7, అక్టోబర్ 2020, బుధవారం

🕉️ #శ్రీమహావిష్ణు_సహస్రనామ_వైభవము-24🕉️

 **దశిక రాము**

💮 శ్లోకం-18💮


**వేద్యో వైద్య స్సదా యోగీ**


**వీరహా మాధవో మధుః|**


**అతీన్ద్రియో మహామాయో**


**మహోత్సాహో మహాబలః||**


165. వేద్యః --- తెలిసికొనబడువాడు; తెలిసికొన దగినవాడు (మోక్షగాములకు).

166. వైద్యః --- విద్య లన్నియును తెలిసినవాడు, సర్వజ్ఞుడు; జనన మరణ చక్రమునుండి తన భక్తులను ముక్తులోనరింప నెరిగినవాడు; భవరోగ బంధన విమోచకమగు ఔషధ విద్యయందు ప్రవీణుడు.

167. సదాయోగీ --- భక్తులపట్ల ఎల్లపుడు జాగరూకుడై అందుబాటులోనుండెడివాడు; సర్వవ్యాపియై విశ్వమును అవిచ్ఛిన్నముగా నిలుపువాడు; సదా ధర్మమార్గానువర్తి యైనవాడు; యోగచింతనలో నిమగ్నుడైన సచ్చిదానంద పూర్ణ బ్రహ్మము; ఎల్లపుడు సమత్వ భావన కలిగినవాడు.

168. వీరహా --- బలవంతులగు దుష్టులను నాశనము చేయువాడు.

169. మాధవః --- (73, 169, 741 నామములు) మా ధవః -శ్రీమహాలక్ష్మి (మా) కి భర్త ; మధువిద్య (మౌనము, ధ్యానము, యోగము) ద్వారా తెలిసికొనబడువాడు; సకల విద్యా జ్ఞానములకు ప్రభువు; పరమాత్మను గూర్చిన జ్ఞానము ప్రసాదించువాడు; మధు (యాదవ) వంశమున పుట్టినవాడు; తనకు వేరు ప్రభువు లేనివాడు (అందరకు ఆయనే ప్రభువు) ; మౌనముగానుండి, సాక్షియై నిలచువాడు; బ్రహ్మ విద్యను ప్రసాదించువాడు.

170. మధుః --- భక్తులకు తేనెవలె, అమృతమువలె అత్యంత ప్రియమైనవాడు; మంగళకరమగు జ్ఞానమయుడు.

171. అతీంద్రియః --- ఇంద్రియములకు అందనివాడు (ఇంద్రియముల ద్వారా తెలియరానివాడు).

172. మహామాయః --- అధిగమింపజాలని మాయామయుడు

173. మహోత్సాహః --- గొప్ప ఉత్సాహముతో కార్యాచరణ కావించువాడు; అంతులేని సహనముతో జగత్తును భరించువాడు.

174. మహాబలః --- అనంతమగు, అద్భుతమగు బలము కలవాడు; బలవంతులకంటె బలవంతుడు; అందరికిని (భక్తులకు) వివిధ బలములను ప్రసాదించువాడు (జీవనాధారము).


వేద్యో వైద్యః సదాయోగీ వీరహా మాధవో మధుః


అతీంద్రియో మహామాయో మహోత్సాహోమహా బలః !!18!!


37. తెలియ దగిన వాడు, తెలిసిన వాడెగా


యోగి పుంగవుండు, యాగ త్రాత,


అతడె మాధవుడును యతడెగా యమృతము


వందనాలు హరికి వంద వేలు !!


{అర్థాలు : వేద్యః ... తెలుసుకోదగినవాడు, వైద్యః ... విద్యలన్నీ తెలిసినవాడు, సదాయోగిః ... యోగిపుంగవుడు, వీరహా ... ధర్మరక్షకుడు, మాధవః ... లక్ష్మీపతి మరియూ విద్యాపతి, మధుః ... అమృతము.


భావము : తన (తత్త్వం) గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకో (వలసిన) దగిన వాడు, విద్యలన్నీ తెలిసిన వాడు (వైద్యమే అనుకున్నా మానసిక రుగ్మతలను ఆధ్యాత్మిక పరమైన చికిత్సతో నయం చేసేవాడు అనుకోవచ్చు కదా) యోగ విద్యలన్నీ యెరిగినవాడు (జీవాత్మ, పరమాత్మతానే అయి స్వస్వరూపాన ఉండేవాడు), ధర్మరక్షకుడు (ధర్మానికి యాగము అనే పర్యాయ పదమూ, రక్షకునికి త్రాత అనే పర్యాయ పదమూ ఉన్నాయి కదా), లక్ష్మీ (మా అంటే లక్ష్మియే కదా) పతి , పరమేశ్వరునికి చెందిన పరా విద్యను కూడా మా అంటారని మరొక పాఠం. కనుక ఆ ప్రకారంగా కూడా మాధవుడే, కాగా, భక్తుల పాలిటి అమృతమయుడై వ్యవహరించేవాడు అయిన ఆ శ్రీహరికే శతసహస్ర వందనాలు.)


38. ఇంద్రియములకెపుడు నితడు గన్పట్టడు


మాయలకును పెద్ద మాయ యతడె !


భక్త జనుల గాచ బర్వులెత్తు, బలుడు


వందనాలు హరికి వంద వేలు !!


{అర్థాలు : అతీంద్రియః ... ఇంద్రియములకు గ్రాహ్యం కానివాడు, మహా మాయః ... మాయలకే మాయావి, మహోత్సాహ ... ఉత్సాహం ఉరకలు వేసేవాడు, మహాబలః ... ఎదురులేని మహా బలసంపన్నుడు.


భావము : సాదారణ ఇంద్రియాలకు గోచరించని వాడు, (ఆత్మ జ్ఞానంతో మాత్రమే దర్శనమీయగలవాడు), మాయామేయమైన ఈ చరాచర జగత్తు నంతటా తన మాయలనే ప్రసరించిన వాడు (తన లీలలు తెలియనివ్వరానివాడు), భక్తులను రక్షించడానికి సదా ఉత్సాహం ఉరకలు వేసేవాడు(సిరికిం జెప్పడు.... పద్యం ఈ సందర్భాన మననార్హం కదా), ఎదురులేని మహా బలసంపన్నుడైన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు. )


-ఓం నమో నారాయణాయ

🕉️🥀🕉️🥀🕉️🥀🕉️🥀🕉️



**ధర్మో రక్షతి రక్షితః*

కామెంట్‌లు లేవు: