20, నవంబర్ 2020, శుక్రవారం

దుర్గా సప్తశతి

 *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 20  / Sri Devi Mahatyam - Durga Saptasati - 20 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


*అధ్యాయము 5*

*🌻. దేవీ దూతసంవాదం - 5 🌻*


96. ధనేశ్వరుడైన కుబేరుని నుండి తేబడిన మహాపద్మండే అనే నిధి ఇచట ఉంది. కింజల్కినిష్ అనే ఎన్నటికీ వాడిపోని తామరపూదండను సముద్రుడు ఇచ్చాడు.


97. వరుణుని ఛత్రం, బంగారం కురిసేది, మీ ఇంట ఉంది. పూర్వం ప్రజాపతిదైన రథోత్తమం కూడా ఇచట ఉంది. 


98. ప్రభూ! యముని శక్తిరూపాయుధమైన ఉత్కాంతిదం* నీవు తెచ్చావు. సముద్రరాజు యొక్క పాశం నీ సోదరుని సొత్తులో ఒకటై ఉంది.


99. సముద్రంలో పుట్టిన సమస్తరత్నజాతులు నిశుంభుని వద్ద కలవు. అగ్నిచేత పరిశుద్ధమొనర్పబడిన రెండు వస్త్రాలను అగ్నిహోత్రుడునీకు ఇచ్చాడు.


100. అసురనాథా! ఇలా నీవు రత్నాలను అన్నిటిని తెచ్చావు. శుభమూర్తి అయిన ఈ స్త్రీ రత్నాన్ని నీవెందుకు తీసుకురాలేదు?”


101-102. ఋషి పలికెను : చండుడు, ముండుడు చెప్పిన ఈ మాటలను విని శుంభుడు సుగ్రీవ మహాసురుని దేవి వద్దకు దూతగా పంపించాడు.


103. అతడిలా చెప్పాడు: “నీవు పోయి ఆమెతో నా మాటలుగా ఇలా చెప్పు. ఆమె త్వరితంగా నా వద్దకు సంప్రీతితో వచ్చే విధంగా ఈ కార్యాన్ని నిర్వహించు.”


104. పర్వతంపై, అతిసుందర తావున ఉన్న ఆ దేవి వద్దకు అతడు పోయి ప్రియ మధుర వాక్కులతో ఆమెతో పలికాడు.


105–106. దూత పలికెను : “దేవీ! రాక్షసప్రభువైన శుంభుడు ముల్లోకాలకు సార్వభౌముడు. ఆయన దూతగా పంపబడి నీ సన్నిధికొచ్చాను.


107. సర్వదేవతలు ఎవరి ఆజ్ఞను సదా శిరసావహిస్తారో, అసుర వైరులందరినీ ఎవరు ఓడించారో, ఆయన చెప్పిన మాటలను ఆలకించు:


108. ముల్లోకాలన్నీ నావి. దేవతలు నాకు వశవర్తులు. వారి యజ్ఞభాగాలన్ని నేను వేర్వేరుగా అనుభవిస్తున్నాను.


109-110. ముల్లోకాలలో గల శ్రేష్ఠమైన రత్నాలన్ని నా అధీనంలో ఉన్నాయి. అలాగే ఇంద్రుని వాహనమైన గజరత్నం (ఐరావతం) కూడా నా చేత తేబడింది. పాలమున్నీ చిలికినప్పుడు పుట్టిన ఉచ్చైశ్రవమనే అశ్వరత్నాన్ని దేవతలు నాకు ప్రణామపూర్వకంగా సమర్పించారు.


సశేషం....

🌹 🌹 🌹 🌹

కామెంట్‌లు లేవు: