25, నవంబర్ 2020, బుధవారం

శ్రీమద్భాగవతము

 **దశిక రాము**


**శ్రీమద్భాగవతము**


 పంచమస్కంధం యొక్క ప్రధామాశ్వాసం. -6


భరతుండు వనంబు జనుట 


ఇంకా శ్రీవత్సం, కౌస్తుభం, వనమాలల చేత అలంకరింపబడిన వాడు; సుదర్శనం మొదలైన ఆయుధాలను ధరించేవాడు, తన భక్తుల హృదయ పద్మాలలో నివసించేవాడు, పరమ పురుషుడు అయిన వాసుదేవుని పట్ల ఆ భరతుడు ఎల్లప్పుడు భక్తి ప్రపత్తులు కలిగి యాభై లక్షల వేల సంవత్సరాలు రాజ్యపరిపాలన సాగించాడు. తాత తండ్రుల కాలంనుండి తరతరాలుగా సంక్రమించిన ధనరాశిని తగినట్లు తన కుమారులకు పంచి ఇచ్చి అపార సంపదలు గల రాజసౌధాన్ని వదలిపెట్టి పులహాశ్రమానికి వెళ్ళిపోయాడు. అప్పుడు…

ఏ ఆశ్రమంలో విష్ణువు అక్కడి వాళ్ళను ఆదరిస్తూ ప్రత్యక్ష రూపంలో నిలిచి ఉంటాడో, సాలగ్రామాలకు ఆలవాలమైన గండకీనది ఏ ఆశ్రమ సమీపంలో ప్రవహిస్తూ ఉంటుందో అటువంటి ఆ రమణీయమైన పులహ ఆశ్రమంలో భరతుడు ఒంటరిగా ఉంటూ శ్రీహరిని నానావిధాలైన పువ్వులతో, చిగుళ్ళతో, తులసీదళాలతో, తీర్థజలాలతో, కందమూల ఫలాలతో, కమలాలతో నిత్యం గొప్పగా అర్చిస్తూ తనివితీరా సేవ చేస్తున్నాడు.అటువంటి హరిసేవ వల్ల అతనికి విషయవాంఛలు నశించాయి. శమ దమాది గుణసంపద అలవడింది. పరమపురుషుణ్ణి భక్తి భావంతో ఎడతెగకుండా భజిస్తుంటే అహంకారమనే ముడి విడిపోయి ఆనందానుభూతి కలిగింది. అతని మేను పులకించింది. కన్నులలో ఆనందాశ్రువులు పొంగిపొరలాయి. ఇష్టదైవమైన శ్రీహరి పాదపద్మాలను ధ్యానించడం వల్ల ప్రాప్తమైన భక్తియోగం కారణంగా అతని హృదయం పరమానందంతో నిండింది. ఆ ఆనందానుభవం అమృత సరోవరంలో అవగాహన చేసినట్లుగా అనిపించింది. ఆ అనుభూతితో భరతునికి తాను చేస్తున్న పూజకూడా తెలియనంత తన్మయత్వం కలిగించింది. ఈ విధంగా భగవంతుని సేవావ్రతంలో మునిగిపోయిన భరతుడు జింక చర్మం ధరించాడు. మంత్ర పూర్వకంగా మూడు వేళలా స్నానం ఆచరించాడు. నిత్యం స్నానం చేయడం వల్ల తల వెంట్రుకలు తడిసి వంపులు తిరిగి జడలు కట్టి రాగి రంగుతో మెరువసాగాయి. సూర్యమండల మధ్యవర్తి అయిన పరమేశ్వరుణ్ణి హిరణ్మయ పురుషునిగా భావిస్తూ భరతుడు ఇలా అన్నాడు. జీవులకు కర్మఫలాలను ప్రసాదించేవాడవు. కేవలం సంకల్పమాత్రాన ఈ లోకాలను సృష్టించావు. మరి నీవే ఈ లోకాలలో అంతర్యామివై ఉన్నావు. ఆనంద స్వరూపమైన బ్రహ్మాన్ని అందుకోవాలనే జీవులను నీ యందలి యోగశక్తితో ఎల్లప్పుడు కాపాడుతున్నావు. సూర్య మండలం మధ్యభాగంలో ప్రకాశిస్తూ సమస్త లోకాలలో నిండి ప్రకృతికి అతీతంగా ప్రకాశిస్తున్నావు” అంటూ ఆనందమయుడు, దివ్యమంగళ స్వరూపుడు అయిన భగవంతుని భరతుడు శరణు వేడాడు.అంత ఒకనాడు భరతుడు గండకీనదిలో స్నానంచేసి మూడు ముహూర్తాల కాలం నీటిలో నిలబడి ప్రణవం జపిస్తున్నాడు. అప్పుడు నిండు చూలాలైన లేడి ఒకటి నీరు త్రాగాలని ఒంటరిగా నదీ తీరానికి వచ్చింది. అది నీరు త్రాగుతుండగా ఆ నదీ సమీపంలో ఒక సింహం దిక్కులు పిక్కటిల్లే విధంగా భయంకరంగా గర్జించింది. పుట్టుకతోనే భయ స్వభావం గలిగిన లేడి ఆ ధ్వనిని విని అదిరిపడింది. ఆ ఆడజింక తత్తరపాటుతో దప్పిక తీర్చుకోకుండానే అమాంతం పైపైకిఎగిరి ఆవల గట్టుకు ఒక్క దూకు దూకింది. అలా అకస్మాత్తుగా కలిగిన భయంతో లంఘించడంలో దాని గర్భంలోని పిల్ల జారి నదీ జలాలలో పడింది. ఆందోళనగా ఒక్కసారిగా దూకటంలో తల్లి జింక ఆ నదీ తీరంలోని కొండరాతి మీద పడి ప్రాణాలు విడిచింది. అపుడు నదీ జలాలలో విలవిలలాడుతూ మునిగి తేలుతున్న లేడిపిల్లను చూచిన భరతుని హృదయం తల్లడిల్లింది. దయార్ద్రచిత్తుడై అతడా లేడిపిల్లను తన ఆశ్రమంలోనికి తీసికొని వచ్చాడు. ఆ బాలకురంగాన్ని ఎంతో గారాబంగా సాకడం మొదలు పెట్టాడు. దానిని లాలించడం పాలించడంలో, దానిని ముద్దుగా పెంచి పెద్ద చేయడంలో ఆసక్తుడై క్రమంగా భరతుడు తన నిత్యకృత్యాలైన అష్టాంగ యోగాలను, భగవంతుని పూజాకైంకర్యాలను మరిచిపోయాడు. క్రమక్రమంగా అతని నిత్యనైమిత్తిక క్రియాకలాపాలు ఒక్కటొక్కటే మూలబడ్డాయి.భరతుడు తన తపస్సు చెదరిపోవడాన్ని తెలిసికోకుండా యోగాభ్యాసానికి క్రమక్రమంగా దూరమయ్యాడు. ఆ జింకపిల్ల మీది గారాబంతో తన మనస్సులో ఇలా అనుకున్నాడు. పాపం! ఈ జింక పిల్లకు తల్లి లేదు. ఆప్తులు లేరు. దిక్కెవ్వరూ లేని కారణం వల్ల దీనిని ఇక్కడికి తీసుకొని వచ్చాను. నేనంటే ఎంతో ప్రేమతో నన్ను అంటిపెట్టుకొని తిరుగుతున్నది. అందుచేత నాచేత నయినంత వరకు దీనిని తప్పక కాపాడుతాను.శరణు కోరి వచ్చిన ఏ జంతువునైనా కనికరంతో కన్నెత్తి చూచి కాపాడటం కంటే మహాపుణ్యం మరేదీ లేదని మునీంద్రులు చెప్పారు.” 

అని భావించినవాడై భరతుడెంతో ఆసక్తితో, అనురాగంతో ఆ లేడిపిల్లను సాకడం మొదలు పెట్టాడు. కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, అటు ఇటు తిరిగినపుడు, స్నానం చేసేటప్పుడు, సమిధలను పూలను పండ్లను ఆకులను దుంపలను ఏరి తెచ్చుకొనేటప్పుడు, నీరు తెచ్చుకొనేటప్పుడు, దేవతార్చన చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు అతడా బాల హరిణాన్ని తన ప్రక్కనే అట్టిపెట్టుకొనేవాడు. తోడేళ్ళు, నక్కలు మొదలైన క్రూరమృగాలు జింకపిల్లను ఏం చేస్తాయో అని దాని వెనువెంట అడవులకు వెళ్ళేవాడు. రానురాను ఆ జింకపై మమకారం ఎక్కువవుతుంటే దాన్ని భుజాలపై కెక్కించుకొనేవాడు. గుండెలపై పడుకోబెట్టుకొనేవాడు. ఒడిలో చేర్చుకుని బుజ్జగించేవాడు. నిత్య నైమిత్తిక కర్మలు ఆచరించేటప్పుడు కూడా అప్పుడప్పుడు లేచి జింకపిల్ల ఏమయిందో అని చూచేవాడు. అది కనబడగానే మనసు కుదుట పరచుకొనేవాడు. ఒక్కొక్కప్పుడు ఆ లేడిపిల్లను దీవించేవాడు. నానాటికి ముద్దు మురిపాలతో పెంచుకుంటూ దానిమీద మోహం పెంచుకున్నాడు. ఆ సమయంలో…ఆ లేడిపిల్ల పరుగులు తీస్తూ, చెంగున దుముకుతూ, కొమ్ములతో విసురుతూ, అప్పుడప్పుడు దగ్గరికి వస్తూ, కాళ్ళతో త్రవ్వుతూ, గిట్టలతో గీరుతూ మారాం చేసేది. ఆ భరతుని తొడలపై పడుకొంటూ, భుజాలమీద ఎక్కి ఆడుకొనేది. ఆ జింకపిల్ల ఈ విధంగా తనపై బడి ఆట లాడుతూ ఉంటే భరతుడు సంతోషించేవాడు. ఒకనాడు అది ఆశ్రమ స్థలాన్ని విడిచి కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. అప్పుడు…

భరతుడు ఆ జింకపిల్ల కనిపించక పోయేసరికి మనసు చెదరిపోగా ధనం పోగొట్టు వానివలె దిగులు పడ్డాడు. అది ఎడబాసినందుకు బెంగతో మనస్సులో మాటిమాటికి జింకను తలచుకొంటూ దుఃఖించి ఇలా అన్నాడు.ఓ జింకపిల్లా! నీకు అడవిలో క్రూరమృగాల బెడద లేకుండా జాగ్రత్త పడ్డాను. అయినా నన్ను విడిచి పోయావా?” అని భరతుడు మనస్సులో ఆరాటపడి…

తల్లి చచ్చిన జింకపిల్ల దురదృష్టవంతుణ్ణైన నన్ను చేరి ఇప్పుడు విడిచిపోయింది. నేనేం చేయాలి? దానిని మళ్ళీ ఎలా చూస్తాను? చూచి ఎలా దానిని కాపాడుకొంటాను?

అయ్యో! ఈ ఆశ్రమంలో మొలిచిన గడ్డిపరకలను తిని నవనవలాడుతూ అటూ ఇటూ తిరుగుతున్న జింకను సింహం కొట్టి బాధించిందేమో?”ఈ విధంగా భరతుడు లేడిపిల్ల క్షేమంగా ఉండాలని కోరుకుంటూ “ అది ఎప్పుడు వచ్చి నన్ను సంతోషపెడుతుందో? రకరకాలైన తన నడకలతో నన్ను ఎప్పుడు మురిపిస్తుందో? నేను ధ్యానసమాధిలో ఉండగా కొమ్ములతో గోకేది. అలాంటి వినోదాలను మళ్ళీ ఎప్పుడు చూస్తానో? దేవుని పూజకై తెచ్చిన ద్రవ్యాలను తొక్కి వాసన చూసినప్పుడు నేను కోపంగా చూస్తే చప్పున చిన్నబిడ్డలాగా దూరంగా పోయి నిలబడి, నేను పిలిచినప్పుడు వచ్చి నా వెనుక నిలబడేది. దానికి ఇంతటి తెలివి ఎలా అబ్బింది? ఈ భూదేవి ఎంత పుణ్యం చేసుకుందో? ఇటువంటి జింకపిల్ల పాదస్పర్శ వల్ల ముక్తి కాములైన మునుల యజ్ఞవాటిక కావడానికి యోగ్యత సంపాదించుకుంది. ఆ జింకపిల్లను నేనెక్కడ వెదకాలి? భగవంతుడైన చంద్రుడు సింహం బారిన పడకుండా తల్లి, ఆశ్రయం లేని ఆ జింకపిల్లను తీసికొని పోయి పెంచుకుంటున్నాడేమో? పూర్వం నేను పుత్ర వియోగ తాపాన్ని చంద్ర కిరణాలతో శాంతింప జేసుకొనేవాణ్ణి. తరువాత ఈ జింకపిల్ల చంద్రకిరణాల కంటే చల్లనైన తన శరీర స్పర్షతో ఆ సంతాపాన్ని పోగొట్టింది” అనుకుంటూ ఎన్నో విధాలుగా జింకపిల్లను గురించి భావించి బాధపడుతున్న భరతుడు యోగభ్రష్టు డయ్యాడు. భగవంతుణ్ణి ఆరాధించడం మానుకున్నాడు. మృగజాతిలో పుట్టిన జింకపిల్ల మీద మోహం పెంచుకున్నాడు” అని శుకమహర్షి మళ్ళీ ఇలా అన్నాడు.

రాజా! పూర్వం భరతుడు మోక్షమార్గానికి ఆటంకమనే భావంతో విడువరాని కొడుకులు ఇల్లు మొదలైన వన్నీ వదలిపెట్టి తపస్వి అయ్యాడు. కాని ఇంతలో జింకపిల్ల తటస్థపడగా దానిని పెంచడం, లాలించడం, దాని కోరికలు తీర్చడంలో నిమగ్నుడైపోయాడు. కోడెత్రాచు ఎలుక కన్నంలో ప్రవేశించినట్లు వారింపరాని విఘ్నం అతనిలో చోటు చేసికొని భ్రష్టుణ్ణి చేసింది. ఎటువంటి వారికైనా విధిని దాటడం సాధ్యం కాదు. మహర్షులకైనా కర్మబంధాలను తప్పుకొనడం సాధ్యం కాదు. అటువంటప్పుడు సామాన్యుల సంగతి చెప్పేదేముంది?

ఈ విధంగా భరతుడు జింకపిల్ల గురించి బాధపడుతున్న సమయంలో అది తిరిగి వచ్చింది. దానిని చూసి అతడెంతో సంబరపడ్డాడు. అంతలో ఒకరోజు…


హరిణీగర్భంబున జనించుట 


భరతునికి తన చివరిరోజులు దగ్గర పడగా కన్నకొడుకును చూస్తున్నట్లు ఆ జింకవైపే ఆసక్తితో చూస్తూ దానినే తన మనస్సులో భావించుకుంటూ ప్రాణాలు విడిచి ఒక లేడి కడుపున పుట్టాడు. అతనికి పూర్వస్మృతి పోలేదు. ఈ విధంగా భరతుడు జింక కడుపులో పుట్టి కూడా భగవంతుణ్ణి ఆరాధించిన పూర్వ పుణ్యం కారణంగా తాను జింకగా పుట్టడానికి కారణం తెలిసికొని బాధపడి ఇలా అనుకున్నాడు. “రాజులు పొగడుతుండగా, దేవేంద్రునితో సమానమైన వైభవాన్ని అనుభవించి, కొడుకులను రాజులుగా చేసి, మునులు నన్ను రాజర్షి అని గౌరవించగా తపస్వినై ఈ జింకపిల్ల మీద మోహాన్ని పెంచుకొని, విధం చెడి సాటి యోగులలో భ్రష్టుణ్ణి అయ్యాను. ఈ విధంగా హరికథలను వినడం, హరిని తలచుకొనడం, హరిని కీర్తించడం, హరి పూజ చేయడం, హరి భక్తులను అనుసరించడం మొదలైన సత్కర్మలలో క్షణం తీరిక లేని నాకు జింకపిల్ల వల్ల విఘ్నం కలిగింది. మోక్షానికి దూరమయ్యాను” అని లోలోన బాధపడి, తల్లియైన జింకను వదలి, కాలాంజన పర్వతాన్ని విడిచి దట్టమైన సాల వృక్షాలచేత నిండిన సాలగ్రామ సమీపంలో ఉన్న పులస్త్య పులహాశ్రమాలకి చేరుకున్నాడు. ఆ ఆశ్రమాలలో శాంత స్వభావులైన మునులున్నారు. అది ఒక భగవత్ క్షేత్రం. అక్కడికి వచ్చి తన హరిణ దేహాన్ని వదలిపెట్టడానికి తగిన సమయం కోసం ఎదురు చూడసాగాడు. ఎవరితోను సంబంధం లేకుండా ఒంటరిగా ఉంటూ ఎండిన ఆకులు, గడ్డిపరకలు, తీగదుబ్బులు తింటూ తన జింక జన్మకు కారణమైన ఆ నదీ తీర్థంలోనే బ్రతుకు ముగించాలని కోరుతూ గడిపి చివరకు శరీరాన్ని విడిచాడు” అని శుకమహర్షి పరీక్షిత్తుకు చెప్పి ఇంకా ఇలా అన్నాడు.


విప్రసుతుండై జన్మించుట 


మహారాజా! భరతుడు లేడి దేహాన్ని వదలిపెట్టి తరువాతి జన్మలో పరిశుద్ధుడు, మహానుభావుడు, ఓర్పు, ఇంద్రియనిగ్రహం, గొప్ప తపస్సు, వేదాధ్యయనంలో నిష్ఠ మొదలైన సద్గుణాలు కలవాడు, నీతికోవిదుడు అయిన ఆంగిరసుడు అనే బ్రాహ్మణునికి పుత్రుడై జన్మించాడు. పుట్టినది మొదలు సంసార బంధాలకు దూరంగా ఉన్నాడు. కర్మబంధాలను త్రెంచేవాడు, సర్వేశ్వరుడు, అచ్యుతుడు, జననం లేనివాడు అయిన హరి పాదాలను నిరంతరం ధ్యానిస్తూ, ఆయన కథలను వింటూ మళ్ళీ ఎటువంటి ఆటంకం రాకుండా ఆయనను సంస్తుతిస్తూ యశోభరితుడై కాలం గడపసాగాడు. ఆ ఆంగిరసునికి పెద్ద భార్యకు తొమ్మిది మంది కుమారులు, చిన్న భార్యకు ఒక కుమార్తె, ఒక కుమారుడు జన్మించారు. పరమ భాగవతుడు, గొప్ప రాజర్షి అయిన భరతుడు తన హరిణ శరీరాన్ని విడిచి ఈ జన్మలో ఆ బ్రాహ్మణుని చిన్న భార్య కుమారుడై జన్మించాడు. ఇతరులతో సాంగత్యం జన్మపరంపరలకు కారణమౌతుందని భయపడిన భరతునికి శ్రీహరి అనుగ్రహం వల్ల పూర్వజన్మ స్మృతి కలిగింది. అందువల్ల అతడు బంధవిముక్తి కోసం ఉన్మత్తుడుగా, జడుడుగా, అంధుడుగా, చెవిటివాడుగా లోకులకు కనిపిస్తూ జీవితం గడుపుతున్నాడు. అప్పుడు…తండ్రి అయిన ఆంగిరసుడు తన కుమారుడు భరతుని ఎంతో గారాబంగా పెంచాడు. పుట్టు వెంట్రుకలు తీయించడం మొదలైన సంస్కారాలు చేయించాడు. కొడుకు మీది మోహంతో నిత్యం శౌచ సదాచారాలు నేర్పాడు. అవి తనకు ఇష్టం లేకున్నా భరతుడు విధేయతతో వాటిని నేర్చుకున్నాడు. ఈ విధంగా బ్రాహ్మణ కుమారుడైన భరతునికి కర్మలంటే ఆసక్తి లేకపోయినా, బోధించేవాడు తండ్రి కనుక వాటిని పాటించడం తప్పనిసరి అయింది. తండ్రి దగ్గర ప్రణవం, వ్యాహృతులతో కూడిన గాయత్రి మంత్రోపదేశం పొందాడు. ప్రతి సంవత్సరం తప్పకుండా చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాలలో ఇతరులతో కలిసి వేదాధ్యయనం చేసాడు. తండ్రి కుమారునకు శిష్టాచారం నేర్పాలనే లోకాచారం మేరకు తన కుమారుడైన భరతునికి అతని తండ్రి శౌచవిధి, ఆచమనవిధి, అధ్యయనవిధి, వ్రతవిధి మొదలైన నియమాలను, అగ్ని ఆరాధనం, గురు శుశ్రూష వంటి సత్కార్యాలను నేర్పాడు. అయినా కుమారునికి వాటిపట్ల అభినివేశం లేకుండటం గుర్తించి తన ప్రయత్నం యావత్తూ వ్యర్థమయిందని, తన కోరిక నెరవేరలేదని నిరాశ పడ్డాడు. అప్పుడు…ఈ విధంగా తన కుమారునికి సదాచారాలు నేర్పే ప్రయత్నం చేసి కొంతకాలం సంసార జీవితం సాగించి ఆ విప్రుడు అకస్మాత్తుగా పరలోకగతు డైనాడు. ఆ తరువాత…తల్లి తండ్రితో సహగమనం చేయగా, అవినీతిపరులైన సవతి తల్లి కొడుకులు భరతుని గొప్పతనాన్ని తెలుసుకోలేక అతనిని శాస్త్రవిద్యలను చదువనీయలేదు. ఈ విధంగా బ్రాహ్మణ కుమారుడైన భరతుని సవతితల్లి కొడుకులు వేదవిద్యలు చదువనీయకుండా ఇంటిపనులు చేయడానికి నియమించగా…భరతుడు వారు చెప్పిన పనులన్నీ కాదనకుండా పనులలో ఏమాత్రం ఏమరుపాటు లేకుండా చేస్తున్నాడు. కాని ఆ పనులపట్ల అతనికి ఆసక్తి మాత్రం లేకపోయింది.ఈ విధంగా భరతుడు ఇంటిపనులు చేస్తూ ఉండగా మూఢులు, పశుప్రాయులు అయిన జనుల చేత పిచ్చివాడు, మొద్దు, చెవిటివాడు అని పిలువబడుతూ, అందుకు తగినట్టుగానే వారితో మాట్లాడుతూ వారి ఆజ్ఞల మేరకు నడుకునేవాడు. వెట్టిపని, కూలిపని, భిక్షాటన మొదలైనవి చేస్తూ కాలం గడుపుతూ…భరతుడు షడ్రసోపేతమైన మృష్టాన్నమైనా ఇష్టంగానే తినేవాడు. అంతేకాని రుచులకోసం అఱ్ఱులు చాచేవాడు కాదు. ఆ బ్రాహ్మణుడు నిత్యం ఆత్మానందాన్ని పొందుతూ బాహ్యమైన సుఖ దుఃఖాలపైన, దేహం పైన శ్రద్ధ లేకుండా ఉండేవాడు. చలి, వేడి, గాలి, వాన, ఎండలకు లొంగి శరీరం మీద బట్ట కప్పుకోకుండా, ఆబోతు లాగా బలిసి గట్టిపడిన దేహంతో కటిక నేలపై పడుకునేవాడు. మట్టికొట్టుకున్న మాణిక్యంలాగా ప్రకాశిస్తూ బ్రహ్మవర్చస్సుతో కనిపించేవాడు. మాసిన బట్టను నడుముకు చుట్టుకొని, మడ్డి పట్టిన యజ్ఞోపవీతం కలిగి ఉండేవాడు. అజ్ఞానులైన జనులు అతనిని వీడు వేషానికి మాత్రమే బ్రాహ్మణుడని, తెలివితక్కువవాడని అనుకునే విధంగా తిరిగేవాడు. ఏదయినా పని చేసి భరతుడు ఇతరులనుండి ఆహారాదులను తీసుకొనేవాడు కాని ఉచితంగా స్వీకరించేవాడు కాదు. అప్పుడు స్వంత మనుష్యులైన సవతితల్లి కొడుకులు భరతుణ్ణి వ్యవసాయపు పనులలో నియమించారు. ఊక, తవుడు, తెలికపిండి, పొట్టు, మాడిపోయిన పెచ్చులు ఏది పెట్టినా అమృతంగా భావించి తింటూ పొలానికి కాపలా కాస్తుండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు…


 విప్రుడు బ్రతికివచ్చుట 


భరతుడు ఉంటున్న నగరానికి నాయకుడైన భిల్లరాజుకు పిల్లలు లేరు. సంతానం కోసం కాళికాదేవికి నరబలి ఇవ్వడం కోసం ఒక మనుష్యుణ్ణి వెంట బెట్టుకొని పోతుండగా ఆ బలిపశువు తప్పించుకొని పారిపోయాడు. అప్పుడు సేవకులు…(భటులు) ఎంత వెదకినా ఆ వ్యక్తి కనిపించలేదు. చేలో ఒకచోట వీరాసనం వేసికొని పొలానికి కావలి కాస్తున్న బ్రాహ్మణ యోగి భరతుని చూచి నరబలికి తగినవాడని భావించి పట్టుకున్నారు. ఆ విధంగా సేవకులు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుని కాళికాలయానికి తీసికొని వెళ్ళారు. తలంటి పోయడం మొదలైన బలి సంస్కారాలు చేశారు. ఈ విధంగా భరతుణ్ణి అభ్యంజన స్నానం చేయించి కొత్త బట్టలు కట్టించి గంధం, పుష్పాలు, ఆభరణాలు, అక్షతలు మొదలైన వాటితో అలంకరించారు. మృష్టాన్నాదులు తినిపించారు. పూలదండలు, పేలాలు, చివుళ్ళు, పండ్లు మొదలైన ఉపహారాలు సమర్పించారు. డప్పులు మొదలైన పంచ మహావాద్యాలను మ్రోగించారు. బలిపశువును కాళికాదేవి ఎదుట కూర్చోబెట్టారు. ఆ భిల్లరాజు నరబలి ఇచ్చి ఆ రక్తంతో భద్రకాళిని సంతోష పెట్టాలని భావించి, కాళికా మంత్రంతో మంత్రితమైన భయంకరమైన ఖడ్గాన్ని ధరించి తన కోరిక తీర్చుకొనడానికి ఆ భరతుణ్ణి హింసించడానికి సిద్ధపడగా…సర్వజీవరాసులకు మిత్రుడు, పరబ్రహ్మ స్వరూపుడు, వైరభావం లేనివాడు అయిన భరతుడి తేజస్సును చూచి భద్రకాళి భయపడి వణికిపోతూ, భరింపరాని కోపం ముప్పిరి గొనగా హుంకారంతో అట్టహాసం చేసింది. పాపాత్ములు, దుష్టులు, రాజోగుణ తామస గుణాల ప్రేరణతో బ్రాహ్మణుని హింసించే బోయరాజు మీద, అతని సేవకుల మీద విజృంభించింది. వారి తలలను నేల కూల్చింది. నాయకుడైన భిల్లరాజు శిరస్సు చేత పట్టుకొని ఆడుతూ పాడుతూ ఆనంద తాండవం చేసింది.బ్రాహ్మణులలో విష్ణువు ఉంటాడు. అందువల్ల లోకంలో ఎవరైనా సరే వారికి కీడు తలపెడితే తప్పక చెడిపోతారు. ఇంకా…ఆ బ్రాహ్మణ కుమారుడైన భరతుడు ఏమాత్రం భయపడకుండా తనను చంపడానికి వచ్చినవారిలోను, కత్తిలోను, కాళికాదేవిలోను అచ్యుత భావాన్నే ఉంచి. పద్మాక్షుడైన విష్ణువును మనస్సులో నిల్పుకొని, ఏమాత్రం అనుమానం లేకుండా నిశ్చలంగా ఉన్నాడు.తరువాత బ్రహ్మణ శ్రేష్ఠుడైన భరతుడు కాళికాలయం నుండి బయలుదేరి మళ్ళీ పొలం దగ్గరికి వెళ్ళి కాపలా కాస్తున్నాడు.

🙏🙏🙏

సేకరణ


**ధర్మము-సంస్కృతి**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: