7, అక్టోబర్ 2020, బుధవారం

*శ్రీ విఘ్నేశ్వర విశిష్టత* (8వ భాగం)

 **దశిక రాము*

పార్వతికి తన సౌందర్యం పట్ల నమ్మకం పోయింది. శరీరలావణ్యం మీద మమకారం పోయింది. శివుణ్ణి రంజింపచేయలేని తన తనువు నిరర్థకంగా తలచి శివరంజనిగా తపస్సు చేయడానికి పూనుకున్నది. కేవలం కొద్ది ఆకులనుమాత్రమే తింటూ శరీరాన్ని కృశింప జేసుకొని తపస్సు మొదలుపెట్టింది.


జయ, విజయ అనే ఇద్దరు చెలికత్తెలు ఆమెకు తోడుగా ఉంటూ ఆమె యోగక్షేమాల్ని మేనకా, హిమవంతులకు తెలియజేస్తూ వస్తున్నారు. కొన్నాళ్ళ తర్వాత పార్వతి పర్ణాలను కూడా తినడం మానివేసి నిరాహారంగా తపస్సు చేస్తూ, అపర్ణ అని పేరు పొందింది. శివుడు మన్మథుణ్ణి భస్మం చేశాడే గాని, మన్మథుడి బాణ ప్రభావం ఊరికే పోలేదు.


పార్వతి తపస్సు కూడా ఫలితం సాధించింది. శివుడు మారువేషంతో పార్వతి దగ్గరకు వెళ్ళి, పార్వతి మనస్సును పరీక్షంచాడు.

 పార్వతిని మనసారా మెచ్చుకొని పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. సప్త ఋషులను హిమవంతుడి దగ్గరకు పెళ్ళిపెద్దలుగా పంపించాడు. శివుడంతటివాడికి కన్యాదాత కాబోతున్నందుకు ఉన్నతోన్నతంగా శిఖరాలు పెంచుకున్నాడు హిమవంతుడు.


ప్రమథగణాలు ముందు నడవగా శివుడు పెళ్ళికుమారుడై హిమవంతుడింటికి తరలి వెళ్ళాడు. హిమాలయశిఖరాలు పెళ్ళి పందిరికి రాటలైనాయి. విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలుగాగల దేవతలు, సప్తర్షుల వెంట వేలాది మహర్షులు, నారదాది మునిపుంగవులు అక్కడకు చేరుకున్నారు. పెద్ద ముత్తయిదువు అరుంధతి శివుడి ఫాలనేత్రం రెప్ప మీదుగా కళ్యాణ తిలకం నిలువుగా దిద్దింది. పెళ్ళి అలంకరణతో శివుడు చాలా సుందరంగా తయారయ్యాడు. అప్పుడు అందరూ శివుణ్ణి-- సుందరేశ్వరుడు అని అన్నారు.


సర్వాలంకార శోభితమై విద్యుల్లతలాగా మెరిసిపోతూన్న పార్వతిని పెళ్ళికూతురుగా తీసుకొచ్చి విష్ణువు శివుడితో, ‘‘నీవు సుందరే శ్వరుడివి అయితే, నా చెల్లెలు పార్వతి మీనాక్షీదేవి!'' అని అంటూ పార్వతి కుడి చేతిని శివుడి కుడిచేతిలో పెట్టి ఇద్దర్నీ పెళ్ళిపీటల మీద కూర్చోబెట్టాడు. శివపార్వతుల వివాహం ఎంత వైభవంగా జరగాలో అంత వైభవంగా జరిగింది. హిమాలయల లోయలో శివుడు, పార్వతి తపస్సులు చేసిన చోటనే దేవశిల్పి విశ్వకర్మ కొత్త దంపతులైన పార్వతీపరమేశ్వరుల కోసం ప్రత్యేకంగా దివ్యమైన అంతఃపుర మందిరాన్ని నిర్మించాడు.

🙏🙏🙏

సేకరణ

*ధర్మము-సంస్కృతి*



**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: