20, నవంబర్ 2020, శుక్రవారం

శ్రీమద్భాగవతము

 **దశిక రాము**


**శ్రీమద్భాగవతము**


 పంచమస్కంధం యొక్క ప్రధామాశ్వాసం. -3


ఋషభుని జన్మంబు


రాజైన నాభి తన భార్య అయిన మేరుదేవి సమేతంగా సంతానం కోసం శ్రద్ధాభక్తులతో యజ్ఞపురుషుడైన వాసుదేవుణ్ణి పూజించి…ఇంకా ప్రవర్గ్యా లనబడే యజ్ఞకార్యాలను శ్రద్ధతో, పరిశుద్ధ ద్రవ్యాలతో, ఉచిత ప్రదేశంలో, కాలానుగుణంగా, విధివిహితంగా మంత్రవేత్తలైన ఋత్విక్కులతో, భూరి దక్షిణలతో ఆచరించి పరమేశ్వరుని మెప్పించాడు. ఎవరికీ సులభంగా ప్రసన్నుడు కాని విష్ణువు భక్తవాత్సల్యంతో, ప్రకాశవంతమైన అవయవ సౌష్ఠవంతో హృదయంలో తాను సదా నెలకొని ఉన్నప్పటికీ ప్రత్యక్ష రూపంలో కనులకు పండువుగా, మనసుకు నిండుగా తన స్వరూపాన్ని అతనికి చూపాలనుకొని,అప్పుడు ప్రకాశమానాలైన చతుర్భుజాలతో; పట్టు పీతాంబరంతో రమణీయాలైన శ్రీవత్సం, కౌస్తుభమణి, శ్రీదేవి విరాజిల్లే వక్షఃస్థలంతో; శంఖం, చక్రం, గద, పద్మం, ఖడ్గం మొదలైన దివ్యాయుధాలతో; సాటిలేని నవరత్నాల కాంతులను వెదజల్లే బంగారు కిరీటంతో; మకర కుండలాలు, మొలనూలు, మణులు చెక్కిన స్వర్ణహారాలు, బాహుపురులు, కాలి అందెలు ప్రకాశిస్తుండగా లక్ష్మీపతి ఆ దంపతుల ముందు ప్రత్యక్షమైనాడు. అప్పుడు ప్రకాశమానాలైన చతుర్భుజాలతో; పట్టు పీతాంబరంతో రమణీయాలైన శ్రీవత్సం, కౌస్తుభమణి, శ్రీదేవి విరాజిల్లే వక్షఃస్థలంతో; శంఖం, చక్రం, గద, పద్మం, ఖడ్గం మొదలైన దివ్యాయుధాలతో; సాటిలేని నవరత్నాల కాంతులను వెదజల్లే బంగారు కిరీటంతో; మకర కుండలాలు, మొలనూలు, మణులు చెక్కిన స్వర్ణహారాలు, బాహుపురులు, కాలి అందెలు ప్రకాశిస్తుండగా లక్ష్మీపతి ఆ దంపతుల ముందు ప్రత్యక్షమైనాడు. ఈ విధంగా ప్రత్యక్షమైన భగవంతుణ్ణి ఋత్విక్కులు చూసి పెన్నిధిని దర్శించిన పేదలవలె సంతోషంతో తలలు వంచి ఇలా స్తోత్రం చేశారు. నీవు పరిపూర్ణుడవై కూడా మమ్మల్ని మరచిపోకుండా మా పూజలను స్వీకరిస్తావు. పెద్దలు మాకు చెప్పిన విధంగా నీ పాదపద్మాలను సేవిస్తాము.

నీవు పరిపూర్ణుడవై కూడా మమ్మల్ని మరచిపోకుండా మా పూజలను స్వీకరిస్తావు. పెద్దలు మాకు చెప్పిన విధంగా నీ పాదపద్మాలను సేవిస్తాము. మహాత్మా! మే మిప్పుడు నీ మహిమలు తెలిసి సంస్తుతి చేయడం లేదు. పెద్దలు మాకు ఏ విధంగా ఉపదేశించారో ఆ విధంగా ప్రస్తుతి చేస్తున్నాము. ఇంకా సంసారంలో మునిగి తేలే వారికి నీవు పట్టుబడవు. నీవు ఈశ్వరుడవు. ప్రకృతి కంటే జీవుని కంటే భిన్నమయినవాడవు. పరమ పురుషుడవు. మేము పంచభూతాల సృష్టికి లోనైన నామరూపాలను ధరించిన వాళ్ళం. అటువంటి మాకు నీ తత్త్వాన్ని నిరూపించడం సాధ్యం కాదు. సకల జీవరాసుల పాపసమూహాలను తొలగించడం నీ స్వభావం. అటువంటి నీ ఉత్తమ గుణాలలో ఏదో ఒక అంశమే కాని సమస్త గుణాలను నిరూపించడం ఎవరికీ ఏమాత్రం సాధ్యం కాదు. నీ భక్తులు భక్తితో గద్గద స్వరంతో సంస్తుతిస్తూ, నీ కర్పించే నిర్మల జలం, చిగురుటాకులు, తులసీదళాలు, దూర్వాంకురాలు మొదలైన వాటితో నీవు సంతృప్తి పడతావు. అంతేకాని నానావిధ ద్రవ్యాలు సంతరించికొని మహా వైభవంతో చేసే అశ్వమేధాది యాగాలు కూడా నీకు సంతృప్తిని కలిగించవు. స్వాభావికంగానే నీవు సర్వకాలాలలోను సాక్షాత్కరిస్తావు. నీవు సర్వాతిశాయివి. సమస్త పురుషార్థాలు నీవే. పరమానంద స్వరూపుడవైన నీకు యజ్ఞయాగాదుల వల్ల తృప్తి లేకున్నా మా కోరికలను తీర్చుకోవడానికి మేము యజ్ఞాలను చేస్తున్నాము” అని ఇంకా ఇలా అన్నారు. మూర్ఖులమైన మాకు ఏది మంచిదో ఏది కాదో మాకే తెలియదు. అయినా ఎంతో దయతో మమ్మల్ని కాపాడి ఇహపరాలకు తగిన సకల సుఖాలను నీవు మాకు ప్రసాదిస్తున్నావు. ఇప్పుడు మేము నీకు సంతృప్తి కలిగేటట్లు ఇష్టమైన పూజలు చేయక పోయినా మా మీద కరుణాకటాక్ష వీక్షణాలను ప్రసరింప జేసి ప్రసన్నుడవైనావు. కోరిన కోరికలను అనుగ్రహించేవాడా! నీలమేఘం వంటి శరీరచ్ఛాయ కలవాడా! వరమివ్వడానికి నీవు మా ముందు సాక్షాత్కరించావు. నిన్ను సందర్శించడానికి కాని సంస్తుతించడానికి కాని మాకు సాధ్యమౌతుందా?.ఇంకా మునులు కోరికలు లేనివారు. సునిశ్చితమైన జ్ఞానం కలవారు. దోషాలు లేనివారు. భగవంతుని ప్రతిరూపాలు. ఆత్మారాములు. అలాంటి మునులకు స్తోత్రార్హుడ వైనప్పటికీ అందరిపట్ల అనుగ్రహం చూపుతున్నావు. కాలు జారినప్పుడు, క్రింద పడ్డప్పుడు, తుమ్మినప్పుడు, ఆవులించినప్పుడు, జ్వరంతో పీడింపబడుతున్నపుడు, చావుకు చేరువ అయినప్పుడు, మా మీద మాకే అధికారం తప్పినప్పుడు మా పాపాలను పోగొట్టే నీ దివ్యనామాలు మా నోటివెంట వెడలే విధంగా అనుగ్రహించు. ఈ రాజర్షి అయిన నాభి నీకు సమానమైన సంతానం కావాలని నిన్ను పూజించాడు. కోరిన కోరికలను, స్వర్గాన్ని, మోక్షాన్ని సైతం ఇవ్వగల నిన్ను ఇలా అడగడం ధనం కోసం ధనవంతుని దగ్గరకు వెళ్ళి ఊక అడిగినట్టుంది. మోక్ష ప్రదాతవైన నిన్ను సంతానం కోసం ప్రార్థిస్తున్నాడు. మీ మాయ దాటరానిది. అలాంటి మాయకు లోబడి ఇంద్రియ కాంక్షలకు లోనుకాని వా డెవడు? ప్రతి పనిని ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని చేసేవాళ్ళం మేము. గర్వాంధులము. అయినా నిన్ను ఆహ్వానించిన మా అపరాధాన్ని మన్నించు. మమ్ము అనుగ్రహించు” అని నమస్కరించారు. అప్పుడు సర్వేశ్వరుడు జంబూద్వీపంలోని ఒక వర్షానికి అధిపతి అయిన నాభి ఋత్విక్కులతో కలిసి చేసిన వందనాలు అందుకొంటూ దయతో ఇలా అన్నాడు.మునులారా! నన్ను వేదమంత్రాలతో ప్రస్తుతి చేసి సకల లక్షణాలలో నాకు సాటి అయిన కొడుకును నాభికి ప్రసాదించవలసిందిగా ఎంతో కుతూహలంతో నన్ను కోరారు. స్వర్గాది లోకాలలో నాకు సాటి రాదగ్గ కుమారుడు ఎక్కడా కనిపించడు. నాకు సాటి నేనే అని మీరు తెలుసుకొనండి.అంతేకాక బ్రాహ్మణులు నాకు ముఖం వంటివారు కనుక వారి మాట దాటడానికి వీలుకానిది. మీరు నాకు సమానుడైన కుమారుణ్ణి కోరారు. అందుచేత ఈ నాభి మహారాజు భార్య అయిన మేరుదేవికి నేనే కొడుకునై జన్మిస్తాను” అని నాభి, మేరుదేవి చూస్తుండగా యజ్ఞంలో అంతర్ధాన మయ్యాడు. ఆ తర్వాత దిగంబరులు, తాపసులు, జ్ఞానులు, ఊర్ధ్వరేతస్కులు అయిన నైష్ఠికులకు యోగధర్మాలు బోధించడానికి నాభి మీద దయతో విష్ణువు మేరుదేవి గర్భంలో ప్రవేశించాడు. అప్పుడు…

సమస్త శుభలక్షణాలు కలవాడు, శమదమాది గుణ సంపన్నుడు, మేరుధీరుడు అయిన శ్రీహరి మేరుదేవికి కుమారుడుగా అవతరించాడు. సమస్త జనులు సంతోషించారు.పుట్టిన శిశువు వెలుగులు వెదజల్లుతూ ఉండడం గమనించి, అతడు బలవంతుడని, పరాక్రమవంతుడని, శౌర్య కలవాడని అర్థం చేసికొని నాభి తన కుమారునికి “ఋషభుడు” అని పేరు పెట్టాడు

🙏🙏🙏

సేకరణ


**ధర్మము-సంస్కృతి**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: