✍️ గోపాలుని మధుసూదన రావు
ధరణీతలమున విష్ణువు
సిరిగాంచగ తిరుగుచుండి చిడిముడి పడియున్
యరయగ సెలవును వెదకుచు
ధర వేంకటనగము జేరె తాపసి వోలెన్. 72
లోకంబుల నాకలినే
పోకార్చెడి శక్తి గలుగు పురుషోత్తముడే
యాకలి దప్పుల కొగ్గియు
వ్యాకులపడి తిరుగుచుండె వసుధలొ మిగులన్ 73
మనమున లచ్చిని దలచుచు
వనమెల్లను దిరిగి దిరిగి వైకుంఠుడటన్
మునిజన వేంకటనగమున
కనెనంతట శ్రీవరాహు కమనీయ స్థలిన్ 74
ఘనుడా వరాహమూర్తిని
వినయంబున గలసి యతని యిష్టముతోడన్
ఘనుడా శ్రీహరి యుండెను
వనమందున సరసుప్రక్క వల్మీకమున్. 75
వసుమతి పతియగు నీశుడు
వశియించను నెలవులేక వసుధంతటిలో
బుసపురుగుల సహచరమున
వశియించగసాగె తుదకు వల్మీకమునన్ 76
అక్కట శ్రీనాథుండట
చిక్కియు వల్మీకమందు చింతించునెడన్
నెక్కడ శ్రీహరి? యనుచును
మక్కువతో నారదుండు మహిలో వెదికెన్ 77
భీకర కానన మందున
యాకలిదప్పికలతోడ హరి యటులుండన్
వ్యాకులపడి నారదుండు
నాకమునకు జేరి శివుని నలువని గాంచెన్. 78
పరమేశుడు పరమేష్ఠియు,
సురమునియగు నారదుండు సూచనసేయన్
కరవీరపురము జేరియు
వరలచ్చిమితోడ ననిరి వల్మీకవిధిన్ 79
ఆకలి దప్పుల దగిలియు
శ్రీకాంతుడు పుట్టయందు చేరి వసించన్
యే కతమున నతనాకలి
పోకార్చగగలము ననుచు పొందిరి శంకన్ 80
పరమేష్ఠియు గోవయ్యెను
పరమశివుడు వత్సమయ్యె పావనమదితో
వరలక్ష్మి గొల్లతయ్యెను
పరమాత్ముని సేవసేయ ప్రాప్తము వలనన్ 81
పరమేష్ఠియు పరమశివుడు
పరమాత్ముని సేవసేయ పశులుగమారన్
వరలక్ష్మి యంత వాటిని
నరనాథునికప్పజెప్పె నారదు డనగన్ 82
తదుపరి యా సుర ధేనువు
మధుసూదనుడుండు పుట్ట మాటుకు జనియున్
వదలుచునుండెను నోటన
పొదుగుననున్నట్టు పాలు పూనికతోడన్. 83
అనుదినమా గవి చనుచును
పనిపడి హరిపుట్టచెంత పరమాత్మునికై
చనుబాల నొదులుచుండగ
ననయము యా పాలుద్రావి హరి తృప్తోందెన్ 84
గోవీరీతిగ ననయము
నా విష్ణువు చెంతజేరి యమృతమీయన్
నావుల గాసెడి గొల్లడు
నా వింతను గనియు మిగుల నచ్చరువొందెన్. 85
గుట్టలు గట్టులు దాటుచు
గుట్టుగ యా యావు కదలి గురుతుగ పుట్టన్
పట్టుగ పాలను వదలుట
గుట్టుగ గమనించి గొల్ల కుపితుండయ్యెన్ 86
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి