మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..
*అలక..అనునయం.*
"స్వామివారి దగ్గర కొన్నాళ్ల పాటు ఉండాలని వచ్చానండీ..నేను చేయదగ్గ పనులేమైనా వుంటే..చేసి పెడతాను..ఇక నా శేష జీవితం ఈ స్వామివారి సన్నిధిలోనే గడచిపోవాలి.." అన్నారు పామూరు నుంచి వచ్చిన షేక్ బాషా గారు..
ఆయన వయసు డెబ్భై ఏళ్ళు..పైగా మధుమేహం తో బాధ పడుతున్నారు..రోజూ రెండుపూటలా ఇన్సులిన్ తీసుకోవాలి..అటువంటి మనిషికి ఏ పనులు చెప్పగలం?..ఆయనను నెత్తిన పెట్టుకొని చూసే కుమారులున్నారు..ఇద్దరు కొడుకులూ వివాహాలు చేసుకొని..హాయిగా వుంటున్నారు..మనుమలు, మనుమరాళ్లు..ఇల్లంతా సందడిగా ఉంటుంది..మరి ఈయన హఠాత్తుగా మందిరానికి వచ్చి ఇక్కడ కొన్నాళ్ళు వుంటానంటున్నాడు..ఏం జరిగింది?..పరి పరి విధాల ఆలోచించాను నేను..
బాషా గారి కుటుంబం మొత్తం శ్రీ స్వామివారికి భక్తులు..ప్రతి రెండు మూడు నెలల కొకసారి మొగలిచెర్ల కు వచ్చి..శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకొని వెళుతుంటారు..ఏదైనా శుభకార్యం అనుకుంటే..ముందుగా శ్రీ స్వామివారి కి అర్చన చేయించుకొని వెళతారు..వాళ్ళు ఏరోజూ మతం గురించి పట్టించుకోలేదు..అందరినీ ఆప్యాయంగా పలకరిస్తారు..తమ కుటుంబంలోని అందరి పేర్లతో అర్చన చేయించుకుంటారు..స్వామివారికి నైవేద్యంగా పొంగలి పెట్టుకొని వస్తారు..శ్రీ స్వామివారి సమాధి వద్దకు నన్ను అనుమతి అడిగి..ఆ తరువాతే అక్కడికి వెళ్లి నమస్కారం చేసుకుంటారు..చాలా వినయంగా..అత్యంత భక్తితో ప్రవర్తిస్తారు..ఆ కుటుంబం ఎప్పుడు దర్సనానికి వచ్చినా..మా సిబ్బంది వారిని నేరుగా గర్భాలయం వద్దకు పంపిస్తారు..
బాషా గారికి కావాల్సిన ఆహారం ఏర్పాటు చేయమని మందిరానికి వంటమనిషి తో చెప్పి..ఆయనకు ఒక చిన్న గది కేటాయించాము..సాయంత్రం గా బాషా గారి వద్ద కూర్చుని.."ఇలా మీరు ఒక్కరే వచ్చారు..మీ అబ్బాయిల సహాయం తీసుకోకపోయారా?..మీరేదో మనసులో బాధ పెట్టుకుని ఇక్కడికి వచ్చినట్లుగా నాకు తోస్తున్నది..అదేదో చెప్పండి..వీలైతే పరిష్కరిస్తాను.." అని అనునయంగా అడిగాను..
"ఏమీ లేదండీ..ఇంట్లో వాళ్లు నా పట్ల సరిగా ప్రవర్తించటం లేదు..నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు..నాకు మనసుకు కష్టం వేసింది..అందుకని వాళ్లకు చెప్పకుండా ఇక్కడికి వచ్చేసాను..మీరూ వాళ్ళతో చెప్పొద్దు..నేను ఆ దత్తయ్య పాదాల దగ్గరే వుంటాను..ఇంత ఆహారం పెట్టండి చాలు!.." అన్నారు..
నాకు విషయం పూర్తిగా అర్ధమైంది..తరాల మధ్య వచ్చే అంతరాయం ఈ కుటుంబంలో కూడా వచ్చింది..పెద్దవాళ్ళ అభిప్రాయాలకు..పిల్లల ఆలోచనలకు తేడా ఉంటుంది..అటువంటి సందర్భాలలో..పెద్దల మనసు నొప్పించకుండా..తమ పనులు చక్కబెట్టుకునే నేర్పు కావాలి..కొద్దిగా తేడా వచ్చినా..ఫలితం వేరుగా ఉంటుంది..బాషా గారు బాగా మొండితనం తో వున్నారు..పిల్లల దగ్గరకు వెళ్ళను అని భీష్మించుకుని వున్నారు..ఆయన కుమారులిద్దరికీ కూడా తండ్రి అంటే అత్యంత గౌరవం తో కూడిన ప్రేమ ఉందని నాకు తెలుసు..ఎందుకనో ఈ పెద్దాయనే కొద్దిగా తొందరపడ్డాడని అనిపించింది..
"ఈ సమస్య పరిష్కరించు స్వామీ.." అని ఆ స్వామివారికి విన్నవించుకొని..ఒక నమస్కారం చేసి వచ్చేసాను..ఆరాత్రి గడిచి పోయింది..ఉదయం పది గంటల సమయం లో బాషా గారి పెద్దకుమారుడు నాయబ్ రసూల్ వచ్చారు..నేరుగా నా దగ్గరికి వచ్చి.."నిన్నటి నుండి నాన్నగారు కనబడలేదండీ..అంతా వెతికాము..తెల్లవారుఝామున కొద్దిగా నిద్ర పట్టింది..శ్రీ స్వామివారు ఇక్కడికి రమ్మని పిలిచినట్లు అనిపించింది..ఒకసారి కాదు..రెండు మూడు సార్లు అలా అనిపించింది.. తెల్లవారగానే స్నానం చేసి..ఇలా నేరుగా వచ్చాను.."అన్నారు..
వారిని కూర్చోమని చెప్పి..వాళ్ళ నాన్నగారు ఇక్కడ క్షేమంగా ఉన్నారని తెలిపాను..నాయబ్ రసూల్ ముఖం సంతోషంతో వెలిగిపోయింది.."శ్రీ స్వామివారు మాకు అన్యాయం చేయడు!..చేయిపట్టి నడిపిస్తాడు మమ్మల్ని.."అన్నారు..బాషా గారిని పిలిపించాను..కుమారుడిని చూసిన బాషా గారు ఎటువంటి భేషజానికి పోలేదు..ఆప్యాయంగా కౌగలించుకున్నారు..నిన్నటి కోపం ఎటుపోయిందో తెలీదు..ఇద్దరూ కలిసి శ్రీ స్వామివారి సమాధి వద్ద నమస్కారం చేసుకున్నారు..
"నిన్న రాత్రి శ్రీ స్వామివారు నన్ను కోప్పడ్డట్లు గా అనిపించింది..నేను పొరపాటు చేశానని అర్ధం అయింది..అందుకే అబ్బాయి రాగానే అతనితో వెళ్లాలని నిర్ణయించుకున్నాను..ఇంతకూ మీరు అబ్బాయికి కబురు పెట్టారా?.." అన్నారు బాషా గారు..
"మీరన్నది నిజమే..శ్రీ స్వామివారే మిమ్మల్ని కోప్పడ్డారు..మీ అబ్బాయిని పిలిపించారు..మేము కేవలం ప్రేక్షకులమే.."అని చెప్పాను..బాషా గారి కళ్ళలో నీళ్ళు తిరిగాయి..మరొక్కసారి శ్రీ స్వామివారికి నమస్కారం చేసుకొని..తన పెద్దకుమారుడు నాయబ్ రసూల్ వెంట పామూరు వెళ్లిపోయారు..
తన భక్తుల మధ్య ఎడబాటు రాకుండా శ్రీ స్వామివారు చల్లటి చూపుతో అనుగ్రహించారు..
సర్వం..
దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523114.. సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి