26, నవంబర్ 2020, గురువారం

యజ్ఞం

*7-వేదములు📚((((((((((🕉)))))))))) ఆచార్య వాణి🧘‍♂️* 🕉🌞🌏🌙🌟🚩 🔥ఓంశ్రీమాత్రే నమః🔥 అద్వైతచైతన్యజాగృతి 🕉🌞🌏🌙🌟🚩 *6. యజ్ఞం* ((((((((((🕉)))))))))) *అగ్ని సహాయంతో, మంత్రోచ్చారణతో విధ్యుక్తమైన కర్మలు చేయటమే యజ్ఞయంటే. ''యజ్ఞ'' మన్న పదం ''యజ్‌'' అనే ధాతువునుండి వచ్చింది. దీని అర్థం - ''ఆరాధించు'', లేక, ''సమర్పించు''.* *క్రతువుని మనసారా, పరమాత్మ పట్లా దేవతల పట్లా సంపూర్ణమైన భక్తి భావంతో నిర్వహించటమే యజ్ఞమంటే. ''మననం చేసేవాడిని రక్షించేది మంత్ర''మని చెప్పుకొన్నాం. పఠించేవాడిని కాపాడటం మంత్రం యొక్క విధి. మననమంటే మనసారా జపించటం. సాధారణంగా మంత్రాలని వినబడేట్టు ఉచ్ఛరించ వలసినా కొన్నిటిని మాత్రం అట్లా పలుకనక్కరలేదు. నిశ్శబ్దంగా జపించినా మంత్రాలు ఆయా నాడులను అనుకూలంగా ప్రకంపింప చేస్తాయి.* *దానినే బిగ్గరగా వల్లె వేస్తే దాని కొక మహనీయత ఉన్నట్టు తెలుస్తుంది - అర్థం తెలియక పోయినా పరవశింప చేస్తుంది. మనస్సులో ఉన్నది. వల్లెవేసినప్పుడు బయటకు వస్తుంది. అది శరీరకదలిక ద్వారా కార్యరూపం దాలుస్తుంది. వేదోక్తమైన విధినిర్వహణకు మనస్సు, వాక్కు, కాయమూ ఒకే విధంగా పని చెయ్యాలి - అన్నీ పరిపూర్ణంగా పాలుపంచుకొంటున్నట్లవుతుంది. అంటే, మననం శబ్ద రూపంలో నోటి ద్వారా బయటకు వచ్చి, శరీరం చేసే పని ద్వారా యజ్ఞమవుతుంది.* *అందువల్ల యజ్ఞము వేదోక్తమైన ముఖ్యమైన విధులలో ఒకటి. ఇతర మతాలలో లేదు: ఇటువంటి కర్మకాండ ఇతరమతాలలో లేదు. వేదాలపై ఆధారపడి యుండటం వల్ల మన మతాన్ని వైదిక మతమంటారు. దీనికీ, ప్రపంచంలో ఉన్న ఇప్పటి మతాలకీ ఒక ముఖ్య భేదముంది. క్రైస్తవమతం, ఇస్లాం ఇత్యాది మతాలు ''అందరూ ఆరాధించవలసిన దైవమొక్కడే'' అని అంటాయి.* *వేదాలు కూడా అన్ని ఆత్మలూ తనలోనే ఉన్న ఒకే ఒక దేవుడున్నాడంటాయి. కాని, ''ఒక దేవుడు'' అన్న భావాన్ని అనుభవసిద్ధం చేసుకోవటానికి చింతనద్వారా కలిగే జ్ఞానమవసరం. ఆ స్థితిని చేరుకోవటానికి వినీతి ఎంతో అవసరం. భగవంతునితో ఏకమైనప్పుడు మనకి గోచరించే జగత్తు మాయమవుతుంది : ఆ స్థితిని చేరుకోవాలి. ప్రాపంచక విషయాలలో తేలిపోయే మన జీవితాలను ఎంతో క్రమ శిక్షణకు లోను చేస్తేనే గాని ఆ స్థితిని చేరుకోలేం. ఈ వ్యాపకాలలో చిక్కుకొన్న మనం ధర్మమార్గాన పోవాలి, మనస్సుని క్షాళనం చేసి, పరిణతిని కలిగించే క్రతువులని చెయ్యాలి. ఆ స్థితిని చేరుకొన్న తరువాత ప్రాపంచక బంధాలు తెగిపోతాయి. ఆ గమ్యాన్ని చేరటానికి వేదాలు అనేక మార్గాలనూ, ఉపాయాలనూ సూచించాయి.* *వీటిలో యజ్ఞమనే కర్మ అతిముఖ్యమైనది. ఒకే ఒక దేవునికి కాక, అనేక దేవతలకు ఉపహారాలిస్తూ ఫలితాన్ని భగవంతునికి సమర్పించటమే యజ్ఞమంటే, యజ్ఞమన్నది మన మతానికి ప్రత్యేకం. ఏ ఇతర మతంలోనూ ఇది లేదు. వేదమంత్రాలని పఠిస్తూ వివిధ పదార్థాలని అగ్నికి ఆహుతి చెయ్యాలి యజ్ఞంలో. దీనిని ''హోమ'' మంటారు. అగ్నికి ఆహుతి చేసినా అన్నిటినీ అగ్నికే సమర్పిస్తున్నామని అర్థం కాదు. ప్రత్యేకంగా అగ్నికి సమర్పిస్తున్నట్టు మంత్రం చెప్పినప్పుడే అవి అగ్నికి చెందుతాయి.* *ఇతర దేవతలకి అంటే రుద్రునకూ, విష్ణువునకూ, ఇంద్రునకూ, వరుణునకూ, వాయువునకూ, సోమునకూ సమర్పించిన వాటిని వారికి చేరుస్తాడు అగ్నిదేవుడు. మిగిలిన మతాలకీ, వైదిక మతానికీ గల ముఖ్యమైన వ్యత్యాసమిదే. మనం కూడా ఒకే దేవుడ్ని విశ్వసించినా, ఆయనకే కాక ఇతర దేవతలకి కూడ అగ్ని ద్వారా ఉపహారాలర్పిస్తాం.మానవసేవ భగవంతునికి ప్రీతిపాత్రమంటాం. సంఘసేవకులు ''మానవసేవే మాధవసేవ - సమాజానికి సేవ భగవంతునికి సేవ'' అంటారు.* *ఆ విధంగానే యజ్ఞాల ద్వారా, భగవంతుని సృష్టియైన దేవతలకు యజ్ఞమూలకంగా సేవ చేయటం కూడ భగవంతుని అనుగ్రహాన్ని సంపాదించి పెడుతుంది. భగవంతు డొక్కడే అనీ, ఆయనే అనేక దేవతల రూపాలను ధరిస్తాడనీ వేదాలు నొక్కి చెప్పుతాయి. ఏ దేవతని వర్ణించినా, ఆ దేవత పరమాత్మ అంటాం. వేదాలు కూడా దైవమొక్కడే అని చెప్తాయి. భగవంతునికీ దేవతలకీ గల భేదాన్ని మాత్రమే అవి సూచిస్తాయి.* *ఎందరో దేవతలని భగవంతునిగా పేర్కొంటాయి కాబట్టి ''వేదాలు అనేక దేవుళ్లున్నారని అంటాయి'' అనుకోవటం తప్పు. ఒకే దేవుడు అనేక దేవతలుగా కనబడుతాడని అర్థం. విశ్వనియంత్రణకై అనేక దేవతలను సృష్టించాడు భగవంతుడు. ఈ దేవతలు వేరు వేరు విధులను నిర్వహించాలి - మన వలనే దేవతలు కూడ సృష్టింపబడ్డారు. మనని కూడ తననుండే సృష్టించాడు ఈశ్వరుడు.* *అద్వైత సిద్ధాంతం ప్రకారం జీవాత్మా, పరమత్మా ఒకటే. అందువల్ల పరమాత్మ దేవతలకు కూడ ప్రతినిధే. అద్వైత సిద్ధాంతాన్ని ఆకళింపు చేసుకొనే స్థితికి చేరుకొనే వరకూ - మనకూ దేవతలకూ భేదముందనుకొంటూ యజ్ఞాలూ, పూజలూ లోకశ్రేయస్సుకోసం చేస్తూండాలని వేదాలు నిర్దేశించాయి. ప్రకృతిలోని శక్తులూ, సర్వభూతాలూ పరమాత్ముని ఆదేశానుసారం, దేవతల ఆధీనంలో, ప్రవర్తిస్తాయి.* *కాబట్టి మనమూ, మనచుట్టూ ఉన్న ప్రపంచమూ ప్రకృతి శక్తులనుండి లబ్ధిని పొందాలంటే ఆయా అధిష్ఠాన దేవతలను సంతృప్తి పరచాలి. దేవతలు యజ్ఞాల వల్ల సంతుష్టులవుతారని వేదాలు చెప్తాయి. ఆధ్యాత్మికంగా మేల్కొన్నప్పుడూ పరమాత్ముని స్వయంగా గ్రహించినప్పుడూ విడిగా దేవతలని సంతృప్తి పరచవలసిన అవసరముండదు. మనం ద్వైత భావంతో ఉన్నంత కాలమూ ప్రతి దేవతనీ పూజించాలి. ఇది వేదవాక్కు.* 🕉🌞🌏🌙🌟🚩

కామెంట్‌లు లేవు: