అర్జునుడు ద్వారక నుంచి వచ్చి శ్రీకృష్ణ అవతార సమాప్తి గురించి ధర్మరాజుకు చెప్పలేక చెబుతూ,కృష్ణుడు తమకు చేసిన మేలు గురించి ఎన్నో విధాలుగా గుర్తు చేసుకుంటున్నాడు.....
**
గురుభీష్మాదులు గూడి పన్నిన కురుక్షోణీశచక్రంబులో,
గురుశక్తిన్ రథయంత యై, నొగలపైఁ గూర్చుండి, యా మేటి నా
శరముల్ వాఱక మున్న, వారల బలోత్సాహాయు రుద్యోగ త
త్పరతల్ చూడ్కుల సంహరించె, నమితోత్సాహంబు నా కిచ్చుచున్.
**
భీష్మ ద్రోణాది మహాయోధులతో కూడిన కురుక్షేత్ర మహాసంగ్రామంలో నాకు సారథ్యం చేస్తూ, రథం నొగలపై కూర్చుండి నేను బాణ పరంపరలను వర్షింపక ముందే, తన చూపులతో శత్రువుల శక్తినీ, ఉత్సాహాన్నీ, ఆయుర్దాయాన్నీ, తదేకదీక్షనూ అపహరించి, నాకు అమితానందాన్ని అందించిన విజయ సారథి ఆయనే కదా!
**
అసురేంద్రుం డొనరించు కృత్యములు ప్రహ్లాదుం బ్రవేశించి గె
ల్వ సమర్థంబులు గాని కైవడిఁl గృపాశ్వత్థామ, గాంగేయ, సూ
ర్యసుత, ద్రోణ ధనుర్విముక్త బహుదివ్యాస్త్రప్రపంచంబు నా
దెసకున్ రాక తొలంగె మాధవు దయాదృష్టిన్ నరేంద్రోత్తమా!
**
మహారాజా!
పూర్వం హిరణ్యకశిపుని క్రూరకృత్యాలు ప్రహ్లాదుని విషయంలో విఫలమైనట్లే, భీష్మ ద్రోణ కర్ణ కృప అశ్వత్థామల ధనుస్సుల నుంచి వెలువడిన నానావిధాలైన శస్త్రాస్త్రాలు నా మీదకు రాకుండా ఆ మాధవుని దయాధృక్కులతో ప్రక్కకు తొలగి పోయాయి కదా..
**
వసుమతి దివ్యబాణముల వ్రక్కలు వాపి కొలంకు సేసి, నా
రసములు మాటుగాఁ బఱపి రథ్యములన్ రిపు లెల్లఁ జూడ సా
హసమున నీటఁ బెట్టితి రణావని సైంధవుఁ జంపునాఁడు, నా
కసురవిరోధి భద్రగతి నండయి వచ్చినఁ గాదె? భూవరా!
**
సైంధవుని వధించే ఆ నాటి రణరంగంలో, శత్రువులు కళ్లారా చూస్తుండగానే, నా దివ్య బాణాలతో భూమిని బద్దలుకొట్టి జలాశయాన్ని కల్పించి అలసి సొలసిన నా రథాశ్వాలకు దప్పిక తీర్చింది ఆ దయామయుని అండవల్లనే కదా!
🏵️ పోతన పదం🏵️
🏵️ఆత్మీయతకుపట్టం🏵️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి