7, అక్టోబర్ 2020, బుధవారం

**శ్రీమద్భాగవతము**

 **దశిక రాము**




 తృతీయ స్కంధం -40


గర్భసంభవ ప్రకారంబు


ఈశ్వరుడు శాశ్వతంగా ప్రకాశించేవాడు, అన్నిటినీ సంఘటిత పరిచేవాడు కాబట్టి జీవుడు తన పూర్వకర్మలను అనుసరించి మళ్ళీ దేహాన్ని పొందగోరుతాడు. జీవుడు పురుషుని వీర్యబిందు సంబంధంతో స్త్రీ గర్భంలో ప్రవేశిస్తాడు. ఒక్క రాత్రికి శుక్రశోణితాల ద్రవరూపమైన కలిలమై, తర్వాత ఐదురాత్రులకు బుద్బుదమై, ఆపైన పదవదినానికి రేగుపండత అయి, అనంతరం మాంసపిండమై గ్రుడ్డు ఆకారం పొందుతాడు. ఒక నెలకు శిరస్సు ఏర్పడుతుంది. రెండు నెలలకు కాళ్ళు చేతులు వస్తాయి. మూడు నెలలకు గోళ్ళు, వెంట్రుకలు, ఎముకలు, చర్మం, నవరంధ్రాలు ఏర్పడుతాయి. నాలుగవ నెలకు సప్తధాతువులు కలుగుతాయి. ఐదవనెలకు ఆకలి దప్పులు సంభవిస్తాయి. ఆరవ నెలలో మావిచేత కప్పబడి, తల్లి కడుపులో కుడివైపున తిరుగుతూ ఉంటాడు. తల్లి తిన్న అన్నంతో త్రాగిన నీటితో తృప్తి పొందుతుంటాడు. వాత పిత్త శ్లేశ్మలానే ధాతువులు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. మల మూత్రాల గుంటలలో పొర్లుతూ, అందలి క్రిములు శరీరమంతా ప్రాకి బాధపెట్టగా మూర్ఛపోతూ ఉంటాడు. తల్లి తిన్న కారం, చేదు, ఉప్పు, పులుపు మొదలైన తీవ్రరసాలు అవయవాలను తపింపచేస్తాయి. మావిచే కప్పబడి, బయట ప్రేగులచే కట్టివేయబడి తల్లిపొట్టలో తలదూర్చి, వంగి, ముడుచుకొని, పండుకొని ఉంటాడు. తన అవయవాలు కదలించటానికి శక్తిలేక పంజరంలో చిక్కిన పక్షివలె బంధితుడై ఉంటాడు. దైవదత్తమైన తెలివితో వెనుకటి జన్మలలోని పాపాలను తలచుకొని నిట్టూర్పులు విడుస్తాడు. కించిత్తుకూడా సుఖాన్ని పొందలేకుండా ఉంటాడు. ఏడవనెలలో జ్ఞానం కలుగుతుంది. కదలికలు కలుగుతాయి. మలంలోని క్రిములతో కలసి మెలసి ఒకచోట ఉండలేక కడుపులో అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. గర్భవాయువులకు కంపించిపోతూ దేహాత్మ దర్శనం కలిగి, విమోచనాన్ని యాచిస్తూ, మళ్ళీ గర్భవాసం కలిగినందుకు భయపడుతూ బంధనరూపాలైన సప్తధాతువులతో బంధితుడై, చేతులు జోడించి దీనముఖుడైన జీవుడు ఏ దేవుడు తనకు ఈ గర్భవాసం కలిగించాడో ఆ సర్వేశ్వరుని ఈ విధంగా స్తుతిస్తాడు. ఎల్లప్పుడు లోకాలను రక్షించడానికి ఇచ్ఛానుసారం జన్మమెత్తుతూ ఉండే భగవంతుని పాదపద్మాలను అనురక్తితో, భక్తితో ఆరాధిస్తాను. ఆ పాదాలు నా భయాన్ని పటాపంచలు చేస్తాయి.అంతేకాక పంచభూతాలు లేకున్నా పంచభూతాలతో ఏర్పడిన శరీరంతో కప్పబడి ఇంద్రియగుణాలు, ఇంద్రియార్థాల అస్తిత్వం తెలిసీ తెలియని అభాసజ్ఞానం కలిగిన నేను...

.ఏ దేవుడు సమస్త జీవరాసులలో పంచేంద్రియాలతో పంచభూతాలతో నిండిన మాయను అంగీకరించి కర్మబంధాలకు లోబడి ఉన్నట్లు కన్పిస్తాడో, దహించుకొని పోతున్న జీవుని చిత్తంలో అవికారుడై, పరిశుద్ధుడై, అఖండజ్ఞాన స్వరూపుడై భాసిస్తుంటాడో ఆ ఉదాత్త చరితునికి, ఆ మొక్కవోని శౌర్యం కలవానికి, ఆ పరంజ్యోతికి, ఆ దయామయునికి, ఆ శాంతమూర్తికి, ప్రకృతి పురుషులకంటె అతీతుడైన ఆ భగవంతునికి ఈ భరింపరాని భయంకరమైన గర్భనరకంలో ఉన్న నన్ను రక్షించి శాంతి కలిగించమని నమస్కరిస్తున్నాను.”అని చెప్పిన కొడుకుతో తల్లి ఇలా అన్నది “ఓ మహానుభావా! ఎవని మాయవల్ల మానవులు వ్యామోహంలో పడి గుణకర్మ నిమిత్తంగా ఏర్పడ్డ ఈ సంసార మార్గంలో ప్రయాణిస్తూ ధైర్యం చాలక, అలసిపోయి దిక్కు తెలియక చీకాకు పడుతూ చివరకు ఆ దేవుని పాదాలను ధ్యానించాలనే విషయాన్ని కూడా మనస్సులో మరచిపోతారో, ఆ పురుషోత్తముని అనుగ్రహం లేనిదే ఆ మానవులకు ఆయన గుణగణాలను ధ్యానించాలనీ, ఆయన రూపాన్ని దర్శించాలనీ బుద్ధి పుడుతుందా? ఈ సంగతి నాకు కనువిప్పు కలిగేలా విప్పి చెప్పు” అని అడిగిన సద్గుణవల్లియైన తల్లితో కపిలుడు ఇలా అన్నాడు.“ఆ భగవంతుడు మూడు కాలాల్లోనూ చరాచర ప్రపంచంలోని సమస్త జీవరాసులలో అంతర్యామిగా ఉండడం వలన బ్రతుకు తెరువున పయనించేవారు తాపత్రయాలు తప్పించుకోవడానికై అతన్ని ఆరాధిస్తారు” అని చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు

.అమ్మా! జీవుడు తల్లి గర్భంలో క్రిములతో నిండిన మలమూత్రాల నెత్తురు గుంటలో మునుగుతూ, ఆకలి మంటలతో దినదినం తపించే దేహం కలవాడై...దైన్యంతో నిండిన ముఖం కలవాడై, ఆ గర్భనరకంనుండి బయటపడాలని భావిస్తూ, గడచిన నెలలు లెక్కించుకుంటూ ‘నన్ను ఈ గర్భంనుండి వెలువరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ’అని తలపోస్తూ ‘దీనులను రక్షించే పుండరీకాక్షుడు ఒక్కడే నన్ను ఈ గర్భనరకం నుండి విముక్తుణ్ణి చేయగలడు. అయితే ఆ మహాత్మునకు నేను ప్రత్యుపకారం ఏమీ చేయలేను. చేతులు జోడించి నమస్కారం మాత్రమే చేయగలుగుతాను. నేను కేవలం జీవుడను. శమ దమాది గుణాలతో కూడిన రాబోయే జన్మలో విజ్ఞాన దీపాంకురాన్ని వెలిగించుకొని ఆ వెలుగులో పురాణపురుషుణ్ణి చూస్తాను’ అనుకొని, మళ్ళీ ఇలా అనుకుంటాడు.ఎన్నెన్నో దుఃఖాలకు నిలయమైన ఈ గర్భనరకం నుండి నేను బయట పడలేను. ఒకవేళ బయటకు వచ్చినా దేవమాయలకు లోనై వ్యామోహంతో భయంకరమైన సంసార వలయంలో చిక్కుకొని పరిభ్రమిస్తూ ఉండవలసిందే. అందుకని ఈ గర్భశోకాన్ని పోగొట్టేదీ, ఆత్మను సారథియై నడిపించేదీ అయిన విజ్ఞానాన్ని ఆశ్రయించి అంధకార బంధురమైన సంసార సాగరాన్ని దాటి ఆత్మను రక్షించుకుంటాను. ఇంకా...ఈ గర్భనరకం అనేక వ్యసనాలకు నిలయమైనది. అంతులేని దుఃఖాలకు మూలమైనది. ఎన్నో రంధ్రాలు గలది. క్రిములకు జన్మస్థానమైనది. ఇటువంటి ఎన్నో గర్భవాసాల ఆపదను పోగొట్టడానికై సంసార సాగరాన్ని తరింపజేసే కమలనాభుని పాదపద్మాలను ఆశ్రయిస్తాను.’ తల్లీ! ఈ విధంగా నిశ్చయించుకొని అతిశయించిన నిర్మలజ్ఞానం కలవాడై, జీవుడు గర్భం నుండి వెడలిరాకుండా తొమ్మిది నెలలు అలాగే గడుపుతాడు.పదవ నెలలో జీవుడు తలక్రిందుగా తిరిగి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేక ఎంతో బాధపడుతూ జ్ఞానరహితుడై, నెత్తురు పులుముకున్న దేహంతో భూమిమీద పడి ఏడుస్తూ, ఎరుకలేనివాడై ఉండి, తన ఉద్దేశ్యం అర్థం చేసికోలేని ఇతరులచే పోషింపబడుతూ, తనకు కావలసిన దేదో చెప్పలేక, పెక్కు కీటకాలతో నిండిన ప్రక్కమీద పండుకొని, శరీరం దురద పుట్టినా గోకుకొనలేక, కూర్చోడానికి లేవడానికి నడవడానికి శక్తి చాలక, తన ఒంటి నిండా దోమలూ నల్లులూ ఈగలూ మొదలైనవి ప్రాకి కుడుతూ ఉంటే వారింపలేక, క్రిములచే పీడింపబడే క్రిమిలా బాధపడుతూ, ఏడుస్తూ, జ్ఞానం లేనివాడై మెలగుతూ, శైశవంలో ఆయా అవస్థలను అనుభవించి, బాల్యంలో విద్యాభ్యాసం మొదలైన వాటితో శ్రమపడి, ఆ తర్వాత యౌవనంలో తన కోర్కెలు తీర్చుకొనడం కోసం సాహసంతో కూడిన పనికిమాలిన పంతాలూ పట్టుదలలూ పూనుతూ, కామోద్రేకంతో ప్రవర్తిస్తూ, పంచభూతాత్మకమైన తన దేహంమీద మాటిమాటికీ అహంకార మమకారాలు పెంచుకుంటూ, అందుకు తగిన పనులు చేస్తూ, సంసార బంధాలలో కట్టుబడి, దుష్టుల స్నేహంవల్ల కామం పండించుకొనడం, కడుపు నిండించుకొనడంతోనే సతమతమౌతూ, అజ్ఞానియై పెచ్చు పెరిగిపోతున్న మచ్చరంతో దానికి ఫలమైన దుఃఖాన్ని అనుభవిస్తూ, కామాంధుడై, తన నాశనానికి మూలకారణమైన చెడుపనులను చేస్తూ ఉంటాడు. ఇంకా...అమ్మా! దుర్మార్గుల సాంగత్యంవల్ల సత్యం, శుచిత్వం, దయ, ధ్యైర్యం, మితభాషణం, బుద్ధి, సిగ్గు, ఓర్పు, కీర్తి, శమం, దమం మొదలైన గుణాలన్నీ నశిస్తాయి” అని చెప్పి కపిలుడు తల్లితో మళ్ళీ ఇలా అన్నాడు. “మూఢ హృదయులు, శాంతి లేనివాళ్ళు, దేహమే ఆత్మ అని భావించేవాళ్ళు, స్త్రీ వ్యామోహంలో చిక్కుకొని గొలుసులతో బంధించిన పెంపుడు మృగాలలాగా పరులకు వశమైన బుద్ధి కలవారు శోచనీయులు. అటువంటివారి సాంగత్యం వదలిపెట్టాలి. అందులోను స్త్రీసాంగత్యం బలీయమైన దోషం అని ప్రాజ్ఞులంటారు కదా!దీనికొక ప్రాచీన కథ ఉంది. పూర్వం ఒకనాడు బ్రహ్మదేవుడు తన కూతురైన సరస్వతి ఆడులేడి రూపాన్ని ధరించి ఉండగా చూచి, ఆమ సౌందర్య లావణ్యాలకు మురిసిపోయి, పరవశించిన హృదయంతో సిగ్గు విడిచి, తానుకూడ మగలేడి రూపాన్ని ధరించి నీచమని భావించకుండా ఆమె వెంటబడి పరుగులెత్తాడు. కాబట్టి పురుషునకు స్త్రీసాంగత్యం తగదు. నా నాభికమలం నుండి పుట్టిన బ్రహ్మ, అతనిచే సృష్టింపబడిన మరీచి ప్రముఖులు, వారికి పుట్టిన కశ్యపాదులు, వీరిచే కల్పించబడిన దేవతలు, మనుష్యులు, వీరందరిలోను చక్కదనాల చుక్కలైన రమణీమణుల మాయలకు చిక్కకుండా మొక్కవోని మనస్సు కలిగి ఉండడం అన్నది పుండరీకాక్షుడైన ఒక్క నారాయణ మహర్షికే తప్ప ఇతరులకు ఎవ్వరికీ సాధ్యం కాదు” అని కపిలుడు మళ్ళీ ఇలా చెప్పాడు. నా మాయయే స్త్రీరూపంలో పురుషులకు మోహాన్ని కలిగిస్తుంది. కాబట్టి పురుషులు పరస్త్రీ సాంగత్యాన్ని పరిత్యజించి యోగమార్గంలో చరిస్తూ ఉండాలి.స్థిరబుద్ధితో నా పాదపద్మాలను సేవించడంలో ఆసక్తి కలవారు స్త్రీసాంగత్యాన్ని నరకద్వారంగా మనస్సులలో భావిస్తారు. నా మాయచేత కల్పించబడిన కామినీరూపం దట్టమైన గడ్డిచే కప్పబడిన కూపానికి అనురూపమై, మృత్యుస్వరూపమై ఉంటుంది. ఇంకా...ధన్యధాన్యాలు, పశువులు, పుత్రులు, మిత్రులు, స్త్రీలు, గృహాలు మొదలైన వాటికి కారణభూతమైన ఈ శరీరంలో ఉన్న జీవుడు ఇవన్నీ అనుభవించి మళ్ళీ ఈ జన్మలోని కర్మఫలాన్ని అనుభవించడం కోసం ఇటువంటి శరీరాన్ని మళ్ళీ ధరిస్తాడు. ఆకాశంలోకి ఎగిరిపోయినా, భూమిలో దూరినా, దిక్కులకు పారిపోయినా, ఎక్కడ దాగినా కర్మఫలాన్ని అనుభవింపక తప్పదు.అటువంటి పురుషరూపాన్ని ధరించిన జీవుడు ఎడతెగని స్త్రీసాంగత్యంవల్ల భోగభాగ్యాలు, పిల్లలు, ఇల్లు మొదలైన వాటిపై ఆసక్తి పెంచుకొని వచ్చే జన్మలో స్త్రీగానే జన్మిస్తాడు. ఈ విధంగా స్త్రీత్వాన్ని పొందిన జీవుడు నా మాయవల్ల పురుషరూపాన్ని పొంది ధనాదులను ఇచ్చే భర్తను సంసారబంధనానికి కారణంగా తెలుసుకోవాలి. ఈ సంసారబంధమే మృత్యువు. జీవునకు ఆధారంగా లింగమయ దేహం నిలిచి ఉంటుంది. ఆ లింగమయదేహంతో తనకు నివాసమైన ఈ లోకంనుండి వేరు లోకాలను పొందుతూ పూర్వకర్మలయొక్క ఫలితాన్ని అనుభవిస్తూ, తిరిగి కర్మలపై ఆసక్తుడు అవుతూ ఉంటాడు. మనస్సుతో పంచభూతాలతో పంచేంద్రియాలతో ఏర్పడి సుఖ సాధనమైన దేహం క్రమంగా శుష్కించి నశిస్తుంది. అడవిలో వేటగాడు మృగాలకు గానాదులతో అనుకూలమైన సదుపాయాలు కూర్చేవాడైనా, అతడే మృగాలపాలిటికి మృత్యువుగా పరిణమిస్తాడు. అట్టి దేహాన్ని చాలించడమే మరణం. దానిని పొందడమే జననం. కనుక సకల వస్తువులకూ సంబంధించిన జ్ఞానాన్ని పొందడానికి జీవునకు సాధనం కన్ను. ద్రష్ట చూడదగిన దానిని చూడడం అనే యోగ్యత సంపాదించుకున్నప్పుడు జీవునకు పుట్టడం, గిట్టడం అనేవి ఉండవు. కాబట్టి మానవుడు పిరికితనాన్నీ, దైన్యభావాన్నీ వదలిపెట్టి, తొందర లేనివాడై, జీవుని స్వరూపాన్ని జ్ఞానం ద్వారా తెలుసుకొని, ధైర్యం వహించి బంధనాలు లేనివాడై యోగ్యమైన వైరాగ్యంతో కూడిన చక్కని జ్ఞానాన్ని అలవరచుకోవాలి. మాయాకల్పితమైన ఈ లోకంలో దేహం మొదలైన వానిపై ఆసక్తి లేకుండా ఉండాలి” అని చెప్పి కపిలుడు మళ్ళీ ఇలా అన్నాడు.

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి*

🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: