25, నవంబర్ 2020, బుధవారం

సౌందర్య లహరి**

 **దశిక రాము**


**సౌందర్య లహరి**


**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి భాష్యం**


ఇరవైయవ శ్లోక భాష్యం - ఎనిమిదవ భాగం


ప్రేమగా ఐక్యమవడంలో నున్న మహదానందము కొంతకాలం ఎడబాటు అనంతరం జరిగితే చాలా అనుభవం లోకి వస్తుంది. ఇద్దరు విడిపోయిన తరువాతనే కదా కలవడం సంభవిస్తుంది. అసలు ఎప్పుడూ విడిపోకపోతే కలవడంలో ఉన్న ఆనందం ఎలా తెలుస్తుంది. అందువలననే అద్వైతస్థితి శివశక్తులుగా, కామేశ్వరీ కామేశ్వరులుగా, సృష్టిగా పిల్లలుగా విడిపోయింది. మరో రకంగా చూస్తే ప్రేమ ఆప్యాయతలను అనుభవంలోకి తెచ్చుకోవడానికి మూలకారణమైన పరబ్రహ్మ ఆ తెలుపు - ఎఱుపుగా అయింది. అందువలననే ఎఱుపు శృంగార భావానికి ప్రతీకగా చెప్పబడుతోంది.  


ఈ ప్రపంచ సృష్టికి మూలం ఎఱుపు. కోరికలు లేని అద్వైత స్థితి కోరికచే ఉత్సాహపరచబడింది. అది ఈ సృష్టికి ప్రధాన కారణమయింది. అందువల్లనే ఈ సృష్టి ఎరుపు రంగుగా చెప్పబడుతోంది. సృష్టి కార్యాన్ని నిర్వహించే చతుర్ముఖ బ్రహ్మ ఎరుపురంగు. రక్తప్రసారం జరుగుతున్నంత కాలమే జీవం ఉంటుంది. ఈ నెత్తురు ఎటుపు. అసలు సంస్కృతంలో ఎటుపకు రకవరమని పేరు. కవులేమి చేస్తారు. కోరికతో ఒక గీతం సృజిస్తారు. ఆ అనుభవం పంచడం ద్వారా తన శ్రోతలతో ఒక రకమైన ఐక్యతను సాధిస్తారు. అందువలననే  కవితా శక్తి ఎఱుపుగా అర్థం చేసుకోబడుతుంది. 


దయ అనేది ప్రేమ యొక్క పరిణత స్థితి. పరమాత్మ నుండి ప్రవహించిన ఉన్నత శ్రేణికి చెందిన ప్రేమభావమే దయ. అందువలననే సౌందర్యలహరి 93వ శ్లోకంలో ఆచార్యుల వారు శంభుడనే వర్ణరహితమైన పరబ్రహ్మ ప్రపంచాన్ని రక్షించడానికి అరుణ వర్ణాన్ని పొందారని అభివర్ణిస్తారు. ఆయన తన కరుణ వలన అరుణ అయినారు. అంతేకాదు. ఆ రక్షణ కార్యాన్ని జయవంతంగా నిర్వహించారు. 


“జగత్రాతుం శంభోర్ణయతి కరుణా కాచిదరుణా" - అంతకు ముందు శ్లోకంలో ఆచార్యుల వారు “అమ్మా! నీ అరుణకాంతి శుద్ధ స్ఫటిక సంకాశమైన పరమేశ్వరునిపై పడి ఆయనను శృంగారమూర్తిగా చేస్తోంది” అంటారు.


మనకు సత్త్వం తెలుపు, రజస్సు ఎఱుపు అని తెలుసు. సత్త్వం కంటే రజస్సు తక్కువైనదని కూడా తెలుసు. అయితే ఇక్కడ ఎరుపును ఇంత గొప్పగా చెప్పటం దేనికి? ద్వైత ప్రపంచానికి చెందిన ప్రేమ అనే , లక్షణానికి ఇద్దరు వ్యక్తులు కావలసి వస్తుంది. శుద్ద ధవళము, సాత్త్వికము, అద్వైతము అయిన బ్రహ్మము నుండి ప్రేమ ఆవిష్కరించ బడినపుడు, అది ఉన్నతమైన రాజసిక అరుణంగా అవుతుంది.


సాత్త్వికస్థితిలో శాంతిగా ఉండటంలో సాధా రణంగా వైయక్తికమైన జీవాత్మ ఆనందాన్ని పొందు తుంది. ఒక వ్యక్తి రాజసిక ప్రవృత్తిలో కార్యమగ్నుడై ఉన్నప్పుడు ప్రశాంతత కొరవడుతుంది. మరి పరమశాంతుడైన పరమాత్మ విషయంలో మాత్రం ప్రపంచ వ్యవహారంలో ఉన్నప్ప టికి శాంతి భంగమవదు. స్పటికమును పోలిన ఆయన నిజ రూపం అలానే ఉంటుంది. ఎఱుపు ఆ స్పటికంలో ప్రతిబింబిస్తుంది. కాబట్టి ఆయన విషయంలో మాత్రం పతితమవడమనేది ఉండదు. మనం మామూలు రజోగుణం నుండి ఉత్కృష్ట స్థాయికి చెందిన రజోగుణం ఆవిష్కరింప చేసుకోవాలి. అప్పుడు పరమేశ్వరుడు రజోగుణం యొక్క ఉన్నతమైన స్థితి అయిన దయా, ప్రేమలతో మన ప్రయత్నమునకు తోడై త్రిగుణాతీతమైన స్థితికి చేరడానికి చేరడానికి దోహదం చేస్తాడు. 


(సశేషం)


కృతజ్ఞతలతో🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: