హరి యవతారములు
ఖగవాహను తనయుని కడ
నిగమంబులు దొంగలించి నీరధి జేరన్
తెగవేసెను యా సోమకు
జగపతి శ్రీ విష్ణుమూర్తి జగముల గావన్
సురలసురులు సుధకొరకును
తరియించెడి తరుణమందు సాగరమందున్
గిరి క్రుంగగ పరమేశుడు
కరుణను జూపించి మోయ కఛ్చప మయ్యన్
కడు క్రూరుడు కనకాక్షుడు
పుడమిని వడితోడ బట్టి పోడిమితోడన్
కడలిలొ ముంచగ విష్ణువు
వడితో వధియించె నతని వరలియు కిటిగన్
హరి ఎక్కడ ? చూపించుము
హరియించుదు ననుచు బలుకు హాటకకశిపున్
హరియించను హరి యంతట
నరహరి రూపంబు దాల్చి నఖముల జంపెన్
బలిదనుజుని మదమణచగ
పలు యమరులమొరలు వినియు పటు వటువుగనూ
నిలమూడడుగుల నడిగియు
పలు లోకము లెల్ల గొలిచె పాదము తోడన్
అరయగ రజ తమ గుణముల
ధరనేలుచు బ్రతుకు చున్న దర్పపు నృపులన్
నిరువది మారులు దిరిగియు
పరశువుతో నరికె విష్ణు భార్గవు డయ్యున్
వరబలుడగు దశకంఠుని
ఖర ధూషను కుంభకర్ణు కడతేర్చుటకున్
నరునిగ బుట్టియు విష్ణువు
ధరణిజపతి రాము డయ్యె ధరపులకింపన్
గోపాలునిగను బుట్టియు
పాపాత్ముని కంసు జంపి పార్థుని సఖుడై
"గో" పాలుడు శ్రీవిష్ణువు
కాపాడెను ధర్మ నిరతి ఘనకృష్ణుండై
✍️ గోపాలుని మధుసూదన రావు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి