేషింపవలెనని ఇచట బోధింపబడినది. ఏలయనిన ఆ మహోన్నతపదమును బొందినవాడిక మరల ఈ దుఃఖభూయిష్ఠమగు సంసారస్థితికి దిగిరాడు. (యస్మిన్ గతా న నివర్తని భూయః). బ్రహ్మాండమునం దేలోకమునకు పోయినను తిరిగిరావలసినదే, మఱల పుట్టవలసినదే - కాని భగవంతుని పొందినవారు, ఆత్మపదవి నధిష్ఠించినవారు మఱల జన్మింపరు. అది శాశ్వతపదము. పూర్ణదుఃఖరాహిత్యము దానివలననే కలుగును. కనుకనే అన్ని పదవులలోను అది సర్వోత్కృష్టమైనది. కాబట్టి విజ్ఞలెల్లరును దానినే అనుసరించి తరించుదురుగాక!
అయితే "ఆ పరమపురుషునే శరణు బొందుచున్నాను” (తమేవ పురుషం ప్రపద్యే) అను భక్తిభావముతో, నిరహంభావనతో ఆ యాత్మపదమును అన్వేషింపవలసియున్నది. నిర్మలభక్తిగలవానికి ఆత్మజ్ఞానము త్వరలో లభించగలదు.
ప్రశ్న:- సంసారవృక్షము ఏ ప్రకారముగనున్నది?
ఉత్తరము:- బాగుగ వేళ్ళుతన్నుకొనియున్నది.'
ప్రశ్న:- దానిని ఛేదించుటెట్లు?
ఉత్తరము:- “అసంగము" (ప్రాపంచిక పదార్థములందు ఆసక్తి, అభిమానములేకుండుట) అను బలమైన ఖడ్గముచే అది ఛేదించివేయబడగలదు.
ప్రశ్న:- అట్లు సంసారవృక్షమును ఛేదించినపిదప యేమి చేయవలెను?
ఉత్తరము:- పరమాత్మపదమును అన్వేషింపవలెను.
ప్రశ్న:- ఆ పరమాత్మ యెట్టివాడు?
ఉత్తరము:- (1) ఆతనిని పొందినవారు మఱల వెనకకురారు (తిరిగి ఈ సంసారమున జన్మింపరు) (2) ఆతనినుండియే ఈ జగత్తంతయు ఆవిర్భవించినది. (3) ఆతడు ఆదిపురుషుడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి