🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
*ధార్మికగీత - 91*
*****
*శ్లో:- విద్యా న శోభతే పుంసః ౹*
*యది న స్యాత్ రసజ్ఞతా ౹*
*లవణేన వినా శాకాః ౹*
*సుపక్వా అపి నిష్ఫలా: !!*
*****
*భా:-సమాజంలో నేడు విద్యార్జనా మార్గాలు, మాధ్యమాలు, వనరులు విస్తారంగా అభివృద్ధి చెందాయి. అక్షరాస్యులు, విద్యాధికులు,వివిధ శాస్త్ర పరిశోధనా కుశలురు, విద్యా నిపుణులు కాలానుగుణంగా పెరిగారు. ఉన్నతస్థానాలను అలంకరిస్తున్నారు. అభినందనీయమే. మనిషి ఎన్ని విద్యలను గడించినా, ఆ విద్య ఆధారంగా ఉన్నత పదవులు చేపట్టి, కొన్ని కోట్లు గడించినా అతనిలో "రసజ్ఞత" అనే సుగుణం లోపిస్తే ఆ విద్యకు విలువ గాని, రాణింపు గాని ఉండవు. సభ్య సమాజంలో ప్రేమాదరాభిమానాలు చూరగొనలేడు. వాసనలేని పూవువలె నిరూపయోగంగా ఉండిపోతాడు. ఎలా? పసందైన విందు కోసం అన్నము, కూరలు వండి సిద్ధం చేశారు. నలభీమపాకమని అందరూ ప్రశంసించారు. తీరా చూస్తే కూరల్లో ఉప్పు వేయడం మరచిపోయారు. ఇక రుచేముంటుంది? అందరూ పెదవి విరిచారు. చప్పబడి పోయారు. ఉప్పు లేని కూరల్లాగానే, మంచి చెడు గ్రహింపజాలని ఇంగితజ్ఞానం లేని చదువు కూడా నిష్ఫలమని సారాంశము.అందుకే "రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు" అని తీర్మానించాడు భాస్కర శతక కర్త,*.
*****
*సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి