..
రాణీ కౌసల్య పేల్చేమాటల తూటాలు దశరథుడి హృదయకవాటాలను భేదిస్తున్నాయి.ఆవిడ పలికే ఒక్కొక్క పలుకు ములుకై గుండెలను గుచ్చుతున్నాయి.పాపం ముసలి రాజు తట్టుకోలేక పోతున్నాడు.ఇంద్రియాలు పట్టుతప్పుతున్నాయిమాటిమాటికి మూర్ఛిల్లుతున్నాడు తేరుకుంటున్నాడు.
.
కౌసల్యా ! పూర్వమెప్పుడో నేను చేసిన పాపం నన్ను పట్టిపీడిస్తున్నది.నీ వంటి ధర్మదృష్టిగల వనితాశిరోమణి ,పెద్దచిన్నతారతమ్యము తెలిసినదానవు ఎంత దుఃఖములో ఉన్నప్పటికీ భర్తను నిందించడం నీవంటిదానికి తగునా!.
.
పల్లెత్తుమాట ఏనాడూ తను తన భర్తను అని ఎరుగదు.
ఈనాడు తనకీ దురవస్థ సంప్రాప్తించినదని ఇన్నిమాటలు అన్నానే ! అని ఒక్కసారిగా ఉబికిఉబికివచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ భర్తచేయిని తన తలమీద ఉంచుకొని, రాజా నీవు ఒక్కమాటతో నన్నుప్రాణములేని దానిని చేసి వేశావు గదయ్యా!.
నేను క్షమార్హము కాని అపరాధము చేసినాను.
.
మహారాజా నాకు ధర్మములన్నీ తెలుసు నీవు ధర్మము తప్పని వాడవనీ తెలుసు అయినా నన్ను ఆవరించిన శోకం నాలోని,ధైర్యాన్నీ,విజ్ఞతను,శాస్త్రపరిజ్ఞానాన్నీ, నశింపచేసినదయ్యా.శోకాన్ని మించిన శత్రువు లేదుకదా!
.
శోకో నాశయతే ధైర్యం శోకో నాశయతే శృతమ్
శోకో నాశయతే సర్వం నాస్తి శోక సమో రిపుః
.
శత్రువుకొట్టిన దెబ్బనైనా సహింపవచ్చును కానీ హఠాత్తుగా వచ్చిమీదపడిన శోకాన్ని అది ఎంత చిన్నదైనా కానీ తట్టుకోవడం కష్టం..
.
ఓ వీరుడా ! ధర్మవేత్తలూ,శాస్త్రజ్ఞులు,అన్నిసంశయాలు తొలగిన సన్యాసులు కూడా శోకాన్ని తట్టుకోలేరయ్యా!.
.
ఓ నా ప్రాణనాధా నాప్రియ పుత్రుడు అడవికి వెళ్ళి నేటికి అయిదవరోజు అయినా నాకు అయిదు సంవత్సరములవలే ఉన్నది.రాముడిని తలుచుకుంటున్నకొద్దీ నాలో దుఃఖము కట్టలు తెంచుకొంటున్నదయ్యా!.
.
వీరిలా మాటలాడుకుంటూనే ఉన్నారు .సమయమెంత గడిచిందో ఇరువురికీ స్ప్రుహలేదు.సూర్యకిరణాలవెలుగు మసకబారి రాత్రి వచ్చింది.శోకముతోటే నిద్రలోకి జారుకున్నాడు దశరథుడు.
.
జానకిరామారావు వూటుకూరు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి