సామాజిక సూత్రం
లోకంలో మనుషుల నడవడి విచిత్రంగా ఉంటుంది. తనదైతే ఒకలా, ఇతరుల విషయంలో మరోలా ప్రవర్తిస్తుంటారు. మనిషి ఎప్పుడు ఎలా నడుచుకోవాలో మహాభారతం చెప్పినట్టు మరే గ్రంథం చెప్పలేదేమో! భారతం ధర్మజ్యోతి.
భీష్ముడు అంపశయ్య మీద ఉన్నాడు. కురుక్షేత్ర సంగ్రామంలోని మరణాల వల్ల ధర్మరాజు ఎంతో మనస్తాపం చెందాడు. అతడి మనసులోని కలతను తీర్చడానికి ఎందరో హితవచనాలు పలికినా శాంతి చేకూరలేదు. వాసుదేవుడు అతణ్ని భీష్ముడి దగ్గరకు తీసుకువెళ్లాడు. ధర్మరాజుకు ధర్మోపదేశం చేయమని కోరాడు. భీష్ముడు మహాజ్ఞాని. రాజనీతికి సంబంధించిన సమస్త విషయాలూ బోధించాడు. ధర్మం చాలా సూక్ష్మమైందని అది పలురీతుల్లో గోచరిస్తుందని చెబుతూ భీష్ముడు పరమ ధర్మమేమిటో వివరించాడు.
మహాభారతం శాంతిపర్వంలోని ‘ఒరులేమేమి యొనర్చిన నరవరయప్రియంబు తన మనంబున కగు...’అనే పద్యం ప్రపంచ వాంగ్మయంలోనే గొప్ప సూక్తి. కందుకూరి వీరేశలింగం ‘వివేకవర్ధిని’ పత్రికలో ఈ పద్యాన్ని ముఖతిలకంగా తీర్చిదిద్దారు. అనంతర కాలంలో కాశీనాథుని నాగేశ్వరరావు కూడా ‘ఆంధ్రపత్రిక’లో తమ ఆదర్శవాక్యంగా దీన్ని ప్రచురించేవారు. నాటికీ నేటికీ ఉత్తమ వ్యక్తిత్వానికి మార్గదర్శకమైన ప్రబోధం ఇందులో ఉంది.
ఇతరులు ఏది చేస్తే తన మనసుకు అప్రియం అవుతుందో తాను దాన్ని ఇతరులకు చేయకుండా ఉండటం సకల ధర్మాలకూ కుదురులాంటిది. ధర్మం రెండు విధాలుగా ఉంటుంది. అవి విధి నిషేధాలు- చేయవలసినవి, చేయకూడనివి. జన సామాన్యం కోసం ప్రతిపాదించిన ధర్మం- నిషేధాత్మకమైంది. అంటే- ఏం చేయకూడదో తెలియజేస్తుంది. తననెవరైనా కొట్టినా, గాయపరచినా దేహానికి నొప్పి కలుగుతుంది. అది మనసుకూ బాధ కలిగిస్తుంది. కొన్ని శారీరకమైనవి కావు... మానసికంగా బాధిస్తాయి. నింద, హేళన, చులకన చేసే మాటలు- ఇవన్నీ మనసును గాయపరుస్తాయి. కొన్ని మనసులో నాటుకుపోయి బతికినంతకాలం పీడిస్తూనే ఉంటాయి. అటువంటి పనులు తాను ఇతరులకు చేయ రాదని భారతం హెచ్చరిస్తుంది. అందరిపట్లా సమబుద్ధి కలిగిఉండాలి. లౌకికంగా ఇది చాలా ప్రయోజ నకరం. ఇతరులపై పగ ఉంటే ఎవరూ ప్రశాంతంగా నిద్రపోలేరు. మనసులో పగ ఉంటే పామున్న ఇంట్లో నివసిస్తున్నట్టే అని భారతం చెబుతోంది. ఇతరుల విషయంలో మనం ఏం మాట్లాడాలన్నా, ఏం చేయాలన్నా ఒక్క క్షణం వివేకంతో ఆలోచిస్తే మనం మంచి నిర్ణయం తీసుకోగలుగుతాం. ఎవరినీ బాధపెట్టం. తరవాత మనమూ బాధపడం.
దీన్ని మరోవిధంగానూ అన్వయించుకోవచ్చు. ఇతరులు తనపట్ల చేసిన ఏ పనులు తనకు ఆహ్లాదం కలిగించాయో అటువంటి పనులు తాను ఇతరులకు చేస్తూ ఉండటమే గొప్ప ధర్మం.
భారతంలోనే ఒక కథ ఉంది. సరమ దేవతల శునకం. సారమేయుడు దాని కొడుకు. జనమేజయుడు యజ్ఞం చేస్తుంటే ఆ పరిసరాలకు సారమేయుడు వచ్చి తిరుగాడుతున్నాడు. రాజుగారి తమ్ముళ్లు దాన్ని కొట్టి తరిమేశారు. అది ఏడుస్తూ తల్లితో మొరపెట్టుకుంది. సరమ ముందుగా తన కొడుకును అక్కడేమైనా పాడుపని చేశావా అని అడిగింది. ఏ తప్పూ చేయలేదని నిర్ధారించుకున్నాక రాజు దగ్గరకు వెళ్లింది. పసివాడు ఏ అపవిత్ర కార్యమూ చేయకుండా సంతోషంగా ఆడుకుంటూ తిరుగుతుంటే అతడి తమ్ముళ్లు అకారణంగా కొట్టి బాధించారని- ఇది చేయవచ్చు, ఇది చేయరాదని కొంచెమైనా ఆలోచించక సాధుజీవుల్ని హింసించే దుర్మార్గులకు ఆపదలు ముంచుకొస్తాయని నిందించి వెళ్లిపోయింది. నిష్కారణంగా, అనాలోచితంగా ఎవరికీ హాని కలిగించకూడదని ఇందులోని అంతరార్థం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి