25, నవంబర్ 2020, బుధవారం

శ్రీ సత్యనారాయణ వ్రత మహాత్మ్యము

 శ్రీ సత్యనారాయణ వ్రత మహాత్మ్యము



అంత సాధువు ,తన యల్లుడనుసరించ 

సకల సంబారములతోడ సరకు తోడ 

సాగి నావను పయనించి సాగరమున 

చేరె రత్నసానుపురంబు క్షేమముగను 74



రత్నసానుపురపు రమణీయ వీధుల 

వర్తకంబు జేసి వాసికెక్కి 

సరకులన్ని యమ్మి సమకూర్చి ధనమును 

సాదు వెంతొ మిగుల సంతసించె 75



తదుపరి సాధువు ధనమున

కదలియు నికటంబులోని కడుయందంబౌ 

సదమలనగరము నందున 

సదనంబొకదానియందు సౌఖ్యత నుండెన్ 76


సాధు వల్లునితోడను సంపదలతొ

చంద్రకేతుమహారాజు యింద్రుపగిది 

పాలనముసేయుచుండెడి పట్నమందు 

వసతి పొందియు నొకయింట వాస ముండె 77


వ్రతమును చేయగ మఱచియు 

సతతము వ్యాపారమందె సాధువు యుండన్ 

యతికుపితు డైన శ్రీహరి 

సతతము వెతలందు మునుగ శాపంబిచ్చెన్ 78


సాధు వత్యంత నిర్లక్ష్య సరళి తోడ 

"సత్యనారాయణస్వామి సద్వ్రతంబు”

మఱచి చేయక నుండుట మదిని దలచి 

స్వామి యత్యంత కుపితుడై శాపమిచ్చె 79


తనదు వ్రతమును మఱచియు ధైర్యమునను 

సంచరించెడి వ్యాపారి సాధువునకు 

" దారుణంబైన దుఃఖంబు దక్కు గాక "

యనుచు శాపంబు నిచ్చెను యాగ్రహమున 80


                                సశేషము …..


✍️ గోపాలుని మధుసూదన రావు 🙏

కామెంట్‌లు లేవు: