శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన
#శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;
మ||
హిమశైలంబది దద్దరిల్లినది ; నందీశుండు దుర్వారుడై
ప్రమథుల్ గంపిల రంకెలందుకొనె; దిగ్భాగంబులల్లాడె; నా
కము పాతాళము తారుమారయి విపత్కాలంబు దోపించె కూ
రిమి చాలింపవె తాండవార్భటి నిఁకన్ శ్రీ సిద్దలింగేశ్వరా!
భావం;
స్వామీ నటరాజా !
నీ నృత్య విన్యాసానికి కైలాస పర్వతము దద్దరిల్లిపోతోంది.
ప్రమథగణాలు కంపించి పోతున్నాయి.నందీశ్వరుడు తత్తరపడి రంకెలేసుకుంటూ అటూ ఇటూ పరుగెడుతున్నాడు.దిక్కులన్నీ అల్లాడిపోతున్నాయి.
స్వర్గము, పాతాళము స్థాన భ్రంశం చెంది తలక్రిందులయినాయి.ఏదో విపత్కర పరిస్థితి వచ్చినట్లు కనపడుతోంది.
నువ్వు ఎంతో అనురక్తితో చేసే నీ శివ తాండవ విజృంభణను లోకాలు తట్టుకోలేక పోతున్నాయి.దయచేసి కొంచెం ఆపగలుగుతావా స్వామీ! శ్రీ సిద్ధ లింగేశ్వరా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి