పెద్దతనం వచ్చింది అనగానే కొన్ని విషయాలు మనం వదిలి వేయాలి.
పట్టుకోవటం కష్టం కానీ వదిలివేయటంలో బాధ ఏమిటి చెప్పండి?
అలా అనుమానంగా చూడకండి... ఏమి వదిలివేయాలో చూద్దామా ..
"అమ్మాయి!! గ్యాసు కట్టేసావా!! గీజర్ ఆఫ్ చేసావా?? ఏ.సి. ఆన్ లో ఉన్నట్లుంది.. పాలు ఫ్రిజ్ లో పెట్టావా ?? కరెంట్ బిల్లు కట్టారా !!!" లాంటి ఎంక్వయిరీలు వదిలి వేయండి !!!
"మా కొడుకు కోడలు పట్టించుకోరు" అని హైరానా పడకండి..
ఇలా పట్టించుకుంటూ.. 60..70 ఏళ్ళు గడిపారు, ఇంకా ఎంతకాలం ?? ఇది వాళ్ళ హయాంలో వాళ్ళిష్టం .. కష్టనష్టాలు కూడా వాళ్ళవే !! చూడండి అప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండగలరో.. "నా అభిప్రాయం ఏమిటంటే" అని అనటం తగ్గించి..
"నీ ఇష్టం, నువ్వు చెప్పు" అని వాళ్ళ ఇష్టాయిష్టాలతో వాళ్ళని బ్రతకనిద్దామా!!
'నాకూ తెలుసు' తో పాటు 'నాకు మాత్రమే తెలుసు' అనే అహం తగ్గించుకుని, వాళ్ళకి చాలా విషయాలు, టెక్నాలజీ 'నాకంటే ఎక్కువ తెలుసు' కదా అనే నిజాన్ని ఠక్కున ఒప్పేసుకోండి.. మీ మంచికేనండీ చెబుతున్నాను ...
"మా కాలంలో",
"మా చిన్నప్పుడు" అంటూ వీలు చిక్కినప్పుడల్లా వారిని ఊదరకొట్టకండి. వారి ముఖాల్లో కనిపించే విసుగుని చూడనట్లు నటించకండి. మన పిల్లలు కోసం వచ్చేవారితో మితంగా మాట్లాడండి. వాళ్ళు మనకోసం రాలేదు అని గుర్తుంచుకోండి. కాసేపు మాట్లాడాక లేచి గదిలోకి వెళ్ళిపోగలిగే మనోనిగ్రహం అలవరుచుకోండి ..
పెద్దవారిని పలకరించే మర్యాదతో ఒక ప్రశ్న ఎవరైనా సహజంగా అడుగుతారు... "ఆరోగ్యం బాగుంది కదా" అని. దయచేసి వెంటనే స్పందించకండి...
మన బి.పి..... షుగర్.. కీళ్ళనొప్పులు .. నిద్ర పట్టకపోవటం,.. నీరసం అంత రసవత్తరమైన విషయం కాదని సదా సర్వదా గుర్తుంచుకోవాలండీ బాబూ !!! మనకి తోచక కాలక్షేపానికి ఎంత ఆలోచించినా ఎదుటివాళ్ళకి దాంట్లో అంతే ఇంట్రెస్ట్ ఏం ఉంటుంది చెప్పండి.. "బాబోయ్ !! ఎందుకు అడిగామా" అనే పశ్చాత్తాపం వారికి కలిగించకండి..
ఇంకొక విషయం...
ఎవరో పెద్దాయన అన్నాడు...
"మన అనుభవం తో వారిని తీర్చి దిద్దాలి కదా!" అని.
కాలం మారింది... మారుతున్నది..
"రోట్లో కందిపచ్చడి రుబ్బటం.. తిరగలితో విసరటం.. కట్టెల పొయ్యి మీద వంట చేయటం, కవ్వంతో మజ్జిగ చిలకటంలో గల నా అనుభవం నేటి తరానికి ఎలా ఉపయోగపడుతుంది ??"
ఉద్యోగాలైనా అంతే ! పద్దతులు మారుతున్నాయి.. టెక్నాలజీ అన్నింటా చోటు చేసుకుంటున్నది.... విమానంలో ప్రయాణించే వారికి ఎర్రబస్సు లో సీటు ఎలా పట్టుకోవాలో చెప్పి ఏం ప్రయోజనం ??
*చివరగా పెద్దతనంలో మన పరువు కాపాడుకోవటం పూర్తిగా ... పూర్తిగా మన చేతుల్లోనే ఉందండీ !! అనవసరం విషయాల్లో జోక్యం చేసుకోకుండా... మితభాషిగా వుంటూ... మన ఆర్థిక స్వాతంత్య్రం కోల్పోకుండా... ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ... జిహ్వ చాపల్యం తగ్గించుకుని... అన్నింటికంటే ముఖ్యమైన విషయం "నన్ను ఎవరూ గౌరవించటం లేదు" అనే ఆత్మన్యూనతా భావం దరి చేరకుండా జాగ్రత్తపడాలి...*
భావం, బంధాలు, అంత తేలికగా తగ్గించుకోలేము.. కనీసం కొన్ని విషయాలను వదిలివేద్దాం.. పాజిటివ్ గా చూడండి... ఉద్యోగానికి పరిగెత్తాలనే హడావిడి లేదు... మొత్తం సంసారాన్ని లాగే బాధ్యత లేదు... పిల్లలకి సహకరిస్తున్నామనే తృప్తి ఉండనే ఉంది..
హాయిగా పూజలు చేసుకోవచ్చు.. భగవద్గీత, భాగవతం చదువుకోచ్చు.. దైవదర్శనం చేసుకోవచ్చు.. చిన్న చిన్న హాబీలు మనసు కి ఆహ్లాదాన్నిస్తాయి.. వాటికి సమయం కేటాయించవచ్చు..
*ఒక మాటని రోజూ అనుకుందాం.. "I love myself... I respect my self " ఇది మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది..*
చివరగా............ మనం దిగవలసిన స్టేషన్ దగ్గరలోనే వుంది ... Platform అదిగో ..... సమయం దగ్గర పడింది.
ఇక మనకి బోగీలో ఉన్నవారితో తగువులు... మనస్పర్థలు ఎత్తిపొడుపు మాటలు అవసరం అంటారా...
*మనం దిగుతుంటే వారి ముఖాల్లో 'హమ్మయ్య' అనే భావం కనిపించాలో లేక 'అయ్యో అప్పుడే స్టేషన్ వచ్చేసిందా' అనే భావం కనిపించాలో నిర్ణయం మన చేతిలోనే ఉంది ...*
పెద్దతనం మనకి వరంలాంటిది ... అది ముఖ్యంగా మన 'అహం' తగ్గించి, మనకి జీవితం అంటే ఏమిటో, మన నిజమైన విలువ ఏమిటో సరియైన అవగాహన కల్పిస్తుంది ... కాబట్టి అందరూ వృద్ధాప్యాన్ని ఆనందంగా స్వాగతించాలి సుమండీ !!!
*నస అనిపించుకునే కంటే nice అనిపించుకోవడం మంచిది కదా!
👏👌🙏👍😊
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి