20, నవంబర్ 2020, శుక్రవారం

త్రిపురారహస్య జ్ఞానఖండసారము**

 **దశిక రాము**


**త్రిపురారహస్య జ్ఞానఖండసారము**


అమ్మదయ గలవారు మాత్రమే దీనిని చదవగలరు

 

PART-14


ఆయన ప్రసన్నుఁడై భార్గవుని కరుణించి నవ్వుచు ఇట్లనెను.''ఎవరు నీవు అని ప్రశ్నించితివి గదా? వినుము. ''నీవు'' అనుపదము యొక్క అర్థము నీకు తెలిసినచో నీప్రశ్న, పిండియైనదానిని మరల పిండిచేయుటవలె (పిష్టపేషణము) వ్యర్థము. ఆపదముయొక్క అర్థము నీకు తెలియనిచో నీమాట అర్థము లేనిదగును. ఈశరీరమును ఉద్దేశించి ''నీవు'' అనుపదమును ప్రయోగించితి నందు వేని. ఇందులోనున్నచైతన్యము నీకు గోచరించ లేదన్నమాట మఱి అన్నమయమైన యీశరీరము నీకు ప్రత్యక్షముగా కన్పించుచున్నది గదా! ప్రశ్నింపవలసినసంశయ మేమున్నది? కాఁబట్టి నీప్రశ్న పేరునకు మాత్రమే సంబంధించుచున్నది. కాని పేరు శరీరముతోపాటు సహజముగ సిద్ధించుట లేదు. అది అనేక విధముల కల్పింపఁబడుచున్నది. జనుల సముదాయములో ఒకపేరు ఒకశరీరమునందే నియమితమై యుండదు. కావున నీవు నన్ను చక్కఁగా ప్రశ్నించినచో సమాధానము చెప్పుదును''

ఆమాటలకు సమాధానము దొఱకక పరశురామునకు వాక్కుతో పాటు బుద్ధియొక్క పౌరుషము కూడ స్తంభించెను. అతఁడు సిగ్గువడి ఆయోగీశ్వరునకు ప్రణమిల్లి ఇట్లు ప్రార్థించెను. ''మహాపురుష! నీవు చెప్పినదానినిబట్టి ఎట్లు ప్రశ్నింపవలయునో నాకు తెలియుట లేదు. నేను అకల్మషుఁడనై నీకు శిష్యుఁడనై యున్నాను. ఆప్రశ్న యేదో నీవే తెలిసికొని నాకు బోధింపుము''. అప్పు డాయన మధురములైన మాటలతో తన వృత్తాంతమును చెప్పస నారంభించెను. ''భార్గవా, నేను ఆంగిరసుఁడను; బృహస్పతికి తమ్ముఁడను; మూఁడులోకములయందును సంవర్తుఁడని ప్రఖ్యాతుఁడనై యుంటిని నాస్థితిని చెప్పెదను శ్రద్ధతో వినుము. పూర్వము అన్నతో నాకు విద్వేషము కలిగెను. దానిచేత నాకు నిర్వేదము పుట్టి గురువైన దత్తాత్రేయునిచే చక్కఁగా బోధింపఁబడి ఈస్థితిని పొందితిని. ''ఆత్మయే అఖిలము; ఇది యంతయు దానివిలాసము'' అని తలంచి శంకారహితుఁడనై అభయమైన మార్గము నాశ్రయించి, దారముచేత కదలింపఁబడు బొమ్మవలె సంచరించుచున్నాను''.

అదివిని రాముఁడు అంజలించి, ''మహాత్మా! సంసారభయపీడితుఁడను దీనుఁడను అయిన నన్ను అనుగ్రహించి నిర్భయము శుభమునైన మార్గమునందు ప్రవేశ##పెట్టుము''. అని ప్రార్థించెను. దయార్ద్రమృదయుడైన యాముని మరల నిట్లనెను. ''వత్సా! సర్వార్థ సంగ్రహమైన సారమును చెప్పెదను వినుము. దొంగలు ప్రబలముగా నున్న మార్గమును ఒకానొకఁడు దైవమోహితుఁడై నిర్భయమైన దారి అనుకొని ముందుకు పోవుచున్నట్లు నీవు నడచుచున్న మార్గము కూడ మిగుల అనర్థదాయకము, భయంకరము. ఆజ్ఞానమువలన దొంగలున్న మార్గమున ప్రవేశించినవాఁడు అడుగడుటున భయపుడుచు కష్టపడుచు క్షేమము కలుగు ననునాశతో ముందుకు పోవుట యెట్టిదో సంసార మార్గమున వర్తించుచుండుటయు అట్టిదే. మార్గము నెఱింగిన యొకానొక మహనీయునిచే బోధింపఁబడి దొంగలున్న మార్గమున వదలి మంచి మార్గమున పయనించువాఁడు దుష్టమార్గమున పోవుచున్న వారిని జూచి నవ్వుకొనుచుండును. PART-14

🙏🙏🙏

సేకరణ


**ధర్మము-సంస్కృతి**

https://chat.whatsapp.com/D9gWd7SgdmG2Rbh7b3VXl9


**ధర్మో రక్షతి రక్షితః**

https://chat.whatsapp.com/KCfWMHlFNsM1PTptFf2RwR

కామెంట్‌లు లేవు: