**దశిక రాము**
**సౌందర్య లహరి**
**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి భాష్యం**
ఇరవైయవ శ్లోక భాష్యం - అయిదవ భాగం
కుండలినీ యోగాన్ని సాధన చేసే శాక్తయోగులు వేదాంతుల వలే ఈ దేహాన్ని మాయ అని త్రోసిపుచ్చారు. వారికి ఈ ప్రపంచం వ్యవహారమంతా అంబికలీల. ఆవిష్కరించబడిన ఆమె శక్తి విశేషం. ఈ శరీరంలో ఉండాలన్న ఇచ్ఛఉన్నంత వరకు, అంబికలీలను చూడగలిగేందుకు ఈ అమృతము అతనికి ఉపయోగిస్తుంది. కొంతకాలం గడచి అంబికలో లీనమవాలనే సంకల్పం కలిగిన తరువాత ఈ దేహాన్ని త్యజిస్తారు. సర్పాకృతిలో ఆరాధించబడే సుబ్రహ్మణ్యుడు ఇటువంటి అమృతం కురిపిస్తాడు. కుండలినీయోగం గురించి చెప్పకపోయినా యోగశాస్త్రాన్ని మనకు అందించిన పతంజలి ఆదిశేషుని అపర అవతారము. పాములకు జన్మ విరోధియైన జీవి ఇంకొకటున్నది. అది ముంగిస, ముంగిసను సంస్కృతంలో 'నకుల'మని పేరు. అంబిక యొక్క ఒక రూపము నకులేశ్వరి. మహారాజ్ఞి అయిన అంబికకు మంత్రిణి, రాజమాతంగి అని పేర్లుగల మంత్రిణి ఒకరున్నారు. ఆమెకు లలితాంబిక తన సర్వంసహా అధికారాలన్నీ ఒప్పగించి, ఆమె చేత పరిపాలన చేయిస్తోంది. సహస్రనామాలలో “మంత్రిణీ న్యస్త రాజ్యధూ” అన్న నామం ఇందువలననే వచ్చింది.
మధుర మీనాక్షి రాజమాతంగి ఒక్కరే! ఆమెకే నకులేశ్వరి అన్న పేరున్నది. కుండలిని మూలాధారంలో సర్పాకృతిగా నిదురించేటప్పుడు ఆత్మప్రగతికి అవరోధంగా ఉంటుంది. సర్పంతో ఆజన్మ విరోధమున్న ముంగిస పేరు దాల్చిన ఈ అంబిక అటువంటి అవరోధాలను తొలగించి ఆంతరంగిక మైన సంపదలను ప్రసాదిస్తుంది.
మూలాధారమునకు 'కుల' మని పేరు. సౌందర్యలహరిలోనే “కులకుండే స్వపిషి...” అన్న పదములు చూస్తాము. ఆత్మస్పృహ లేకుండా ఆమె మూలాధారంలో నిదురిస్తూ ఉంటుంది. తద్భిన్నమైన పరిస్థితిని సృజించి ఆత్మసాక్షా త్కారానికి దోహదం చేసేది 'నకులి'. 'కుల' పదమునకు వ్యతిరేకము 'నకుల'-
పాములకు సహజ శత్రువులైన గరుత్మంతుడు, నెమలి, ముంగిసలలో గరుత్మంతునకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఆయన పాములను సంహరించడమే కాదు. అమృతం తెచ్చినవాడు కూడా! సర్పజాతికి తల్లి అయిన కద్రువ గరుత్మంతునికి సవతి తల్లి. ఆమె పందెంలో కపటం చేసి తన సవతి అయిన వినతను (గరుత్మంతుని తల్లి) దాసిగా చేసుకొంది. తన తల్లి దాస్యవిముక్తికై ప్రార్థించిన గరుత్మంతునికి ఆమె దానికై ఒక షరతు విధించింది. ఆ షరుతు మేరకు సర్పములు తాగడానికి గాను దేవేంద్రునితో పోరి గరుత్మంతుడు అమృతకలశాన్ని తెచ్చి కద్రువకు సమర్పించాడు. చివరికి అది సర్పమునకు దక్కలేదు. సరికదా గరుత్మంతుడే పాములను తినడం మొదలుపెట్టాడు.
గోదాదేవి అవతరించిన శ్రీవల్లిపుత్తూరు క్షేత్రంలో గరుత్మంతునకు 'అమృతకలశం' అని పిలవబడే తిను బండారము నైవేద్యంగా సమర్పిస్తారు. లోపల ఉన్న పూర్ణము (తీపి)ను అమృతంగా, చుట్టి ఉన్న తోపుపిండి కలశంగాను భావించాలన్నమాట. శ్రీవల్లిపుత్తూరులో మిగతా క్షేత్రాలలో వలె గరుడాళ్వారు విష్ణుమూర్తికి ఎదురుగా కాక, గోదాదేవికి సమానంగా ప్రక్కనే ఉండటం విశేషం. శ్రీరంగనాయకుడు గోదాదేవిని తనలో ఐక్యం చేసుకొన్న తరువాత విష్ణుచిత్తుడు స్వామిని, “నాకు పెంపుడు కూతురిని ప్రసాదించినట్లే ప్రసాదించి, నీవే తీసుకుని మళ్లీ నన్ను ఒంటరిని చేయడం న్యాయమా' అని ప్రార్థించాడట. స్వామి గోదాదేవిని శాస్త్రోక్తంగా వివాహమాడి ఆమెతో కూడి నీ కంటికి ఎదురుగా విలిపుత్తూరులో నివాసముంటానని అనగ్రహించాడు. స్వామి నోట మాట వెలువడినదే తడవుగా గరుత్మంతుడు కనురెప్ప పాటు కాలంలో వారిని శ్రీవిల్లిపుత్తూరు చేర్చాడు. ఈ కైంకర్యానికి ఆనందించిన స్వామి గరుత్మంతుని గోదాదేవితో తన ప్రక్కనే ఉంచుకున్నాడు. పెరియాళ్వారుగా పేరుపొందిన విష్ణుచిత్తుడు గరుత్మంతుని అవతారంగా భావించబడుతున్నాడు.
(సశేషం)
కృతజ్ఞతలతో🙏🙏🙏
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
#ParamacharyaSoundaryaLahariBhashyam
🙏🙏🙏
సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి