**దశిక రాము**
**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి భాష్యం**
ఇప్పుడు అనంగుడు (శరీరం లేనివాడు)గా పిలవబడుతున్న ఈ మన్మథునికి ఒకప్పుడు అతిలోక మనోహరమైన శరీరం ఉండేది. అందుకే ఇప్పటి అందగాళ్ళను నవమన్మథులంటాం. తన అందం చూసి అతడు అహంకరించాడు. ఆ రోజుల్లో సూరపద్ముడనే రాక్షసుని బారిన పడిన దేవతలు పడరాని కష్టం పడుతున్నారు. అతడిని ఈశ్వరునికి జనించిన పుత్రుడే చంపగలడట. మరి స్వామి అప్పుడు దక్షిణామూర్తి రూపంలో ధ్యానమగ్నుడై ఉన్నాడు. అప్పుడు అంబిక పర్వతరాజ పుత్రికగా వచ్చింది. వీరిరువురినీ సంధానం చేయడానికి దేవతలు ఈ మన్మథుణ్ణి పంపారు. ఈశ్వరుడు పూలబాణంచే కొట్టబడి కనులు తెరచి మన్మథుణ్ణి దగ్ధం చేశాడు. తరువాత మనస్సు మార్చుకొన్న పరమేశ్వరుదు పార్వతిని వివాహమాడాడనుకోండి. ఈ శ్లోకంలో అంబిక అనేక నామాలలో “హిమగిరి సుత” అన్న నామాన్ని ప్రస్తావించడంలో ప్రత్యేకమైన ఉద్దేశ్యముంది.
ఆరంభంలో పార్వతిపై స్వామి ప్రేమ భావనలను ఉత్తేజపరచడానికి దేవతలు మన్మథుని పంపారు. అప్పుడు మన్మథుడహంకరించాడు. పరమేశ్వరుని మనస్సు మథించి పెద్ద విజయాన్ని సాధిచగలననుకున్నాడు. మథనమంటే చిలకడం కదా. మనస్సును మథించేవాడు మన్మథుడు. మహా నిర్లిప్తుడైన పరమేశ్వరుని హృదయం చిలకడం సాధ్యమా ? మన్మథుడు గుర్తుబట్టడానికి సైతం వీలులేకుండా బూడిద చేయబడ్డాడు. అప్పుడు అంబిక అతనికి క్రొత్త జీవితాన్ని ప్రసాదించింది కానీ శరీరం లేదు. తనంతటతానేదైనా చేయగలనని గొప్పలు చెప్పుకోవడం ఇక కుదరదు తరవాత అతడు పరమేశ్వరునిపై విజయం సాధించాడు. ఈ విషయం మన్మథ పురాణంలో కాదు, కామాక్షి పురాణంలో ఉన్నది. ఆ పురాణం మన్మథుడు ఎంతో వినయంతో అంబిక అనుగ్రహం శివుని హృదయం కరిగిస్తుందనే భావంతో శివుని చేరాడని చెబుతుంది. శివుని చేత అతని శరీరమేకాక గర్వం కూడా హరించబడింది. ఆ గర్వం తిరిగి తలెత్త కూడదనే అంబిక అతన్ని అనంగునిగానే ఉంచింది.
తమిళంలో “వల్లవునకు పుల్లాయుధం” అన్న సామెత ఉన్నది. మహాయోధకు గడ్డిపోచే ఆయుధం అని దీనర్థం. కాకాసురుణ్ణి సంహరించడానికి రామచంద్రుడు ధర్బను అభిమంత్రించి వేశాడు. అంబిక కడగంటి చూపులచేత దయాప్రసాదం చేయబడిన మన్మథునకు పూలే ఆయుధాలు.
బూడిదగామారిన మన్మథుడు అంబిక కడగంటి చూపుల నుండి జాలువారిన దయామృతం చేత పునరుజ్జీవితుడైనాడు. ఆమె పతి మన్మథుణ్ణి కంటి మంటచే తగలబెట్టగా, అంబిక ఆ బూడిదపోగుపై తన అమృత వీక్షణం ప్రసారింపచేయగా, తక్షణమే మనమథుడు పునతుజ్జీవితుడైనాడు. కామాక్షి అంటే “కాముని తన కడగంటి చూపుచే సృష్టించినది” అని అర్థం. ప్రపంచాన్నంతటినీ జయించాడని చెప్పబడిన మన్మథుడు శివునిపై సాధించిన విజయం గురించి ఈ శ్లోకంలో ప్రస్తావించనేలేదు. శివుని జయించడమనేది కామేశ్వరి లీలలో ప్రధానమైనది. ఈ విషయం “హిమగిరి సుతే” అన్నపదం కొంత సూచితమైనప్పటికీ ప్రధానంగా చెప్పబడలేదు. తరువాత కాలంలో శివుడు పార్వతి యెడ మోహితుడైనప్పటికీ అది మన్మథుని కార్యం కాదు. అంబిక తన పరమ ప్రేమ చేత, ఆశ్చర్యకరమైన తపస్సు చేత దక్షిణామూర్తిని కదిలించివేసి కల్యాణ సుందరుని చేసింది. స్కాంద పురాణంలో ఈ విషయం చెప్పబడింది. దానినే కాళిదాసు కుమారు సంభవంగా వ్రాశారు.
క్రిందటి (5వ) శ్లోకంలో మహావిష్ణువు మోహినిగా శివుని మోహింపచేసిన విషయం ప్రస్తావించబడినా, కామారిపై కాముని విజయం స్పృశించబడలేదు. మహావిష్ణువు మన్మథుని తండ్రి, కృష్ణావతారంలో ఈ మన్మథుడు ప్రద్యుమ్నుడిగా పుట్టాదు. విష్ణువు మనస్సు నుండి ఉద్భవించిన మన్మథునకు “మనసిజు”డన్న పేరున్నది. తండ్రి యోగీశ్వరేశ్వరుడైన, మునులందరినీ మించిన దక్షిణామూర్తి ఆయిన స్వామిని మోహింపజేస్తే మిగతా మునుల సంగతి మన్మథుడు చూసుకొన్నట్లు వ్రాయబడింది.
సౌందర్యలహరి తరువాత భాగంలో మన్మథుడు స్వామిని జయించినట్లు చెప్పబడింది. అంబిక రెండు తాటంకములు (చెవి దిద్దులు) రెండు చక్రాలుగా, అద్దం వంటి ముఖం రథంగా అంబిక ప్రేమ పూరితములైన దృక్కులు బాణాలుగా మన్మథుడు స్వామిని జయించాడట. ఇంకో రెండు శ్లోకాలలో కూడా ఈ విషయం వివరించబడింది. మరొక్క శ్లోకం రథంపై నుండి శివునిపై బాణాలు వేస్తూ విజయోత్సాహంతో మన్మథుడు వేసే కేరింతలు వివరించబడ్డాయి. మొదటి భాగంలో ఈ విషయాలు లేవు. కవితా సౌందర్యానికి ఆలవాలమయిన రెండవ భాగంలో చెప్పబడ్డాయి.
ఆచార్యులవారు ఈ శ్లోకం వరకూ కూడా తాను స్తోత్రం చేసే మూర్తి ఎవరో పూర్తిగా చెప్పలేదు. తరువాతి శ్లోకంలో కామేశ్వరిని పూర్తిగా అభివర్ణించబడింది.
(సశేషం)
కృతజ్ఞతలతో🙏🙏🙏
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
#ParamacharyaSoundaryaLahariBhashyam
🙏🙏🙏
సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి