25, నవంబర్ 2020, బుధవారం

వ్రత కథ

 క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ.


క్షీరాబ్ధిద్వాదశి కధను బ్రహ్మ దేవుడు ఈ విధంగా చెప్పుచున్నాడు .ఎల్లప్పుడూ క్షీర 

సముద్రంలో శయనించి యుండు విష్ణువు కార్తిక శుద్ధ ద్వాదశి రోజున లక్ష్మీ 

బ్రహ్మ మొదలగు వారితో కూడి బృందావనమున కేగును(వెళ్ళును). కావున ఆ రోజున 

బృందావనమందు ఎవరు శ్రద్దా భక్తులతో విష్ణు పూజ చేయుదురో వారికి దీర్ఘమైన 

ఆయుష్షు , ఆరోగ్యము, ఐశ్వర్యములు కలిగి సంతోషముగా ఉందురు .ఈ వ్రతము 

చేయువారు కార్తిక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడస్తమించిన తరువాత స్నానము 

గాని ,దానము గాని ,పూజ గాని చేసినచో అధిక ఫలమును పొందుదురు. క్షీర సముద్రము

నుండి లక్ష్మీ దేవితో గూడి సమస్తమైన మునులచేత కీర్తించ బడుచున్న పరమేశ్వరుడైన నారాయణుడు ఎచ్చట వాసము చేయునో అట్టి బృందావనమందు పూజనీయుడై, నిత్యుడై, తులసీ సహితుడైనట్టి శ్రీమన్నారాయణ మూర్తిని,బ్రహ్మాది సమస్త దేవతలను శ్రద్దా భక్తి యుక్తులై పూజించియున్నారు . కావున మానవ మాత్రులెవరు ఈవ్రతమును చేసినను సమస్త పాపములు నశించి విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. శ్రీ మహా విష్ణువు వశిష్టాది మహామునులచేత నానా విధ స్తోత్ర పూర్వకంగా తులసీ వనమందు పూజింప బడుతుంటాడు . ఆ కాలమందు ఈ కార్తిక శుద్ధ ద్వాదశినాడు తులసీవనమందు ఎవరు తులసీ సహిత విష్ణువును పూజించు చుందురో వారు సర్వ పాపములను పోగొట్టు కొన్నవారై విష్ణు సాన్నిధ్యము పొందుదురు. మునీశ్వరులైనను, యక్షులు, నారదుడు మొదలగువారు కూడ సమస్త పాపములు నశించుటకు గాను బృందావనములో సన్నిహితుడైన శ్రీ మహా విష్ణువును పూజ చేయుచున్నారు .


పతితుడైనను ,శూద్రుడైనను, మహాపాతకము చేసిన వాడైనను కార్తిక శుద్ధ ద్వాదశి (క్షీరాబ్ది ద్వాదశి ) రోజున తులసీ సహిత విష్ణువును పూజించిన వారి పాపములు అగ్నిహోత్రంలో వేసిన ప్రత్తి పోగువలె నశించును . ఇక బ్రాహ్మణుడైనచో ఫలము ఇట్టిదని చెప్పవలసిన పనిలేదు .తులసీ సహితుడైన విష్ణువును పూజ చేయని వారు పూర్వ పుణ్యములు కూడా పోయి నరకమును పొందుదురు . బృందావనమున సన్నిహితుడైన విష్ణువును పూజించినచో స్వర్గమును పొందుదురు. బృందావనము చాలా మహత్యము కలిగినదని ,అచ్చట పూజించి నట్లయితే విష్ణువునకు అత్యంత సంతోష కరమని పూర్వము దేవతలు ,గంధర్వులు ,ఋషులు మొదలగు వారందరును బృందావనమందు సన్నిహితుడైన శ్రీ మహా విష్ణువును పూజ చేసిరి . కార్తిక శుద్ధ ద్వాదశి రోజున తులసీ సహితుడైన నారాయణ మూర్తిని పూజించని మనుజుడు కోటి జన్మలు పాపిగా చండాలునిగా పుట్టును. ఆ రోజున బృందావనమందు శ్రీ మహా విష్ణువును శ్రద్దా భక్తులతో పూజ చేసినట్లయితే బ్రహ్మ హత్యా మహా పాతకములు కూడ పూర్తిగా పోయి అనేక పుణ్య ఫలములు పొందుదురు. అట్టి మహా పుణ్య కరంబగు నట్టిది గాన తులసీ బృందావన సన్నిధానము నందు శ్రీ మహావిష్ణువును పూజించుట ప్రశస్తమగును . ఈ వ్రతమును చేయువారు (పురుషులు ) స్నాన సంధ్యా వందనములను పూర్తి గావించుకొని , యధావిధిగా నానావిధ వేద మంత్రములచేత గాని ,పురుష సూక్తము చేత గాని శ్రద్దా భక్తులతో పూజ చేయవలెను .ఎలాగంటే ప్రధమమున పంచామృత స్నానం గావించి , ఆ పిమ్మట శుద్దోకములచే అభిషేక మొనర్చి శ్రీ విష్ణువును వస్త్రములచే అలంకరించి నానావిధములగు పుష్పములచేతను , ధూప దీపముల చేతను పూజించి ,భక్తితో నైవేద్యము నిచ్చి ,దక్షిణ తాంబూలములు సమర్పించి ఆ తరువాత కర్పూర నీరాజనములు సమర్పించవలెను . లోకమునందు ఎవరు ఈ ప్రకారము పూజ గావించుదురో వారు సకల పాపములు తొలిగి సమస్త సుఖములు పొందుదురు .ఇంటిలో ఈశాన్య మూలములో గోమయముచే (ఆవుపేడ ) అలికి, రంగుల ముగ్గులతో అలంకరించి పద్మము ,శంఖము, చక్రము, పాదములు ఆ తిన్నె మీద అలంకరించి పూజించి గీత వాద్యములతో వేద ఘోషములతో తులసి కధను వినవలెను. పుణ్యము కోరువారు ఎట్లైన తులసీ వ్రత మహత్యమును వినవలెను. విష్ణు దేవునికి మిక్కిలి ప్రీతి చేయవలెనన్న ద్వాదశి రోజున ,బ్రాహ్మణ సభలో తులసీ వ్రత మహత్యమును విన్నచో దుఃఖములన్నియు నశించి విష్ణు లోకమును పొందుదురు. ఈ పూజా సమయమునందు ధూప దీపములు చూచినా వారు గంగా స్నాన ఫలమును పొందుదురు . నీరాజనము (హారతి ) చూచినచో పాపమంతయు నిప్పులో పడిన ప్రత్తివలె నశించును.

నీరాజనమును నేత్రములందు ,శిరస్సు నందు అద్దుకొనుదురో వారికి విష్ణు లోకము కలుగును. తరువాత బెల్లము, టెంకాయలు , ఖర్జూరము , 

అరటిపళ్ళు ,చెరకు ముక్కలు మొదలగునవి . స్వామికి నివేదనము చేయవలెను. తులసీ సహితుడైన శ్రీ మహా విష్ణువునకు నైవేద్యము సమర్పించి ,బ్రాహ్మణుల శ్రద్దా భక్తులతో పూజించి ,దక్షిణలను ఇవ్వవలెను .ఈ వ్రతమును ఆచరించిన వారి కోటిజన్మల పాపములు నశించి ,లోకమున సమస్త భోగములు అనుభవింతురు. ఈ ద్వాదశి రోజున బృందావన సన్నిధి యందు అవశ్యము దీపదానం చేయవలెను. ఒక దీపము దానము చేసినట్లయిన ఉపపాతకములు నశించును. పది దీపములు దానం చేసిన వారికి శివ సాన్నిధ్యం కలుగును. ఇంతకు మీదట దీపదానం చేయుటవలన స్వర్గాదిపత్యమును పొందుదురు . బ్రహ్మాదులకు దీపదానం ప్రభావం వల్లనే వైకుంటము నందు శాశ్వతమైన నివాసము కలిగెను . 


కార్తిక శుద్ధ ద్వాదశి రోజున బృందావన సన్నిధి యందు దీపదానమును ఎవరు చేయుదురో వారు వైకుంటములో సమస్తమైన భోగముల ననుభవించి విష్ణు సాన్నిధ్యమును పొందుదురు .ఆ దీప దర్శన మాత్రముననే ఆయుష్షు , బుద్ది, బలము, ధైర్యము, సంపత్తులు ,పూర్వ జన్మ స్మరణం మొదలగునవి అన్నియు కలుగును.

దీపమునకు ఆవునెయ్యి ఉత్తమం అనగా మంచిది .మంచినూనె మధ్యమము (అనగా మంచినూనె అయిననూ పరవాలేదు ) ఇతర వన్య తైలములు (అడవిలో లభించు నూనెలు ), ఇప్పనూనె అధమము (పై రెండు నూనెలు దొరకని సమయమున ఈ నూనెలు వాడవచ్చును ) ఆవు నెయ్యితో దీపము వెలిగించి దానము చేసినట్లయిన జ్ఞాన లాభములు, మోక్ష ప్రాప్తియు ను లభించును. మంచినూనెతో దీపము వెలిగించిన కీర్తి సంపదలు లభించును . ఇప్పనూనె ఇతర వన్య తైలములు కార్య సిద్ది కలుగును. ఆవనూనె గాని ,అవిశ నూనెతో గాని దీపము పెట్టిన శత్రువులు నశింతురు . ఆముదముచే దీపముంచిన సంపద ,కీర్తి , ఆయుష్షు క్షీణ మగును. గేదె నెయ్యితో దీపము వెలిగించిన పూర్వము చేసిన పుణ్యము కూడా నశించి పోవును. దానికి స్వల్పముగా ఆవునెయ్యి కలిపి దీపము పెట్టినట్లయిన దోషము లేదు.

ఒక వత్తితో దీపము పెట్టి దానము చేసిన సమస్త పాపములు పోయి ,తేజస్వి గాను ,బుద్ది మంతుడుగాను అగును. నాలుగు వత్తులతో దీపములు పెట్టి దానము చేసిన రాజు అగును. పది వత్తులతో దీపం వెలిగించి దానము చేసిన చక్రవర్తి అగును. ఏబది వత్తులతో దీపము వెలిగించి దానము చేసిన దేవతలలో ఒకడును ,వంద వత్తులతో దీపం వెలిగించి దానము చేసిన విష్ణు సాన్నిధ్యమును పొందును. వేయి వత్తులతో దీపం వెలిగించి దానము చేసిన ఇంద్రుడితో సమాన మైన వాడగును. ఈ దీప దానము విష్ణు క్షేత్రమందు తులసీ సన్నిధి యందు చేసినట్లయిన విష్ణు లోక ప్రాప్తి కలుగును. ఈ వ్రత విధానము మరియు కధ ఈ క్రింది విధముగా కూడా చెబుతారు.


ఈ క్షీరాబ్ది ద్వాదశిన అంబరీషుడు అను విష్ణు భక్తుడు ' ద్వాదశి వ్రతము'ను ఆచరించెను. కార్తిక శుద్ధ దశమి రోజున ,పగలు మాత్రమే భుజించి మరునాడు అనగా ఏకాదశి రోజున యే వ్రతమూ చేయక పూర్తి ఉపవాస ముండి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాత నే భుజించవలయును. అంబరీషుడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు . ప్రతి ద్వాదశి నాడు తప్పక వ్రతం చేసేవాడు ఒక ద్వాదశి నాడు , ద్వాదశి ఘడియలు స్వల్పముగా ఉండెను. అందుచే ఆరోజు పెందలకడనే వ్రతము ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలచెను. ఆ సమయమునకు అచ్చటకు కోప స్వభావుడగు దూర్వాసుడు వచ్చెను.

అంబరీషుడు ఆ మునిని గౌరవించి ,ద్వాదశి ఘడియలలో పారాయణ చేయవలయును గాన త్వరగా చేసి రమ్మని కోరెను. దూర్వాసుడు అందుకు అంగీకరించి వెడలెను.అంబరీషుడు ఎంత సేపు వేచియున్నను దూర్వాసుడు రాలేదు. ద్వాదశి ఘడియలు దాటి పోవుచున్నవి. ఇంటికొచ్చిన దూర్వాసుని భోజనమునకు పిలిచి తరువాత పెట్టక పోయినచో మాట తప్పినట్లయి మహాపాప మగును. అది గృహస్తునకు ధర్మము కాదు .ఆయన వచ్చు వరకూ ఆగినచో ద్వాదశి ఘడియలు దాటిపోవును. వ్రత భంగ మవును. ఆయన రాకుండా నేను భుజించినచో నన్ను శపించును. నాకేమి తోచుట లేదు అని మనస్సులో తలచు చుండెను. భ్రాహ్మణ భోజనము అతిక్రమించరాదు . ద్వాదశి ఘడియలు మించి పోకూడదు . ఘడియలు దాటిపోయిన పిదప హరి భక్తి వదలిన వాడనగుదును అని అంబరీషుడు ఆలోచించి ,బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహా విష్ణువే పోగొట్ట గలడు. అని ద్వాదశి ఘడియలు ఉండగానే భోజనము చేయ నిశ్చయించి ,పండిత శ్రేష్టులతో యోచించి జలపానము చేయుట దోషము గాదని యెంచి , స్వీకరించ బోవునంతలో దూర్వాసుడు వేగముగా కోపముతో అంబరీషుని యొద్దకు వచ్చి ఓరీ ! మధాందా నన్ను భోజనమునకు రమ్మని పిలిచి నేను రాక మునుపే నీవేల భుజించితివి ? ఎంత నిర్లక్ష్యము ? ఎంతటి ధర్మ పరిత్యాగివి. నీవు భోజనము స్వీకరించి హరి భక్తిని అవమానించినావు. బ్రాహ్మణ అవమానమును శ్రీ హరి సహింపడు నీవు మహా భక్తుడునని అతి గర్వము కలవాడ వైనావు. అని నోటికి వచ్చినట్లు తిట్టేను. అంబరీషుడు గడ గడ వణుకుచూ మహానుభావా ! నేను ధర్మ హీనుడను , నా అజ్ఞానం చే ఇట్టి అకార్యమును చేసితిని నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు దయగల వారుగాన నన్ను కాపాడుమని వేడుకొనెను . అంత దూర్వాసుడు దోషికి శాప మివ్వకుండా ఉండరాదని ఘోర శాపము నివ్వబోగా శ్రీమన్నారాయణుడు బ్రాహ్మణ శాపము వృధా కారాదు ,అటులనే తన భక్తునికి ఏ అపాయము కలుగ కూడదని ఎంచి తన సుదర్శన చక్రము అడ్డు పెట్టెను. ఆ సుదర్శనము దూర్వాసుని వెంబడింపగా అతను భీతి చెంది సర్వ మునులను, దేవతలను, బ్రహ్మను, శివుని ఎంత ప్రార్ధించిననూ ఎవ్వరునూ ఆ ఆయుధ భారి నుండి దూర్వాసుని కాపాడ లేక పోయిరి. ఏ లోకములోనివారు తనను రక్షించక పోవుటచే వైకుంట మందున్న మహావిష్ణువు కడకు వెళ్లి జగన్నాధా ! వాసుదేవా ! నేను అపరాధము చేసితిని నీవు నన్ను క్షమింపుము .నీ చక్రాయుధము నన్ను జంపగా వచ్చుచున్నది . దానిని నివారించి నన్ను అనుగ్రహింపుము . నీవు బృగు మహర్షి చేసిన అపరాధమును సహించితివి. నా యందు కూడా నీ దయ కురిపించుము. అని వేడుకొనగా శ్రీ హరి చిరునవ్వు చిరునవ్వు నవ్వి ,దూర్వాసా నేను బ్రాహ్మణ ప్రియుడను నీవు బ్రాహ్మణావతారమెత్తిన రుద్రుడవు. నేను త్రికరణ ములచే బ్రాహ్మణులకు ఎట్టి హాని కలిగించను ప్రతియుగమున గో, దేవ, బ్రాహ్మణ ,సాదు జనంబులకు సంభవించే ఆపదలు పోగొట్టుటకు అవతారములెత్తి దుష్ట శిక్షణ ,శిష్ట రక్షణ గావింతును నీవు అకారణముగా అంబరీషుని శపించితివి నీవిచ్చిన పది శాపములకు అనుభవించెదనని అంబరీషుని ద్వారా బదులు పల్కిన వాడను నేనే. బ్రాహ్మణులను దూషించరాదు. నీవు పోయి అంబరీషుని వద్దకే వెళ్లి వేడుకొమ్మని పంపెను. వెంటనే శ్రీ మన్నారాయణుని వద్ద సెలవు తీసుకుని , అంబరీషుని వద్దకు వచ్చి ధర్మ పాలకా అంబరీషా నన్ను రక్షింపుము నా తప్పును క్షమింపుము . శ్రీ మన్నా రాయణుని వేడుకొనగా నీ దగ్గరకు పంపినాడు . అనిన అంబరీషుడు సుదర్శన చక్రమును ధ్యానింపగా అది శాంతించెను . ఈ రీతిగా దూర్వాసుడు శాంతించి అంబరీషునితో నీ వలన సుదర్శన చక్రమును ,శ్రీ మహావిష్ణువును దర్శించు భాగ్యము నాకు కలిగినది .నీతో భోజనము చేయుట నా భాగ్యము అని దుర్వాస మహా ముని పలికి , అంబరీషుని కోరిక మేరకు పంచ భక్ష్య పరమాన్నములతో విందారగించి అతని భక్తిని ప్రశంసించి అంబరీషుని దీవించి తిరిగి తన ఆశ్రమమునకు వెళ్ళెను.

కామెంట్‌లు లేవు: